AC Prices : ఎండాకాలం వచ్చినా పెరగని ఏసీల అమ్మకాలు.. కారణం తెలిస్తే షాకే

కారణం తెలిస్తే షాకే

Update: 2026-03-23 07:18 GMT

AC Prices : వేసవి ఎండలు మొదలవ్వక ముందే ఏసీ ప్రియులకు, సామాన్య వినియోగదారులకు బ్యాడ్ న్యూస్ వచ్చేసింది. ఒకవైపు అకాల వర్షాలు ఏసీ కంపెనీల ఆశలపై నీళ్లు చల్లుతుంటే, మరోవైపు అంతర్జాతీయ ఉద్రిక్తతలు ధరల మంటను పెంచుతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఏసీలు, ఫ్రిజ్ లు, వాషింగ్ మెషీన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. అటు వాతావరణం, ఇటు ముడిసరుకుల ధరలు.. రెండూ కలిసి సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా కనిపిస్తున్నాయి. సాధారణంగా మార్చి నెల వచ్చిందంటే ఏసీలు, కూలర్ల అమ్మకాలు జోరందుకుంటాయి. కానీ ఈ ఏడాది దేశవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు ఏసీ కంపెనీలను ఆందోళనలో పడేశాయి. వాతావరణం చల్లబడటంతో వినియోగదారులు ఏసీల కొనుగోళ్లను వాయిదా వేస్తున్నారు. ఉత్తర భారత దేశంలో ఉష్ణోగ్రతలు ఇంకా పెరగకపోవడం అమ్మకాలపై ప్రభావం చూపుతోంది. అయితే ఏప్రిల్ నెలలోనైనా భానుడు తన ప్రతాపం చూపిస్తే, డిమాండ్ పుంజుకుంటుందని గోద్రేజ్ ఎంటర్ ప్రైజెస్ గ్రూప్ ప్రతినిధి కమల్ నంది ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్లాస్టిక్ ధరల మోత

పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు భారత గృహోపకరణాల మార్కెట్‌ను దెబ్బతీస్తున్నాయి. యుద్ధం కారణంగా క్రూడాయిల్ ధరలు పెరగడంతో, దానికి అనుబంధంగా ఉండే ప్లాస్టిక్ ధరలు ఆకాశాన్నంటాయి. వాషింగ్ మెషీన్ వంటి వస్తువుల తయారీలో 20 శాతం ప్లాస్టిక్ వాడకం ఉంటుంది. దీనివల్ల తయారీ వ్యయం 10 నుండి 12 శాతం వరకు పెరిగిందని హైయర్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్.ఎస్.సతీష్ తెలిపారు. ఈ భారాన్ని కంపెనీలు వినియోగదారులపైకి నెట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఉత్పత్తిలో 30 శాతం కోత

పరిశ్రమలకు మరో పెద్ద సమస్య ఎల్‌పీజీ గ్యాస్ సరఫరా. ప్రభుత్వం గృహావసరాలకు ప్రాధాన్యతనిస్తూ, పరిశ్రమలకు ఇచ్చే గ్యాస్ కోటాను 80 శాతం నుంచి 65 శాతానికి తగ్గించింది. ఏసీల తయారీలో కీలకమైన పెయింటింగ్, డ్రాయింగ్ ప్రాసెస్ కోసం ఈ గ్యాస్ ఎంతో అవసరం. గ్యాస్ కొరత ఇలాగే కొనసాగితే, వేసవి రద్దీ సమయంలో ఉత్పత్తిని 20 నుంచి 30 శాతం వరకు తగ్గించుకోవాల్సి వస్తుందని కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. ఇది మార్కెట్లో ఏసీల కొరతకు, తద్వారా ధరల పెరుగుదలకు దారితీస్తుంది.

ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అమలు

ఇప్పటికే జనవరి నుంచి అమలులోకి వచ్చిన కొత్త ఎనర్జీ లేబులింగ్ నిబంధనల వల్ల ఏసీల ధరలు కొంత పెరిగాయి. ఇప్పుడు రవాణా ఖర్చులు, ముడిసరుకుల ధరలు తోడవడంతో ఏప్రిల్ 1 నుంచి ఏసీల ధరలను మరో 5 నుంచి 10 శాతం పెంచేందుకు గోద్రేజ్ వంటి కంపెనీలు సిద్ధమయ్యాయి. దీనివల్ల వినియోగదారులు ప్రీమియం మోడళ్ల కంటే తక్కువ ధరలో వచ్చే బేసిక్ మోడళ్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. చల్లదనం కోసం చూస్తున్న సామాన్యుడికి ఈ వేసవి ఖరీదైనదిగా మారబోతోంది.

Tags:    

Similar News