Gold Loan : గోల్డ్ లోన్ తీసుకున్నారా? బంగారం ధరలు తగ్గితే మీ నగలకే ప్రమాదం.. అప్రమత్తంగా ఉండండి

అప్రమత్తంగా ఉండండి

Update: 2026-04-14 10:28 GMT

Gold Loan : బంగారం ధరలు తగ్గుతున్నాయంటే సాధారణంగా అందరూ సంతోషిస్తారు. కానీ, ఇంట్లో ఉన్న బంగారాన్ని బ్యాంకులోనో లేదా తాకట్టు సంస్థల్లోనో పెట్టి గోల్డ్ లోన్ తీసుకున్న వారికి మాత్రం ఇది కంటి మీద కునుకు లేకుండా చేసే వార్త. పసిడి ధరలు భారీగా పతనమైతే, మీరు బ్యాంకులో పెట్టిన మీ ప్రాణప్రదమైన నగలు వేలానికి వచ్చే ప్రమాదం ఉందన్న నిజం మీకు తెలుసా? ధరల పతనానికి, మీ గోల్డ్ లోన్‌కు ఉన్న ఆ డేంజర్ కనెక్షన్ ఏంటో వివరంగా తెలుసుకుందాం.

ఏమిటీ ఎల్టీవీ మాయాజాలం?

మీరు బ్యాంకులో బంగారం పెట్టినప్పుడు, వారు ఆనాటి మార్కెట్ విలువలో మొత్తం సొమ్మును మీకు అప్పుగా ఇవ్వరు. సాధారణంగా 75 శాతం మాత్రమే ఇస్తారు. దీనినే లోన్ టు వ్యాల్యూ (LTV) అంటారు. అంటే లక్ష రూపాయల విలువైన బంగారం పెడితే మీకు 75 వేల రూపాయలు ఇస్తారు. మిగిలిన 25 శాతం బఫర్ గా ఉంచుకుంటారు. ఎందుకంటే భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గినా బ్యాంకు నష్టపోకూడదని వారి ప్లాన్.

ధరలు తగ్గితే ఏం జరుగుతుంది?

మార్కెట్‌లో బంగారం ధరలు అనూహ్యంగా పడిపోయినప్పుడు, మీరు బ్యాంకులో పెట్టిన నగలు విలువ కూడా తగ్గుతుంది. ఉదాహరణకు, మీరు పెట్టిన లక్ష రూపాయల బంగారం విలువ ఇప్పుడు 80 వేలకి పడిపోయిందనుకోండి. అప్పుడు మీరు తీసుకున్న 75 వేల అప్పు.. బంగారం విలువకు దాదాపు సమానమైపోతుంది. ఇలాంటప్పుడు బ్యాంకుకు రిస్క్ పెరుగుతుంది. వెంటనే బ్యాంకులు రంగంలోకి దిగి మీకు ఫోన్ లేదా మెసేజ్ చేస్తాయి.

బ్యాంకు నుంచి వచ్చే ఆ డేంజర్ కాల్

బంగారం విలువ పడిపోయినప్పుడు బ్యాంకులు మిమ్మల్ని రెండు రకాలుగా కోరవచ్చు:

అదనపు నగలు తీసుకురండి: తగ్గిన విలువను భర్తీ చేయడానికి మరికొంత బంగారాన్ని తాకట్టు పెట్టమంటారు.

అప్పులో కొంత భాగం కట్టండి: మీరు తీసుకున్న లోన్ మొత్తంలో కొంత భాగాన్ని వెంటనే చెల్లించి, ఎల్టీవీ రేషియోను మళ్ళీ 75 శాతానికి తీసుకురావాలని ఒత్తిడి చేస్తారు.

నిర్లక్ష్యం చేస్తే వేలం తప్పదు

చాలామంది ఈ కాల్స్ లేదా మెసేజ్‌లను పట్టించుకోరు. కానీ ధరలు ఇంకా పడిపోతుంటే, బ్యాంకులు తమ అసలు మరియు వడ్డీని వసూలు చేసుకోవడానికి మీ బంగారాన్ని వేలం వేసే పూర్తి హక్కును కలిగి ఉంటాయి. ముఖ్యంగా ధరలు వేగంగా పడిపోతున్నప్పుడు బ్యాంకులు ఎక్కువ సమయం ఇవ్వవు. మీకు నోటీసు పంపి, ఆ తర్వాత నగలను అమ్మేసి తమ బాకీని వసూలు చేసుకుంటాయి.

లోన్ తీసుకునేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి

గోల్డ్ లోన్ అనేది అత్యవసర అవసరాలకు సులభమైన మార్గమే అయినప్పటికీ, అది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. బంగారం ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కాబట్టి లోన్ తీసుకునేటప్పుడు కేవలం వడ్డీ రేటు మాత్రమే కాదు, మార్కెట్ ట్రెండ్‌ను కూడా గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా అప్పు తీసుకున్న తర్వాత మీ ఇబ్బందులు పెరగకూడదంటే, మీ నగలకు ఉండే సెంటిమెంట్ విలువను బ్యాంకులు గుర్తించవు అన్న చేదు నిజాన్ని గుర్తుంచుకోవాలి.

Tags:    

Similar News