BRICS 2026: న్యూఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 12, 13 తేదీల్లో అత్యంత ప్రతిష్టాత్మక బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానుంది. 20వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ 11 దేశాల కూటమి, డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించి స్థానిక కరెన్సీల్లో వ్యాపారం చేయడానికి సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఈ వేదికగా భారత్ తీసుకునే నిర్ణయాలపై ప్రపంచ దేశాల దృష్టి నెలకొంది. రెండు దశాబ్దాల క్రితం బ్రెజిల్, రష్యా, భారత్, చైనాల కలయికతో మొదలైన ఈ కూటమి ఈరోజు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియాల చేరికతో ఈ కూటమి పరిధి గణనీయంగా విస్తరించింది. నేడు ప్రపంచ జనాభాలో సగం మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రిక్స్, ప్రపంచచమురు ఉత్పత్తిలో అగ్రభాగాన్ని ఏలుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల తరఫున గళం ఎత్తేందుకు భారత్ ఈ వేదికను ఎప్పటికప్పుడు సమర్థవంతంగా వాడుకుంటోంది.

చైనా, రష్యాలతో సంక్లిష్టమైన దౌత్య బ్యాలెన్స్

ఈ సదస్సు భారత్‌కు ఎంతో ప్రాముఖ్యమైన దౌత్యపరమైన అవకాశాన్ని అందిస్తోంది. షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశం ముగిసిన కొద్ది రోజులకే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌లతో ప్రధాని నరేంద్ర మోదీ ఒకే వేదికపైకి రానున్నారు. ఒకవైపు చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, మరోవైపు ఇంధన భద్రత, రక్షణ అవసరాల కోసం రష్యాతో సత్సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ సమీకరణాలను సమతుల్యం చేసుకుంటూనే, దేశీయ ప్రయోజనాలు కాపాడుకోవడంలో భారత్ చొరవ చూపించనుంది.

అమెరికన్ డాలర్‌పై స్వదేశీ కరెన్సీల దండయాత్ర

ఈ సదస్సులో అందరినీ ఆకర్షిస్తున్న ప్రధాన అంశం క్రాస్ బోర్డర్ పేమెంట్స్. అమెరికన్ డాలర్ స్థానంలో సొంత కరెన్సీలైన రూపాయి, రూబుల్, యువాన్‌లలో చెల్లింపులు జరిపేలా కొత్త విధానాన్ని రూపొందిస్తున్నారు. అయితే ఇది డాలర్ వ్యతిరేక ప్రచారం కాదని, వ్యాపార ఖర్చులను తగ్గించుకునేందుకు చేస్తున్న ప్రయత్నమని భారత వాణిజ్య శాఖ స్పష్టం చేసింది. సాధారణ బ్రిక్స్ కరెన్సీ తెచ్చే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేస్తూనే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించిన ప్రకారం సభ్య దేశాల డిజిటల్ కరెన్సీలను అనుసంధానించే దిశగా అడుగులు వేస్తున్నారు.

ఇంధన భద్రతే లక్ష్యంగా అడుగులు

సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాన్, రష్యా లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తుల దేశాలు, భారత్, చైనా వంటి అతిపెద్ద వినియోగదారుల దేశాలు ఈ కూటమిలో ఉన్నాయి. చమురు ఉత్పత్తిదారులకు శాశ్వత మార్కెట్ కావలసి ఉండగా, భారత్‌ లాంటి వినియోగదారులకు తక్కువ ధరకే సురక్షితమైన ఇంధనం అవసరం. ఈ పరస్పర ప్రయోజనాల దృష్ట్యా 2026-30 కాలానికి ఇంధన సరఫరా, కొత్త టెక్నాలజీల బదిలీపై కీలక ఒప్పందాలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Tags: