Traffic Jam in Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్
భారీ వర్షంతో ట్రాఫిక్ జామ్
Traffic Jam in Hyderabad: బుధవారం (సెప్టెంబర్ 17, 2025) సాయంత్రం హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, యూసఫ్‌గూడ, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఖైరతాబాద్, లక్డికాపూల్ వంటి ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. సరిగ్గా ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో రోడ్లపై వాహనాలు కిటకిటలాడాయి. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయి, భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా నగరంలోని పలు రోడ్లు చెరువులను తలపించాయి. ఇదిలా ఉండగా, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ ఆవర్తనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, సెప్టెంబర్ 17, 18 తేదీల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.