US Stock Market: ఏఐ బుడగ పేలిపోతోందా? అమెరికా మార్కెట్లో 4 ట్రిలియన్ డాలర్లు ఆవిరి
| 4 ట్రిలియన్ డాలర్లు ఆవిరి
US Stock Market: అమెరికా స్టాక్ మార్కెట్లో ఈ వారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ షేర్లు కుప్పకూలాయి. ఇన్వెస్టర్ల ఆందోళనతో పెద్ద ఎత్తున అమ్మకాలు జరగడంతో మార్కెట్ సూచీలన్నీ భారీ నష్టాలను చవిచూశాయి. ముఖ్యంగా టెక్ కంపెనీల ప్రధాన సూచీ నాస్డాక్ ఏకంగా 5.28 శాతం పతనమైంది. దీనివల్ల కేవలం ఒక్క వారంలోనే నాస్డాక్ కంపెనీల మార్కెట్ విలువ సుమారు 4 ట్రిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయింది. 2020 మార్చి కరోనా సంక్షోభం తర్వాత నాస్డాక్ ఇంత భారీ వారపు నష్టాన్ని చూడటం ఇదే మొదటిసారి. నాస్‌డాక్‌తో పాటు ఎస్ అండ్ పి 500 సూచీ 3.70 శాతం, డౌ జోన్స్ దాదాపు 1.93 శాతం మేర పడిపోయాయి.
చిప్ కంపెనీలన్నీ కుదేలు
ఈ అమ్మకాల సునామీలో అత్యంత తీవ్రంగా దెబ్బతిన్నది చిప్ తయారీ కంపెనీలే. ప్రపంచంలోనే అగ్రగామి ఏఐ చిప్ సంస్థగా పేరుగాంచిన ఎన్విడియా షేరు ఏకంగా 14 శాతం కుప్పకూలింది. మరో దిగ్గజ సంస్థ ఏఎండీ షేర్లు 13.3 శాతం పడిపోయాయి. ఇతర ప్రధాన చిప్ కంపెనీల పరిస్థితి కూడా ఏమీ భిన్నంగా లేదు. మైక్రాన్ షేరు దాదాపు 14 శాతం, బ్రాడ్‌కామ్ షేరు 12.2 శాతం నష్టపోయాయి. గత కొంతకాలంగా మార్కెట్‌ను నడిపించిన ఈ టెక్ దిగ్గజాలన్నీ ఒక్కసారిగా నేలచూపులు చూడటంతో ఇన్వెస్టర్లలో భయం మొదలైంది.
ఆంథ్రోపిక్ దెబ్బకు మరింత ముదిరిన ఆందోళన
ఏఐ రంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని భావించిన ప్రముఖ ఏఐ సంస్థ ఆంథ్రోపిక్ లిస్టింగ్ కూడా మార్కెట్‌కు షాక్ ఇచ్చింది. ఆంథ్రోపిక్ షేర్ల అరంగేట్రం ఏఐ రంగానికి పెద్ద భరోసానిస్తుందని అందరూ అంచనా వేశారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. ట్రేడింగ్ మొదలైన రెండో రోజే ఆంథ్రోపిక్ షేర్లు 9.1 శాతం పడిపోయాయి. ఒకవైపు ఎన్విడియా 14 శాతం పతనం, మరోవైపు ఆంథ్రోపిక్ షేర్లు కుంగిపోవడం మొత్తం టెక్ రంగాన్ని ఆందోళనలోకి నెట్టేసింది.
ఏఐ బుడగ పేలిపోతోందా? అసలు కారణాలివే
ఇంత భారీ పతనం తర్వాత ఏఐ బుడగ పేలిపోతోందా? అనే చర్చ మొదలైంది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది వ్యాల్యుయేషన్ల భయం. ఏఐ కంపెనీల వాస్తవ ఆదాయం, లాభాలతో పోలిస్తే వాటి షేర్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. రెండోది ఖర్చు వర్సెస్ రాబడి. ఏఐ మౌలిక సదుపాయాలు, చిప్స్, డేటా సెంటర్ల కోసం కంపెనీలు బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. కానీ అంత భారీ పెట్టుబడులకు తగ్గట్లుగా నిజంగా లాభాలు ఎప్పుడు వస్తాయనే ప్రశ్న ఇన్వెస్టర్లను వేధిస్తోంది.
ఇకపై అసలు లాభాలే ముఖ్యం
ఈ వారం జరిగిన భారీ పతనం ఏఐ పెట్టుబడుల స్థిరత్వంపై పెద్ద సందేహాలను లేవనెత్తింది. అమెరికా మార్కెట్ ఆలోచనా విధానం ఇప్పుడు స్పష్టంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇకపై కేవలం భవిష్యత్తులో ఏఐ అద్భుతాలు చేస్తుందనే ఊహాగానాలను నమ్మి ఇన్వెస్టర్లు డబ్బు పెట్టడానికి సిద్ధంగా లేరు. కంపెనీలు ప్రస్తుతం ఎంత సంపాదిస్తున్నాయి, భవిష్యత్తులో ఎంత రిటర్న్ ఇస్తాయనే వాస్తవ గణాంకాలను మాత్రమే మార్కెట్ నిలదీస్తోంది.