8th Pay Commission : డీఏ విలీనంపై సర్కార్ బాంబు..ఉద్యోగులకు పాత జీతాలేనా?

ఉద్యోగులకు పాత జీతాలేనా?

Update: 2026-01-19 02:52 GMT

8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మధ్య ప్రస్తుతం ఒకే ఒక అంశం హాట్ టాపిక్‌గా మారింది. అదే డీఏ విలీనం. ఎనిమిదో వేతన సంఘం అమలు కావడానికి ఇంకా సమయం పట్టేలా ఉండటంతో, ప్రస్తుత కరువు భత్యాన్ని బేసిక్ శాలరీలో కలిపేస్తారనే వార్తలు షికారు చేస్తున్నాయి. 7వ వేతన సంఘం గడువు డిసెంబర్ 31, 2025తో ముగిసింది. ఇప్పుడు 2026 జనవరి-జూన్ కాలానికి పెరగబోయే డీఏ.. పాత వేతన సంఘం పరిధిలోకి రాదు. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంటుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సాధారణంగా ఏదైనా వేతన సంఘం తన నివేదిక ఇవ్వడానికి కనీసం 18 నెలల సమయం తీసుకుంటుంది. ఆ తర్వాత కేంద్ర క్యాబినెట్ ఆమోదం, అమలు ప్రక్రియ పూర్తి కావడానికి మరో 6 నెలలు పడుతుంది. అంటే 8వ వేతన సంఘం సిఫార్సులు 2027 చివరి నాటికి కానీ అమలులోకి రావు. ఈ గ్యాప్‌లో ఉద్యోగులకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించేందుకు.. ప్రస్తుతం ఉన్న 58 శాతం డీఏను బేసిక్ పేలో విలీనం చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం మాత్రం విముఖత చూపుతోంది.

ప్రభుత్వం ఏమంటోంది?

డీఏ విలీనంపై ఎలాంటి ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని డిసెంబర్ 2025లో పార్లమెంట్ సాక్షిగా కేంద్రం స్పష్టం చేసింది. ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి పెంచే డీఏ/డీఆర్ సరిపోతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ద్రవ్యోల్బణ సూచీ ఆధారంగా మారుతూ ఉంటుంది కాబట్టి, విలీనం చేయాల్సిన అవసరం లేదని కేంద్రం వాదిస్తోంది. దీనివల్ల బేసిక్ పే పెరగదు, ఫలితంగా హెచ్ఆర్ఏ, టీఏ వంటి ఇతర అలవెన్సులు కూడా పెరగవు.

ఉద్యోగులు ఎందుకు పట్టుబడుతున్నారు?

డీఏను బేసిక్ పేలో కలిపితే జీతం గణనీయంగా పెరుగుతుంది. బేసిక్ పే పెరిగితే దానిపై ఆధారపడి ఉండే ఇతర భత్యాలు కూడా ఆటోమేటిక్ గా పెరుగుతాయి. అలాగే పెన్షన్ లెక్కల్లో కూడా భారీ ప్రయోజనం చేకూరుతుంది. గతంలో 5వ వేతన సంఘం సమయంలో డీఏ 50 శాతానికి చేరగానే దానిని బేసిక్ పేలో కలిపేవారు. ఆ నిబంధన ప్రకారమే 2004లో డీఏ విలీనం జరిగింది. కానీ 6వ వేతన సంఘం దీనిని వ్యతిరేకించింది. డీఏ కలిపితే భవిష్యత్తులో డీఏ లెక్కించే విధానంలో ఇబ్బందులు వస్తాయని అప్పట్లో నివేదిక ఇచ్చారు. అందుకే అప్పటి నుంచి డీఏ విలీనం నిలిచిపోయింది.

ఇకపై ఏం జరుగుతుంది?

ప్రస్తుత పరిస్థితుల్లో డీఏ విలీనం జరిగే అవకాశాలు దాదాపు శూన్యం. 8వ వేతన సంఘం తన సిఫార్సులను ఇచ్చేంత వరకు ఉద్యోగులు, పెన్షనర్లు ప్రతి ఆరు నెలలకు ఒకసారి పెరిగే డీఏ పెంపుతోనే సర్దుకుపోవాల్సి ఉంటుంది. వేతనాల సవరణ కోసం మరో ఏడాదిన్నర పాటు నిరీక్షణ తప్పదు. ప్రభుత్వం ఏవైనా మధ్యంతర భృతి ప్రకటిస్తే తప్ప ఉద్యోగుల జేబులు నిండేలా కనిపించడం లేదు.

Tags:    

Similar News