Rohit Sharma: క్రికెట్ మైదానంలో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో కోట్లాది మంది అభిమానులను అలరించిన టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు గేమింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. గేమింగ్ స్టూడియో లైట్‌ఫ్యూరీ గేమ్స్‎లో ఆయన భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది రాబోతున్న ఈ-క్రికెట్ గేమ్‌లో రోహిత్ శర్మ ఒక అధికారిక లైసెన్స్ పొందిన ప్లేయర్‌గా కనిపించనున్నారు. త్వరలోనే అభిమానులు తమ మొబైల్స్, డివైజ్ లలో రోహిత్ శర్మ రూపంలో వర్చువల్ సిక్సర్లు కొట్టవచ్చు. గేమింగ్ పట్ల యువతలో ఉన్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని లైట్‌ఫ్యూరీ గేమ్స్ ఈ కొత్త ప్రాజెక్ట్‌ను వేగవంతం చేసింది. సెప్టెంబర్ 2026 నాటికి ఈ-క్రికెట్ గేమ్ 'క్లోజ్డ్ బీటా వర్షన్' అందుబాటులోకి రానుంది. ఈ గేమ్ కోసం ఇప్పటికే 3 లక్షల కంటే ఎక్కువ మంది గేమర్లు సైన్-అప్ చేసుకున్నారు. ఇటీవలే విడుదలైన అధికారిక టీజర్‌కు యూట్యూబ్‌లో 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మకు ఉన్న సుదీర్ఘ అనుభవం ఈ గేమ్‌ను రియలిస్టిక్‌గా డిజైన్ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందని డెవలపర్లు చెబుతున్నారు.

ధోని, పాండ్యా బాటలో రోహిత్ శర్మ

లైట్‌ఫ్యూరీ గేమ్స్‌లో పెట్టుబడి పెట్టిన ఎనిమిదో భారతీయ క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలిచారు. అంతకుముందే మహేంద్ర సింగ్ ధోని, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, తిలక్ వర్మ, సాయి సుదర్శన్ ఈ కంపెనీలో స్ట్రాటజిక్ ఇన్వెస్టర్లుగా చేరారు. గ్లోబల్ క్రికెట్ గేమింగ్ ఫ్రాంచైజీ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఈ కంపెనీ 2026లో ఏకంగా 1.1 కోట్ల డాలర్ల (రూ.90 కోట్లకు పైగా) ఫండింగ్ సేకరించడం విశేషం.

అల్టిమేట్ స్క్వాడ్‌తో సొంత టీమ్ నిర్మాణం

ఈ గేమ్‌లో అల్టిమేట్ స్క్వాడ్ మోడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 700 మందికి పైగా రియల్ క్రికెటర్ల డేటాను ఇందులో చేర్చారు. గేమర్లు తమకు నచ్చిన కాంబినేషన్‌తో సొంత డ్రీమ్ టీమ్‌ను తయారు చేసుకోవచ్చు. దీనికి తోడు మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ తన బ్రాండ్ వాయిస్‌తో చెప్పే హిందీ కాంట్రాస్ట్ కామెంట్రీ ఆటగాళ్లకు అసలైన మైదానం అనుభూతిని ఇస్తుంది.

భారత్ నుంచి గ్లోబల్ గేమింగ్ విప్లవం

2024లో కరణ్ ష్రాఫ్, అనురాగ్ బెనర్జీ, టీనా బాలచంద్రన్ కలిసి లైట్‌ఫ్యూరీ గేమ్స్‌ సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం 120 మందికి పైగా డెవలపర్లు ఈ గేమ్ కోసం శ్రమిస్తున్నారు. భారత్ నుంచి ప్రపంచస్థాయి గేమింగ్ ఫ్రాంచైజీని నిర్మించడమే తమ లక్ష్యమని సంస్థ ప్రకటించింది. రోహిత్ శర్మ కూడా లైట్‌ఫ్యూరీ విజన్‌ను ప్రశంసించారు. సెప్టెంబర్‌లో బీటా టెస్టింగ్ పూర్తయిన తర్వాత ఈ ఏడాది చివర్లో గేమ్ అందరికీ అందుబాటులోకి రానుంది. రోహిత్ శర్మ రాకతో ఈ-క్రికెట్ గేమ్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మైదానంలోనే కాకుండా గేమింగ్ స్క్రీన్‌పై కూడా రోహిత్ మార్క్ విధ్వంసాన్ని చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags: