Axis Bank : సైబర్ దొంగలకు ఇక చెక్.. యాక్సిస్ బ్యాంక్ తెచ్చిన ఈ సేఫ్టీ ఫీచర్ అమోఘం

యాక్సిస్ బ్యాంక్ తెచ్చిన ఈ సేఫ్టీ ఫీచర్ అమోఘం

Update: 2026-04-07 11:16 GMT

Axis Bank : యాక్సిస్ బ్యాంక్ తన వినియోగదారుల కోసం సరికొత్త, అత్యంత సురక్షితమైన సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. బ్యాంక్ ఖాతాకు అనుసంధానమై ఉన్న మొబైల్ నంబర్‌ను మార్చుకోవడం కోసం ఇకపై బ్యాంక్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆధార్ ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఇంట్లోనే కూర్చుని నిమిషాల్లో మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే వెసులుబాటును బ్యాంక్ కల్పించింది. తమ మొబైల్ యాప్ ద్వారా ఈ అత్యాధునిక సదుపాయాన్ని ప్రారంభించినట్లు యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది.

దేశంలోనే మొదటిసారి.. సరికొత్త డిజిటల్ విప్లవం

భారతదేశంలోని ప్రధాన బ్యాంకుల్లో ఆధార్ ఫేస్ రికగ్నిషన్ సాంకేతికతను పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టిన మొదటి బ్యాంక్ గా యాక్సిస్ బ్యాంక్ రికార్డు సృష్టించింది. UIDAI అభివృద్ధి చేసిన ఈ ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీని నేరుగా బ్యాంక్ యాప్‌లో ఇంటిగ్రేట్ చేశారు. దీనివల్ల కస్టమర్లు తమంతట తామే (Do It Yourself) ఎవరి సహాయం లేకుండా మొబైల్ నంబర్ మార్చుకోవచ్చు. ఇది కేవలం సౌలభ్యం మాత్రమే కాదు, బ్యాంకింగ్ రంగంలో ఒక పెద్ద మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

కేవలం మూడు స్టెప్స్‌లో పని పూర్తి

మొబైల్ నంబర్ మార్చుకునే ప్రక్రియను బ్యాంక్ చాలా సరళతరం చేసింది. మొదటగా బ్యాంక్ యాప్‌లో కొత్త మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత AadhaarFaceRD యాప్ సహాయంతో మీ ముఖాన్ని స్కాన్ చేసి లైవ్ ఫోటో ద్వారా గుర్తింపును ధృవీకరించుకోవాలి. ఈ ఫోటోను ఆధార్ డేటాబేస్‌తో సిస్టమ్ సరిపోల్చుతుంది. ఫోటో మ్యాచ్ అయిన వెంటనే, కొత్త మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తే ప్రక్రియ పూర్తవుతుంది. బ్రాంచ్‌కు వెళ్లి ఫారాలు నింపే తలనొప్పి ఇక ఉండదు.

భద్రత విషయంలో రాజీ లేదు

ముఖ గుర్తింపు సాంకేతికత వాడటం వల్ల సైబర్ నేరాలు, మోసాలకు అడ్డుకట్ట పడుతుందని యాక్సిస్ బ్యాంక్ చెబుతోంది. కస్టమర్ లైవ్ ఫోటోను ఆధార్ డేటాతో సరిపోల్చడం వల్ల వేరొకరు మీ అకౌంట్ నంబర్ మార్చే అవకాశం ఉండదు. అంతేకాకుండా, నంబర్ మారిన తర్వాత అదనపు భద్రత కోసం 24 గంటల వరకు లావాదేవీల పరిమితిని డిఫాల్ట్ స్థాయిలో ఉంచుతారు. దీనివల్ల అనుమానాస్పద లావాదేవీలను సులభంగా గుర్తించవచ్చు.

డిజిటల్ బ్యాంకింగ్‌లో నయా జోష్

కస్టమర్లకు తమ ఖాతాపై పూర్తి నియంత్రణను ఇవ్వడమే ఈ ప్రయత్నం వెనుక ఉన్న ఉద్దేశ్యం. ఇప్పటికే యాక్సిస్ బ్యాంక్ తన యాప్‌లో సేఫ్టీ సెంటర్, లాక్ ఎఫ్‌డీ, ఇన్-యాప్ ఓటీపీ వంటి వినూత్న ఫీచర్లను అందిస్తోంది. తాజా ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ తో కస్టమర్లకు బ్యాంకింగ్ అనుభవం మరింత సురక్షితంగా, సులభంగా మారింది. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో యాక్సిస్ బ్యాంక్ మరోసారి ముందంజలో నిలిచింది.

Tags:    

Similar News