8th Pay Commission: కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 8వ వేతన సంఘం ముందు 5 ప్రధాన డిమాండ్లు
ప్రధాన డిమాండ్లు
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు త్వరలోనే పెద్ద ఊరట లభించనుంది. 8వ వేతన సంఘం సమావేశాల్లో పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, కనీస వేతనాన్ని ఏకంగా రూ.68,000కు పెంచడం వంటి ఐదు ప్రధాన డిమాండ్లపై విస్తృతమైన చర్చలు జరిగాయి. ఈ సిఫార్సులు అమల్లోకి వస్తే లక్షలాది కుటుంబాల భవిష్యత్తు పూర్తిగా మారిపోనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన నిర్మాణం, పెన్షనర్ల భవిష్యత్తును నిర్ణయించే 8వ వేతన సంఘం తన పనిని వేగవంతం చేసింది. సెప్టెంబర్ 7, 8 తేదీల్లో చెన్నైలో అత్యంత కీలకమైన సమావేశం జరిగింది. అర్హత కలిగిన ఉద్యోగ సంఘాలు, విశ్రాంత ఉద్యోగుల ప్రతినిధులతో కమిషన్ ప్రతినిధులు సమావేశమై వారి సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి తుది నివేదిక సమర్పించడానికి ముందే అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించడమే లక్ష్యంగా ఈ సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఉద్యోగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, పెన్షన్ వివాదాలను పరిష్కరించడంపై ఈ భేటీలో ప్రధానంగా దృష్టి సారించారు.
కమిషన్ ముందు ఉంచిన 5 ప్రధాన డిమాండ్లు
ఈ సమావేశంలో చెన్నై జిపిఓ పెన్షనర్స్ ఫోరమ్ ఉద్యోగుల తరఫున ఐదు కీలక వినతులను కమిషన్‌కు అందజేసింది. ఇందులో మొదటిది, ఉద్యోగులు సుదీర్ఘకాలంగా పోరాడుతున్న పాత పెన్షన్ విధానం (OPS) పునరుద్ధరణ. రెండో డిమాండ్‌గా పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ మొత్తాన్ని పెంచి రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలని కోరారు. మూడో అంశం కమ్యూటేషన్ రికవరీ నిబంధనల నుంచి ఉపశమనం కల్పించడం, నాలుగోదిగా ఎంఏసిపి ప్రయోజనాల్లో మార్పులు చేసి ప్రమోషన్ అవకాశాలు పెంచడంతో పాటు తపాలా శాఖ ఉద్యోగుల వేతన స్కేలును మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు. ఐదో డిమాండ్‌గా మెరుగైన భత్యాలు, సులువైన సెలవు నిబంధనలు అందించాలని గట్టిగా కోరారు.
రూ.68,000 కనీస వేతనంపై ప్రతిపాదనలు
పెన్షన్ సవరణలతో పాటు ఉద్యోగుల జీతభత్యాలపై కూడా సంఘాల ప్రతినిధులు సంచలన ప్రతిపాదనలు చేశారు. నిత్యావసరాల ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఉద్యోగుల కనీస వేతనాన్ని రూ.68,000కు పెంచాలని ప్రతిపాదించారు. ప్రతిసారి పదేళ్ల సమయం తీసుకోకుండా వేతనాల సవరణ కోసం ఒక శాశ్వతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుత పే-మాట్రిక్స్ స్థానంలో రన్నింగ్ స్కేల్ విధానాన్ని తీసుకురావాలని విన్నవించారు. మహిళా ఉద్యోగుల ప్రత్యేక అవసరాలు, దివ్యాంగ ఉద్యోగులకు ఎదురవుతున్న పనివేళల ఇబ్బందుల నివారణపై ప్రత్యేక చర్చలు జరిగాయి.
మే-జూన్ 2027 నాటికి తుది నివేదిక
జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నాయకత్వంలో 2025 నవంబర్ 3న ఈ 8వ వేతన సంఘం ఏర్పాటైంది. కేంద్ర ప్రభుత్వం ఈ కమిషన్‌కు 18 నెలల కాలపరిమితిని కేటాయించింది. ఇప్పటికే 10 నెలల కాలపరిమితి పూర్తయినందున, కమిషన్ వేగంగా పావులు కదుపుతోంది. అనుకున్న సమయానికి అంటే మే లేదా జూన్ 2027 నాటికి తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చెన్నై భేటీల అనంతరం తదుపరి రౌండ్ సమావేశాలను సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో చండీగఢ్‌లో నిర్వహించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది.