GST Rules: బంగారు, వెండి అలాగే డైమండ్ ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులకు ట్యాక్సుల విషయంలో చాలా రకాల సందేహాలు వస్తుంటాయి. చాలా మంది దుకాణదారులు బంగారం ధరపై మూడు శాతం జీఎస్టీ వసూలు చేయడంతో పాటు, అదనంగా మేకింగ్ ఛార్జీలపై ఐదు శాతం ట్యాక్స్ విధిస్తుంటారు. అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కస్టమర్లు ఆభరణాల మొత్తం ధరపై వేర్వేరుగా ట్యాక్సులు చెల్లించాల్సిన అవసరం లేదు. బిల్లులో మేకింగ్ ఛార్జీలను వేరుగా చూపించినప్పటికీ, మొత్తం ట్రాన్సాక్షన్ విలువపై ఒకేసారి కేవలం 3 శాతం జీఎస్టీ మాత్రమే వసూలు చేయాలి.

ఎలా లెక్కిస్తారంటే?

ఈ ట్యాక్స్ విధానాన్ని ఒక చిన్న ఉదాహరణ ద్వారా చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. మీరు పది గ్రాముల బంగారు చెయిన్ కొనుగోలు చేశారనుకుందాం. అందులో బంగారం అసలు ధర రూ.1,28,000 కాగా, మేకింగ్ ఛార్జ్ కింద రూ.12,000 అయింది. అప్పుడు ఆ చెయిన్ మొత్తం విలువ రూ.1,40,000 అవుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ మొత్తంపై కేవలం 3 శాతం జీఎస్టీ అంటే రూ.4,200 మాత్రమే ట్యాక్స్ పడుతుంది. ఒకవేళ దుకాణదారుడు బంగారంపై 3 శాతం, మేకింగ్ ఛార్జ్‌పై విడిగా 5 శాతం ట్యాక్స్ కలిపితే మీకు అదనంగా భారం పడుతుంది.

మేకింగ్ ఛార్జ్‌పై 5 శాతం ట్యాక్స్ ఎవరికి వర్తిస్తుంది?

మార్కెట్లో చాలా చోట్ల మేకింగ్ ఛార్జ్‌పై 5 శాతం జీఎస్టీ ఉంటుందనే ప్రచారం జరుగుతుంటుంది. అసలు ఈ ఐదు శాతం నిబంధన సాధారణ వినియోగదారులకు వర్తించదు. ఇది కేవలం ఆభరణాలు తయారు చేసే తయారీదారులు అలాగే జాబ్ వర్కర్స్ మధ్య జరిగే వ్యాపార లావాదేవీలకు మాత్రమే సంబంధించింది. ఒక ఆభరణాల దుకాణదారుడు ముడి బంగారాన్ని కారిగర్‌కు ఇచ్చి నగలు చేయించుకున్నప్పుడు ఆ తయారీ పై 5 శాతం ట్యాక్స్ చెల్లిస్తారు. జ్యువెలర్ ఈ ట్యాక్స్‌ను ఇన్‌పుట్ క్రెడిట్ కింద క్లెయిమ్ చేసుకుంటారే తప్ప, షోరూమ్‌కు వచ్చి తుది ఆభరణం కొనే సామాన్య కస్టమర్ల బిల్లులో దీన్ని ఎప్పటికీ కలపకూడదు.

జీఎస్టీ 2.0 వచ్చినప్పటికీ మారని పాత పద్ధతి

గతంలో వచ్చిన జీఎస్టీ సంస్కరణల్లో ట్యాక్స్ శ్లాబులలో మార్పులు చేసినప్పటికీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగానికి మాత్రం పాత పద్ధతినే కొనసాగించారు. దేశంలో బంగారం అలాగే వెండిపై 3 శాతం జీఎస్టీ విధించే ఈ నిబంధన జూలై 1, 2017 నుంచి అమల్లో ఉంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విలువైన లోహాలపై కూడా కస్టమ్స్ డ్యూటీతో పాటు ఐజీఎస్టీ వర్తిస్తుంది. కేవలం కొత్త ఆభరణాల కొనుగోలు సమయంలోనే కాకుండా పాత బంగారం మార్పిడి లేదా రిపేరింగ్ చేయించుకునే సందర్భాలలో మాత్రం నిబంధనలు వేరుగా ఉండే అవకాశం ఉంటుంది.

కస్టమర్లు పాటించాల్సిన జాగ్రత్తలు

దుకాణం నుంచి ఏవైనా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు కచ్చితంగా బిల్లును క్షుణ్ణంగా పరిశీలించాలి. మీరు కొన్న మొత్తం ఆభరణాల విలువపై కేవలం 3 శాతం జీఎస్టీ మాత్రమే పడిందా లేదా అని లెక్క చూసుకోవాలి. రూ.1.40 లక్షల విలువైన నగలపై రూ.4,200 ట్యాక్స్ పడాలి. ఒకవేళ దుకాణదారులు నిబంధనలకు విరుద్ధంగా అదనపు ట్యాక్స్ వసూలు చేయడానికి ప్రయత్నిస్తే ప్రశ్నించడం చాలా ముఖ్యం. పండుగ సీజన్లలో ఎలాంటి మోసాలకు గురికాకుండా ఉండటానికి ఈ ఆర్థిక అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరం.

Tags: