Ashirvaad Atta: ఆశీర్వాద్ గోధుమపిండి 100% వివాదం.. ఐటీసీ కంపెనీకి ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట
ఐటీసీ కంపెనీకి ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట
Ashirvaad Atta: ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ సంస్థ ఐటీసీకి చెందిన ఆశీర్వాద్ శుద్ధ చక్కి ఆటా ప్యాకెట్లపై '100%' అనే పదాన్ని వాడటంపై చెలరేగిన వివాదంలో ఢిల్లీ హైకోర్టు ఊరటనిచ్చింది. కంపెనీ లైసెన్స్ రద్దు చేసేలా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆశీర్వాద్ శుద్ధ చక్కి ఆటా లేబులింగ్ వివాదంలో ఐటీసీ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. వచ్చే సెప్టెంబర్ 9న జరిగే తదుపరి విచారణ వరకు కంపెనీపై ఎటువంటి తుది నిర్ణయం తీసుకోకూడదని ఫుడ్ రెగ్యులేటర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతానికి ఐటీసీ లైసెన్స్ రద్దు లేదా ఇతర కఠిన చర్యలు చేపట్టవద్దని స్పష్టం చేస్తూ, ఈ వ్యవహారంలో సమాధానం చెప్పాలంటూ FSSAI సహా ఇతర ప్రతివాదులకు నోటీసులు పంపింది.
వివాదం అసలు నేపథ్యం ఇది
ఈ ఏడాది మే 28న FSSAI ఒక మార్గదర్శకాన్ని విడుదల చేసింది. ఆహార ఉత్పత్తుల లేబుళ్ళు, ప్యాకేజింగ్ లేదా ప్రకటనల్లో '100%' అనే పదాన్ని ఉపయోగించకూడదని అన్ని కంపెనీలను ఆదేశించింది. ఈ నిబంధనను ఉల్లంఘించారంటూ ఆగస్టు 10న ఐటీసీ సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసి, 30 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. ఆ తర్వాత మూడు రోజులకే అంటే ఆగస్టు 13న ఒక ఇంప్రూవ్‌మెంట్ నోటీసు ఇచ్చి, 15 రోజుల్లోగా ప్యాకెట్లపై నుంచి 100% అనే పదాన్ని తొలగించాలని షరతు విధించింది. అలా చేయకపోతే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించడంతో ఐటీసీ కోర్టును ఆశ్రయించింది.
ఐటీసీ న్యాయవాదుల వాదనలు
కోర్టు విచారణ సమయంలో ఐటీసీ తరఫు న్యాయవాది రోహిత్ శర్మ తమ వాదనలను బలంగా వినిపించారు. FSSAI ఇచ్చిన మార్గదర్శకాలు పూర్తిగా ఏకపక్షంగా ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 పరిధికి దాటి రెగ్యులేటర్ సొంత నిర్ణయాలు రుద్దలేరని పేర్కొన్నారు. 2020 నాటి లేబులింగ్ నిబంధనలు, 2018 నాటి ప్రకటనల నిబంధనల ప్రకారం ప్యాకెట్లపై 100% అని రాయడంపై ఎలాంటి చట్టపరమైన నిషేధం లేదని కంపెనీ స్పష్టం చేసింది.
పరిధి అంశంపై అభ్యంతరం
మరోవైపు FSSAI కూడా విచారణలో తన అభ్యంతరాన్ని వ్యక్తపరిచింది. ఈ సవాలును విచారించే పరిధి ఢిల్లీ హైకోర్టుకు లేదని ఫుడ్ రెగ్యులేటర్ వాదించింది. ఈ సాంకేతిక అంశాన్ని పరిశీలించిన న్యాయస్థానం, విచారణ పరిధికి సంబంధించిన విషయాంతరంపై సంక్షిప్త నోట్ సమర్పించాలని ఇరుపక్షాలను ఆదేశించింది. ఇప్పుడు అందరి దృష్టి సెప్టెంబర్ 9న జరగబోయే తదుపరి విచారణపైనే నెలకొంది.