Bank Strike: దేశంలో ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సెప్టెంబర్ 11న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) తమ సుదీర్ఘ కాలపు డిమాండ్లపై నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నాయని తొమ్మిది బ్యాంక్ యూనియన్ల ఐక్యవేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవేళ ఈ సమ్మె జరిగితే వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు స్తంభించిపోయే ప్రమాదం ఉంది. సెప్టెంబర్ 11 శుక్రవారం కావడం, ఆ తర్వాత శని, ఆదివారాలు బ్యాంక్ సెలవులు కావడంతో వరుసగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుంది. కొన్ని రాష్ట్రాల్లో సెప్టెంబర్ 14న గణేష్ చతుర్థి పండుగ సెలవు కూడా ఉండటంతో వరుసగా నాలుగు రోజుల పాటు నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, చెక్కుల క్లియరెన్స్ వంటి సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. సెప్టెంబర్ 11న సమ్మె తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే, హాఫ్ ఇయర్లీ క్లోజింగ్ సమయమైన సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల సమ్మె, అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని యూనియన్లు స్పష్టం చేశాయి.

రెండేళ్లుగా పెండింగ్‌లోనే 5-డే బ్యాంకింగ్

వారానికి ఐదు రోజుల పని దినాల ప్రతిపాదనపై 2024 మార్చి 8న సంతకం చేసిన 12వ ద్వైపాక్షిక ఒప్పందంలో ఐబిఏ స్పష్టమైన హామీ ఇచ్చింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజువారీ పని వేళలను 40 నిమిషాల పాటు పెంచేందుకు ఉద్యోగులు అంగీకరించినప్పటికీ, ఈ సిఫార్సు గత రెండేళ్లకు పైగా ప్రభుత్వ వద్ద పెండింగ్‌లోనే ఉండిపోయింది. ప్రభుత్వ వ్యతిరేక వైఖరి వల్లే తాము సమ్మెబాట పట్టాల్సి వస్తోందని యుఎఫ్బియు ప్రతినిధులు వెల్లడించారు.

పిఎల్ఐ స్కీమ్‌పై పెల్లుబికిన అసంతృప్తి

కేంద్ర ఆర్థిక సేవల విభాగం (DFS) తీసుకొచ్చిన పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) విధానంపై బ్యాంక్ ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్కేల్-4 నుంచి ఆపై స్థాయి అధికారులకు మాత్రమే 365 రోజుల మూలవేతనాన్ని ఇన్సెంటివ్‌గా ఇస్తూ, స్కేల్-3 వరకు ఉండే ఉద్యోగులకు కేవలం 15 రోజుల మూలవేతనాన్ని మాత్రమే కేటాయించడం తీవ్ర వ్యత్యాసానికి దారితీస్తోందని విమర్శిస్తున్నారు. ఈ వివాదం ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు, కార్మిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నప్పటికీ బ్యాంకులు ఈ విధానాన్ని అమలు చేయడంపై మండిపడుతున్నారు.

పింఛనుదారులు, పెన్షన్ సవరణ డిమాండ్లు

ఈ సమ్మెలో కేవలం పని వేళలు, ఇన్సెంటివ్‌లే కాకుండా పెన్షన్ సవరణ, పెన్షనర్లందరికీ సమానమైన కరువు భత్యం (DA) లెక్కింపు, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) పరిధిలో ఉన్న ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం (OPS) ఎంచుకునే అవకాశం ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లు కూడా ఉన్నాయి. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించకపోతే ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావం పడేలా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బ్యాంక్ యూనియన్ల సమ్మె పిలుపుతో దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. సెప్టెంబర్ రెండో వారంలో ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు ఉన్నవారు ముందస్తుగానే ప్లానింగ్ చేసుకోవడం మంచిది.

Tags: