RBI : బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్.. బల్క్ డిపాజిట్ నిబంధనల్లో మార్పులు చేసిన రిజర్వ్ బ్యాంక్
మార్పులు చేసిన రిజర్వ్ బ్యాంక్
RBI : భారతీయ రిజర్వ్ బ్యాంక్ దేశీయ బ్యాంకింగ్ రంగం, పెద్ద పెట్టుబడిదారులకు మేలు చేకూరేలా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. సమాన వ్యవధి ఉన్న బల్క్ డిపాజిట్లపై జమ చేసిన మొత్తం పరిమాణాన్ని బట్టి వేర్వేరు వడ్డీ రేట్లను ఆఫర్ చేసేందుకు బ్యాంకులకు అనుమతినిచ్చింది. జులై 30న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో, లిక్విడిటీ కవరేజ్ రేషియో (LCR) ఫ్రేమ్‌వర్క్ కింద బ్యాంకులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధన సాధారణ రూపాయి డిపాజిట్లతో పాటు ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లకు కూడా వర్తిస్తుందని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.
అసలు బల్క్ డిపాజిట్ అంటే ఏమిటి?
ఆర్బీఐ నిబంధనల ప్రకారం సాధారణ కమర్షియల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులలో ఒకేసారి రూ. 3 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తంలో చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లను (FD) బల్క్ డిపాజిట్ అని పిలుస్తారు. రీజినల్ రూరల్ బ్యాంకులలో అయితే ఈ పరిమితి రూ.కోటిగా ఉంటుంది. అంతకన్నా తక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లను రిటైల్ డిపాజిట్లు అని అంటారు. కొత్త రూల్స్ ప్రకారం.. బ్యాంకులు ఏ రోజుకారోజు ఉదయం 10 గంటలకల్లా బల్క్ డిపాజిట్లపై తమ వడ్డీ రేట్లను వెల్లడించాలి, దీనికి 10 నిమిషాల గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది.
హెచ్‌డీఎఫ్‌సీ వివాదం నేపథ్యంలో వచ్చిన మార్పులు
ఇటీవల దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బల్క్ డిపాజిట్లను ఆకర్షించేందుకు ఎంఎస్‌ఆర్‌డీసీకి రూ. 45 కోట్లను మార్కెటింగ్ ఖర్చులు పేరుతో చెల్లించిందనే ఆరోపణలు సంచలనం సృష్టించాయి. సాధారణ సేవింగ్స్ రేటు కన్నా ఎంతో ఎక్కువ వడ్డీ ఇవ్వడంతో వచ్చిన ఈ వివాదంపై హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన ఉన్నతాధికారులపై చర్యలు కూడా తీసుకుంది. ఇటువంటి పద్ధతులకు చెక్ పెట్టడానికే, బ్యాంకులు తమ అవసరాలకు తగ్గట్లుగా డిపాజిట్ మొత్తాన్ని బట్టి పారదర్శకంగా అధిక వడ్డీలు ఇచ్చే అవకాశాన్ని ఆర్బీఐ కల్పించింది.
ఎవరికి లాభం? మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం పడుతుంది?
ఈ మార్పు వల్ల పెద్ద ఎత్తున నిధులు అవసరమైనప్పుడు బ్యాంకులు రూ. 10 కోట్లు, రూ. 50 కోట్లు, రూ. 100 కోట్లు జమ చేసే కార్పొరేట్ సంస్థలు, ట్రస్ట్‌లు, హెచ్ఎన్‌ఐ పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఇచ్చి నిధులు సేకరించవచ్చు. రూ. 3 కోట్ల కంటే తక్కువ జమ చేసే రిటైల్ డిపాజిటర్లకు ఉన్న పాత వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు ఉండదు. మార్కెట్‌లో క్రెడిట్ డిమాండ్ వేగంగా పెరుగుతున్న తరుణంలో, బ్యాంకింగ్ వ్యవస్థలో స్థిరత్వాన్ని పెంచేందుకు ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.