Income Tax: ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఫైల్ చేశారా?.. ఈ తప్పులు చేశారంటే ఐటీ శాఖ నుంచి నోటీసులు పక్కా
ఐటీ శాఖ నుంచి నోటీసులు పక్కా
Income Tax: అసెస్‌మెంట్ ఇయర్ 2026-27కి సంబంధించి ట్యాక్స్ ఆడిట్ నివేదికను సమర్పించడానికి సెప్టెంబర్ 30 చివరి గడువుగా ఉంది. ఎవరి వ్యాపార ఖాతాలకు ఆడిట్ కచ్చితంగా అవసరమో, ఆ ట్యాక్స్ పేయర్లు ఈ డెడ్‌లైన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. చాలా మంది ట్యాక్స్ పేయర్లు ఇప్పటికే తమ రిపోర్ట్‌లను పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు. అయితే ఆడిట్ రిపోర్ట్ ఫైల్ చేశాము కదా అని నిర్లక్ష్యంగా ఉంటారు. కొంతమంది హడావుడిగా ఫైల్ చేసే సమయంలో చిన్న చిన్న పొరపాట్లు దొర్లుతుంటాయి. ఇవి భవిష్యత్తులో ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు రావడానికి దారితీస్తాయి.
రిపోర్ట్‌లో తరచుగా జరిగే సాధారణ పొరపాట్లు
ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్‌లలో ఎక్కువగా జరిగే తప్పు యుడీఐఎన్ గురించినది. ఆడిటర్ రిపోర్ట్ అప్‌లోడ్ చేసినప్పటికీ ట్యాక్స్ పేయర్ దానిని పోర్టల్‌లో యాక్సెప్ట్ చేయడం మర్చిపోతుంటారు. మీరు దానిని అంగీకరించకపోతే రిపోర్ట్ పూర్తి కానట్లే లెక్క. అలాగే, హెచ్‌ఎస్‌ఎన్ లేదా ఎస్ఏసీ కోడ్ ఎంటర్ చేసేటప్పుడు వ్యాపార స్వభావాన్ని సరిగ్గా పేర్కొనడం చాలా ముఖ్యం. దీనితో పాటు టర్న్‌ఓవర్ వివరాలు కూడా చాలా కీలకం. మీ పుస్తకాలలోని టర్న్‌ఓవర్ వివరాలు.. ఫారమ్ 26AS, AIS, TIS, జీఎస్టీ రిటర్న్‌లతో కచ్చితంగా సరిపోలాలి. ఏమాత్రం తేడా వచ్చినా సిస్టమ్ వెంటనే పసిగడుతుంది.
ఎంఎస్‌ఎంఈ చెల్లింపులు,కొత్త నిబంధనలు
ఈ ఏడాది ఎంఎస్‌ఎంఈ చెల్లింపులకు సంబంధించి నిబంధనలు చాలా కఠినంగా మారాయి. సెక్షన్ 43B(h) కింద క్లాజ్ 22 లో కీలక మార్పులు వచ్చాయి. ఒకవేళ మీరు చిన్న లేదా మైక్రో వ్యాపారాలకు సమయానికి పేమెంట్స్ చేయకపోతే, ఆ వివరాలను రిపోర్ట్‌లో తప్పనిసరిగా చూపాలి. అలాగే, క్లాజ్ 36B కింద బై-బ్యాక్ సమాచారాన్ని పొందుపరచడం ఈసారి తప్పనిసరి. చాలామంది ఈ అంశాలను విస్మరిస్తుంటారు, కాబట్టి వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
గడువుకు ముందే రిపోర్ట్‌ను సవరించడం ఎలా?
ఒకవేళ మీరు అప్‌లోడ్ చేసిన రిపోర్ట్‌లో ఏవైనా తప్పులు ఉన్నట్లు గుర్తిస్తే, వాటిని సెప్టెంబర్ 30 లోపు సరిదిద్దుకునే అవకాశం ఉంది. చట్టపరంగా డెడ్‌లైన్‌కు ముందు రివిజన్ అనే ప్రత్యేక కేటగిరీ లేకపోయినా, చిన్నపాటి తప్పులను సరిచేసుకోవడానికి రిపోర్ట్‌ను రివైజ్ చేయవచ్చు. పేరు, అడ్రస్, యుడీఐఎన్ నంబర్ లేదా లెక్కింపులో ఏవైనా పొరపాట్లు జరిగితే మార్చుకోవచ్చు. అయితే, మీ అకౌంటింగ్ పద్ధతిని పూర్తిగా మార్చేయడం కుదరదు. ఉదాహరణకు, బిజినెస్ ఇన్‌కమ్‌ను సడన్‌గా క్యాపిటల్ గెయిన్‌గా మార్చలేరు. చేసే మార్పులు వాస్తవంగా మరియు నిబంధనలకు లోబడి ఉండాలి.
ఐటీఆర్ ఫైలింగ్‌పై ఆడిట్ రిపోర్ట్ ప్రభావం
మీరు ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్‌ను ఎప్పుడు మార్చినా (సెప్టెంబర్ 30కి ముందు లేదా ఆ తర్వాత), అది మీ ఐటీఆర్ ఫైలింగ్‌పై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. అక్టోబర్ 31 నాటికి మీరు ఫైల్ చేసే ఐటీఆర్.. మీ లేటెస్ట్ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్‌తో పూర్తిగా మ్యాచ్ కావాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఐటీఆర్ ఫైల్ చేసి, ఆ తర్వాత ఆడిట్ రిపోర్ట్‌లో మార్పులు చేస్తే, మీ రిటర్న్‌ను కూడా తప్పనిసరిగా రివైజ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఆదాయపు పన్ను శాఖ మీ రిటర్న్‌ను డిఫెక్టివ్‌గా భావించి నోటీసులు పంపే అవకాశం ఉంది.