Stock Market: దలాల్ స్ట్రీట్‌లో పండుగ.. ధంతేరస్ వేళ సెన్సెక్స్, నిఫ్టీల్లో భారీ రికార్డులు
సెన్సెక్స్, నిఫ్టీల్లో భారీ రికార్డులు
Stock Market: దీపావళి పండుగ వేళ భారతీయ స్టాక్ మార్కెట్లలో సరికొత్త ఉత్సాహం వెల్లివిరిసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న షేర్ మార్కెట్లలో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి, అమెరికా నుంచి ఆసియా వరకు మార్కెట్లు పతనమవుతున్న తరుణంలో మన దలాల్ స్ట్రీట్ మాత్రం ఇన్వెస్టర్ల జేబులను నింపేసింది. విదేశీ మదుపరులు అకస్మాత్తుగా భారీగా పెట్టుబడులు పెట్టడంతో సెన్సెక్స్ ఏకంగా 1,718 పాయింట్లు ఎగబాకి 81,028 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 493 పాయింట్లు బలపడి 25,030 మార్కును దాటగలిగింది. గత కొన్ని నెలలుగా మార్కెట్లో కనిపిస్తున్న స్తబ్దత ఒక్కసారిగా తొలగిపోయి సూచీలు పరుగులు పెట్టాయి.
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షాక్
అంతర్జాతీయ మార్కెట్లలో ఈ భారీ పతనానికి ప్రధాన కారణం ఏఐ రంగంలో నెలకొన్న భయాందోళనలే. అమెరికా మధ్యంతర ఎన్నికలలో డెమోక్రట్లు విజయం సాధించడంతో ఏఐ టెక్నాలజీపై కఠినమైన నిబంధనలు వస్తాయనే ఆందోళన పెరిగింది. దీనివల్ల అమెరికాలోని ప్రధాన టెక్ ఇండెక్స్ నాస్డాక్ ఏకంగా 6 శాతం పతనమైంది. సౌత్ కొరియా కోస్పీ, జపాన్ దేశపు సూచీ నిక్కీలు కూడా భారీగా కుప్పకూలాయి. అమెరికన్ కంపెనీలు ఏఐ కోసం భారీగా అప్పులు చేసి విపరీతంగా ఖర్చు పెట్టడంతో అక్కడ మార్కెట్ కుదేలైంది. అయితే ఈ సంక్షోభం భారత మార్కెట్లకు మాత్రం ఒక పెద్ద వరంగా మారిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
6 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన విదేశీ ఇన్వెస్టర్లు
గత కొన్ని నెలలుగా మన మార్కెట్ల నుంచి వెనక్కి వెళ్ళిపోయిన విదేశీ సంస్థగత ఇన్వెస్టర్లు (FIIs) ఇప్పుడు మళ్లీ భారత్ వైపు పెద్ద ఎత్తున పరుగులు పెడుతున్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గణాంకాల ప్రకారం ఒక్క గురువారమే విదేశీ మదుపరులు ఏకంగా రూ. 14,975 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. గడచిన ఆరు సంవత్సరాలలో ఒకే రోజులో ఇటు వంటి బంపర్ కొనుగోళ్లు జరగడం ఇదే మొదటిసారి. కేవలం ఐదు రోజుల్లోనే సుమారు 5 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు మన మార్కెట్లోకి రావడంతో సూచీలు ఒక్కసారిగా నింగిని తాకాయి.
పెద్ద కంపెనీల హవా.. చిన్న షేర్లలో పతనం
మార్కెట్లో భారీ ఉత్సాహం కనిపించినప్పటికీ ఈ లాభాలు కేవలం లార్జ్ క్యాప్ కంపెనీలకు మాత్రమే పరిమితమయ్యాయి. రెండో త్రైమాసికంలో అద్భుతమైన ఫలితాలు సాధించిన మహీంద్రా అండ్ మహీంద్రా షేరు ఐదు శాతానికి పైగా ఎగబాకగా, ఇన్ఫోసిస్, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్ షేర్లు కూడా రాణించాయి. అయితే దీనికి భిన్నంగా మిడ్ క్యాప్ అలాగే స్మాల్ క్యాప్ షేర్లలో మాత్రం తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కనిపించింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ శాతం పడిపోయింది. వేల సంఖ్యలో షేర్లు నష్టాల్లో ముగియడంతో చిన్న ఇన్వెస్టర్లు నిరాశ చెందాల్సి వచ్చింది.
బలమైన ఫలితాలు ఉన్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలి
భారతీయ కంపెనీల నిఫ్టీ 50 ఫలితాలు అంచనాల కంటే 19 శాతం మెరుగ్గా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనల కారణంగా ముడిచమురు ధరలు మళ్లీ పెరగడం, బాండ్ ఈల్డ్స్ మారడం వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చు. ఇండియా విక్స్ సూచీ కూడా స్వల్పంగా పెరగడం వల్ల ఇన్వెస్టర్లు ఈ దీపావళి ఆనందంలోనూ కొద్దిగా ఆచితూచి అడుగులు వేయాలని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.