Hyderabad: హైదరాబాద్ అంచుల్లో కుండపోత వర్షం.. రహదారులన్నీ జలమయం
రహదారులన్నీ జలమయం
Hyderabad: నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. కొద్ది నిమిషాల్లోనే రోడ్లు జలమయమై, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపుర్ మెట్, రామోజీ ఫిల్మ్‌సిటీ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రహదారులపై మోకాళ్ల లోతు నీరు నిలిచి, ట్రాఫిక్ స్తంభించిపోయింది. రామోజీ ఫిల్మ్‌సిటీ సమీపంలో గంటన్నరపాటు వర్షం కురవడంతో రోడ్లు చెరువులను తలపించాయి.
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై హయత్‌నగర్ సమీపంలో భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రహదారిపై నీరు మోకాళ్ల లోతు ప్రవహించడంతో నగరం వైపు వెళ్లే వాహనాలు ఆగిపోయాయి. పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రయత్నించారు.
మెదక్‌లో 13 సెం.మీ. వర్షపాతం
మెదక్ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా కేంద్రంలో మూడున్నర గంటల్లో 13 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రాజీపల్లిలో 9.2 సెం.మీ., పాతూర్‌లో 8 సెం.మీ. వర్షం కురిసింది. మెదక్ పట్టణంలో రోడ్లు చెరువుల్లా మారాయి. గాంధీనగర్ కాలనీలో వరద నీరు ఇళ్లలోకి చేరింది. మెదక్-హైదరాబాద్ హైవేపై వరద నీరు చేరడంతో అధికారులు జేసీబీ సాయంతో డివైడర్‌ను తొలగించి నీటిని ప్రవహించేలా చేశారు.