Agri Budget 2026 : అన్నదాతకు బడ్జెట్ భరోసా..రూ.1.62లక్షల కోట్లతో వ్యవసాయ రంగానికి కొత్త కళ

రూ.1.62లక్షల కోట్లతో వ్యవసాయ రంగానికి కొత్త కళ

Update: 2026-02-02 07:18 GMT

Agri Budget 2026 : కేంద్ర బడ్జెట్ 2026-27 అన్నదాతలకు అదిరిపోయే తీపి కబురు అందించింది. వ్యవసాయ రంగాన్ని కేవలం సాగుకే పరిమితం చేయకుండా, లాభసాటి వ్యాపారంగా మార్చేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాస్టర్ ప్లాన్ వేశారు. ఈసారి వ్యవసాయ రంగానికి ఏకంగా రూ.1,62,671 కోట్లు కేటాయించారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 7 శాతం ఎక్కువ. కేవలం వరి, గోధుమలే కాకుండా కాజు, బాదం, కొబ్బరి వంటి ఖరీదైన పంటలతో రైతుల జేబులు నింపడమే ఈ బడ్జెట్ అసలు లక్ష్యం.

వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించేందుకు మోదీ ప్రభుత్వం ఈసారి భారీగా నిధులు కుమ్మరించింది. 2013-14లో కేవలం రూ.21,934 కోట్లు ఉన్న వ్యవసాయ బడ్జెట్, నేడు రూ.1.62 లక్షల కోట్లకు చేరడం గమనార్హం. ఈ నిధులతో కేవలం పాత పద్ధతులే కాకుండా, రైతులకు ఎక్కువ ఆదాయం తెచ్చే పంటలపై దృష్టి సారించారు. ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతాల్లో కొబ్బరి, చందనం, కోకో, జీడిపప్పు సాగును ప్రోత్సహించనున్నారు. దేశంలో దాదాపు 3 కోట్ల మంది కొబ్బరి సాగుపై ఆధారపడి ఉన్నారని గుర్తించిన ప్రభుత్వం, కొత్త కొబ్బరి ప్రోత్సాహక పథకం ద్వారా పాత చెట్ల స్థానంలో అధిక దిగుబడినిచ్చే రకాలను నాటనుంది.

అలాగే, డ్రై ఫ్రూట్స్ మార్కెట్‌లో భారత్‌ను స్వయంసమృద్ధిగా మార్చడానికి అక్రోట్, బాదం, పైన్ నట్స్ వంటి పంటలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 2030 నాటికి భారతీయ జీడిపప్పు, కోకోను ప్రపంచస్థాయి బ్రాండ్లుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అటు ఈశాన్య రాష్ట్రాల్లో అగరు చెక్క సాగును ప్రోత్సహించడం ద్వారా అక్కడి రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచనున్నారు. చందనం సాగులో కూడా శాస్త్రీయ పద్ధతులను ప్రవేశపెట్టి, మన దేశానికి ఉన్న పురాతన గుర్తింపును మళ్లీ తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్రం పనిచేయనుంది.

టెక్నాలజీ పరంగా చూస్తే, భారత్ విస్తార్ అనే కొత్త ఏఐ టూల్‌ను ప్రకటించారు. ఇది బహుభాషా సాఫ్ట్‌వేర్. అంటే రైతులు తమ మాతృభాషలోనే సాగుకు సంబంధించిన సలహాలు, సూచనలు పొందవచ్చు. ఇది కేవలం గూగుల్ సెర్చ్ లాంటిది కాదు, నేరుగా ఎగ్రిస్టాక్, ఐకార్ డేటాతో అనుసంధానమై ఉంటుంది. దీనివల్ల వాతావరణ మార్పులు, తెగుళ్ల నివారణ వంటి అంశాలపై రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందుతుంది. ఇక పశుసంవర్ధక, మత్స్య రంగాల కోసం కూడా ప్రత్యేక సబ్సిడీలు, 500 జలాశయాల అభివృద్ధి వంటి పథకాలను ప్రకటించి, గ్రామీణ యువతకు భారీగా ఉపాధి అవకాశాలను కల్పించనున్నారు.

Tags:    

Similar News