India US Relations : ట్రంప్ మనసు మార్చుకున్నారా? అమెరికా నిర్ణయంతో భారత్‌పై తగ్గనున్న 50 వేల కోట్ల భారం
అమెరికా నిర్ణయంతో భారత్‌పై తగ్గనున్న 50 వేల కోట్ల భారం
India US Relations : అమెరికా ప్రభుత్వం నుంచి భారతదేశానికి ఒక భారీ ఊరట లభించే సూచనలు కనిపిస్తున్నాయి. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు భారత్‌పై అమెరికా విధించిన భారీ టారిఫ్ త్వరలోనే తొలగిపోయే అవకాశం ఉంది. ఈ నిర్ణయం అమలైతే భారత ఖజానాకు ఏకంగా రూ.50,000 కోట్లకు పైగా లబ్ధి చేకూరుతుందని అంచనా. ప్రపంచ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్న తరుణంలో అమెరికా తీసుకుంటున్న ఈ వెనకడుగు భారత్‌కు ఆర్థికంగా పెద్ద ప్లస్ కానుంది.
అమెరికా ఆర్థిక కార్యదర్శి స్కాట్ బేసెంట్ తాజాగా చేసిన వ్యాఖ్యలు భారత ఆర్థిక రంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై గతంలో అమెరికా 25 శాతం టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ టారిఫ్ అమలు చేయడం వల్ల భారత రిఫైనరీలు రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించాయని, తద్వారా అమెరికా లక్ష్యం నెరవేరిందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు ఆ టారిఫ్‌ను తొలగించే దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. దీనివల్ల భారత్‌కు దాదాపు 5 బిలియన్ డాలర్ల (రూ.50,000 కోట్లు) మేర ఆదా అవుతుందని అంచనా.
నిజానికి.. 2025 ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాలను 50 శాతానికి పెంచారు, ఇందులో 25 శాతం ప్రత్యేకంగా రష్యా ఆయిల్ కోసమే విధించారు. అయితే ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ మీటింగ్‌లో ట్రంప్ స్వయంగా మాట్లాడుతూ, ప్రధాని మోదీ తనకు అత్యంత సన్నిహిత మిత్రుడని, భారత్‌తో త్వరలోనే ఒక భారీ వాణిజ్య ఒప్పందానికి చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. యూరప్ దేశాలు భారత్‌తో ట్రేడ్ డీల్స్ చేసుకోవాలని చూస్తుండటం, అమెరికాకు యూరప్‌తో కొన్ని విభేదాలు ఉండటంతో.. భారత్‌ను తమ వైపు తిప్పుకోవడానికి అమెరికా ఈ రాయితీలు ప్రకటించే అవకాశం ఉంది.
భారత్ తన శక్తి అవసరాల విషయంలో ఎప్పుడూ ఇండియా ఫస్ట్ పాలసీకే కట్టుబడి ఉంది. తన 140 కోట్ల జనాభాకు తక్కువ ధరకు ఇంధనాన్ని అందించడమే తన ప్రాధాన్యతని భారత్ పదే పదే స్పష్టం చేస్తూ వస్తోంది. అమెరికా కాంగ్రెస్‌లో రష్యా నుండి చమురు కొనే దేశాలపై 500 శాతం వరకు టారిఫ్ విధించాలనే బిల్లుపై చర్చ జరుగుతున్నప్పటికీ, భారత్ మాత్రం తన వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని వీడలేదు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న అతిపెద్ద దేశాల్లో భారత్ ఒకటి కావడం వల్ల, వాషింగ్టన్ ఒత్తిడి పెంచుతున్నప్పటికీ ఢిల్లీ మాత్రం తన జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోంది.
ట్రంప్ ప్రభుత్వం నుండి వస్తున్న ఒత్తిడి, అంతర్జాతీయ ఆంక్షల కారణంగా గడిచిన డిసెంబర్ నెలలో భారత రిఫైనరీలు రష్యా నుంచి దిగుమతులను కొంత మేర తగ్గించాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి పెద్ద సంస్థలు రష్యా నుండి చమురు దిగుమతిని జనవరిలో తాత్కాలికంగా నిలిపివేసి, మధ్యప్రాచ్యం, 00 లాటిన్ అమెరికా వంటి ప్రత్యామ్నాయ మార్గాల వైపు మొగ్గు చూపాయి. అయితే, ఇప్పుడు అమెరికా టారిఫ్ల తొలగింపుపై సానుకూల సంకేతాలు ఇవ్వడంతో, మళ్లీ తక్కువ ధరకే రష్యా చమురును భారత్ పొందే అవకాశం ఉంది. ఈ నెలాఖరు నాటికి భారత చమురు దిగుమతులపై ఒక స్పష్టమైన చిత్రం వచ్చే అవకాశం ఉంది.