License Suspended: ఆన్‌లైన్ గ్రాసరీ యాప్‌లలో నిత్యం సరుకులు ఆర్డర్ చేసే వినియోగదారులకు కర్ణాటక ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన ఉమ్మెత్త కాయలను ఆహార పదార్థాలుగా చూపుతూ విక్రయిస్తున్నందుకు గాను అమెజాన్, స్విగ్గీ ఇన్స్టామార్ట్, బిగ్‌బాస్కెట్ సంస్థల ఫుడ్ లైసెన్సులను కర్ణాటక ఆహార భద్రతా శాఖ సస్పెండ్ చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. దేశంలో క్విక్ కామర్స్, ఈ-కామర్స్ రంగం రోజురోజుకూ విస్తరిస్తోంది. అత్యవసర సరుకుల నుంచి వంట సామాగ్రి వరకు ప్రతిదీ నిమిషాల్లో ఇంటికి చేరుతోంది. అయితే ఈ క్రమంలో నాణ్యతా ప్రమాణాలు, భద్రతా నిబంధనలను కంపెనీలు గాలికొదిలేస్తున్నాయని తేలింది. కర్ణాటక ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించిన తనిఖీల్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు అమెజాన్, స్విగ్గీ ఇన్స్టామార్ట్, బిగ్‌బాస్కెట్ తమ యాప్‌లలో ఉమ్మేత్త కాయలు, విత్తనాలను ఏకంగా తినే ఆహార ఉత్పత్తుల జాబితాలో చేర్చాయి.

సాధారణంగా ఉమ్మేత్త చెట్టు విత్తనాలు, కాయలు తీవ్రమైన విషపూరిత లక్షణాలను కలిగి ఉంటాయి. నాట్యురోపతి లేదా ఆయుర్వేదంలో కొన్ని నిర్దిష్టమైన పద్ధతుల్లో ఔషధాల తయారీకి వాడినప్పటికీ, నేరుగా లేదా సరైన శుద్ధి లేకుండా దీనిని తీసుకోవడం ప్రాణాలకే ప్రమాదం. సైంటిఫిక్‌గా నైట్‌షేడ్ కుటుంబానికి చెందిన ఈ మొక్క ఉత్పత్తులను పొరపాటున తింటే మనుషులు కోమాలోకి వెళ్లే అవకాశం ఉనటంతో పాటు కొన్నిసార్లు మరణం సంభవించవచ్చని వైద్యాధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అటువంటి ప్రమాదకరమైన వస్తువును సాధారణ కూరగాయలు, ఆహార పదార్థాల మాదిరిగా విక్రయానికి ఉంచడంపై తీవ్ర దుమారం రేగింది.

కర్ణాటక ఆహార భద్రతా శాఖ ఈ ఉల్లంఘనపై తక్షణమే స్పందించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు అమెజాన్, స్విగ్గీ ఇన్స్టామార్ట్, బిగ్‌బాస్కెట్ సంస్థలకు చెందిన ఫుడ్ లైసెన్సులను నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ఉమ్మేత్త కాయలకు సంబంధించిన అన్ని రకాల విక్రయాలు, ప్రకటనలు, లిస్టింగ్‌లను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. మానవ వినియోగానికి ఏమాత్రం పనికిరాని ఉత్పత్తులను ఫుడ్ ప్రొడక్ట్స్‌గా ప్రదర్శించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేసింది. ఈ ఘటనపై సంబంధిత కంపెనీలకు కారణప్రదర్శన నోటీసులు జారీ చేస్తూ శాఖాత్మక చర్యలకు ఉపక్రమించింది.

డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఆటోమేటెడ్ లిస్టింగ్స్ పెరిగిపోవడం వల్ల ఏవి ఆహార పదార్థాలు, ఏవి కావు అనే కనీస తనిఖీ లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం లాభాలే ధ్యేయంగా పనిచేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల ఆహార భద్రతా విభాగాలు కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది.

Tags: