Mutual Fund : మ్యూచువల్ ఫండ్లలో కాసుల వర్షం.. రూ.82 లక్షల కోట్లకు చేరిన మొత్తం ఆస్తుల విలువ
రూ.82 లక్షల కోట్లకు చేరిన మొత్తం ఆస్తుల విలువ
Mutual Fund : స్టాక్ మార్కెట్లో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ, భారతీయ పెట్టుబడిదారులు మ్యూచువల్ ఫండ్లపై తమ నమ్మకాన్ని గట్టిగా ఉంచుతున్నారు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరి నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి పెట్టుబడులు ఏకంగా 8 శాతం పెరిగి రూ.25,978 కోట్లకు చేరాయి. జనవరిలో ఈ పెట్టుబడులు రూ.24,028 కోట్లుగా ఉండటం గమనార్హం. ఈ భారీ పెట్టుబడులతో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ మొత్తం నిర్వహణ ఆస్తుల విలువ ఫిబ్రవరి నాటికి రూ.82 లక్షల కోట్లకు ఎగబాకింది.
ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లదే హవా
పెట్టుబడిదారులు ఎక్కువగా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఒక్క విభాగంలోనే అత్యధికంగా రూ.6,924.65 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత మిడ్ క్యాప్ ఫండ్లలో రూ.4,003 కోట్లు, స్మాల్ క్యాప్ ఫండ్లలో రూ.3,881 కోట్ల మేర పెట్టుబడులు వెల్లువెత్తాయి. లార్జ్ క్యాప్ ఫండ్లలో రూ.2,112 కోట్ల మేర నిధులు వచ్చి చేరాయి. అయితే, పన్ను ఆదా చేసే ఈఎల్ఎస్ఎస్ పథకాల నుంచి మాత్రం రూ.650 కోట్ల నిధులు వెనక్కి వెళ్లడం విశేషం.
యుద్ధం ఉన్నా.. ఇండియాపైనే ఆశలు
ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మార్కెట్‌ను కొంత కలవరపెడుతున్న మాట వాస్తవమే. దీనివల్ల రాబోయే రోజుల్లో మార్కెట్లో కొంత అస్థిరత ఉండవచ్చని యాంఫీ సీఈఓ వెంకట్ ఎన్. చలసాని హెచ్చరించారు. అయినప్పటికీ, భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాలు ఇన్వెస్టర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపాయని, అందుకే పెట్టుబడులు పెరుగుతున్నాయని ఆయన విశ్లేషించారు. ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నా, భారత ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలంలో బలంగానే ఉంటుందనే నమ్మకం ఇన్వెస్టర్లలో కనిపిస్తోంది.
డెట్ ఫండ్ల పరిస్థితి ఏంటి?
గత డిసెంబర్, జనవరి నెలలతో పోలిస్తే ఫిబ్రవరిలో గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడుల వేగం కొంత తగ్గింది. జనవరిలో రూ.24,040 కోట్లు రాగా, ఫిబ్రవరిలో ఇది రూ.5,255 కోట్లకు పరిమితమైంది. అటు డెట్ మ్యూచువల్ ఫండ్ల విషయానికి వస్తే, గత నెలలో రూ.42,106 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మొత్తంగా చూస్తే, మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలోకి ఫిబ్రవరిలో రూ.94,530 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. ఇదంతా చూస్తుంటే, సామాన్యులు ఇప్పుడు పొదుపు కంటే పెట్టుబడికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.