Bank Strike: బ్యాంకు ఉద్యోగులకు భారీ షాక్.. 5 రోజుల పనిదినాల డిమాండ్‌పై స్పష్టతనిచ్చిన ప్రభుత్వం
స్పష్టతనిచ్చిన ప్రభుత్వం
Bank Strike: బ్యాంకుల్లో వారానికి 5 రోజులు మాత్రమే పని చేయాలనే డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. ఈ డిమాండ్‌కు తాము ఎప్పుడూ ఎలాంటి ఆమోదం తెలపలేదని, దీనిపై ఎలాంటి ఒప్పందం కుదరలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం నెలలో రెండవ, నాల్గవ శనివారాలు మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుండగా, మిగతా శనివారాల్లో కూడా సెలవు ప్రకటించాలని ఉద్యోగులు దీర్ఘకాలంగా కోరుకుంటున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక అంగీకారం రాకపోవడంతో ఈ వివాదం ముదిరింది.
సెప్టెంబర్ 28 నుంచి దేశవ్యాప్త బ్యాంకుల సమ్మె
ప్రభుత్వ తాజా ప్రకటన, తమ డిమాండ్ల సాధనకై బ్యాంక్ యూనియన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగా సెప్టెంబర్ 28, 29 మరియు 30 తేదీల్లో మూడు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మె కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా శాఖల్లో జరిగే లావాదేవీలు నిలిచిపోయే ప్రమాదం ఉంది.
కస్టమర్లపై సమ్మె ప్రభావం ఎలా ఉంటుంది?
బ్యాంకుల సమ్మె నేపథ్యంలో వినియోగదారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. శాఖల ద్వారా జరిగే నగదు జమ, విత్‌డ్రా, చెక్ క్లియరెన్స్, లోన్ ప్రాసెసింగ్ వంటి పనులు నిలిచిపోవచ్చు. అయితే కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏటీఎమ్‌లు, యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సర్వీసులు యథావిధిగా పనిచేస్తాయి. అయినప్పటికీ ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉంటే ముందస్తుగానే పూర్తి చేసుకోవడం మంచిది.
ఉద్యోగుల డిమాండ్లు
వర్క్-లైఫ్ బ్యాలెన్స్ మెరుగుపరుచుకోవడానికి ఐదు రోజుల పనిదినాల విధానం ఎంతో అవసరమని ఉద్యోగ సంఘాలు వాదిస్తున్నాయి. కానీ ఈ అంశంపై తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఉద్యోగులు తమంతట తాముగా ఈ విషయాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఉద్యోగుల డిమాండ్లు, ప్రభుత్వ తాజా స్పష్టత నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ వివాదం ఏలు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది.