Post Office: పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్‌లు.. రూ.2 లక్షల పెట్టుబడిపై ఐదేళ్లలో భారీ రాబడి!
ఐదేళ్లలో భారీ రాబడి!
Post Office: కష్టపడి సంపాదించిన డబ్బును ఎటువంటి రిస్క్ లేకుండా సురక్షితమైన ప్రదేశంలో ఇన్వెస్ట్ చేయాలని చాలామంది కోరుకుంటారు. మీ దగ్గర రూ.2 లక్షల మొత్తం ఉండి, దానిని ఐదేళ్ల కాలానికి ఎక్కడ పెట్టాలో అర్థం కాకపోతే పోస్టాఫీస్ చిన్నమొత్తాల పథకాలు అత్యంత చక్కటి ప్రత్యామ్నాయాలుగా నిలుస్తాయి. ఈ ప్రభుత్వ పథకాలలో పెట్టుబడి పెట్టే ప్రతీ రూపాయికి పూర్తి ప్రభుత్వ హామీ లభిస్తుంది. అందువల్ల డబ్బు మునిగిపోతుందనే భయం ఉండదు. ప్రస్తుత అక్టోబర్ నుంచి డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేట్లలో ఎలాంటి కోత విధించలేదు. దీనివల్ల ఒకేసారి పెద్ద మొత్తంలో రాబడి కోరుకునే వారికి ఈ స్కీమ్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి.
నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ (NSC)
ఐదేళ్ల తర్వాత ఒకేసారి పెద్ద మొత్తంలో ఫండ్ కావాలనుకునే వారికి ఎన్ఎస్సీ సరైన ఎంపిక. ప్రస్తుతం ఈ పథకంలో సంవత్సరానికి 7.7 శాతం వడ్డీ లభిస్తోంది. ఇందులో చక్రవడ్డీ ప్రయోజనం మదుపర్లకు పూర్తిగా దక్కుతుంది. ఈ స్కీమ్‌లో రూ.2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల గడువు ముగిసేసరికి చేతికి సుమారు రూ.2,89,807 అందజేస్తారు. అంటే కేవలం వడ్డీ రూపంలోనే దాదాపు రూ.89,807 వరకు లాభం పొందవచ్చు. పాత ట్యాక్స్ విధానాన్ని ఎంచుకునే వారికి ఇందులో పన్ను మినహాయింపు ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉంటాయి.
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (TD)
ఒకసారి డబ్బు డిపాజిట్ చేసి మంచి లాభాలు రాబట్టాలని చూసే వారికి 5 సంవత్సరాల టైమ్ డిపాజిట్ అద్భుతమైన మార్గంగా ఉంటుంది. ఈ ప్లాన్‌లో ప్రస్తుతం 7.5 శాతం చొప్పున వార్షిక వడ్డీ ఇస్తున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ లెక్కింపు జరిగినా, ఆ మొత్తం ఏడాదికోసారి ఖాతాదారులకు జమ అవుతుంది. ఒకవేళ ఎవరైనా ఈ పథకంలో రూ.2 లక్షలు జమ చేస్తే ఐదేళ్ల కాలం పూర్తికాగానే మొత్తం రూ.2,77,136 చేతికి వస్తాయి. అంటే అదనంగా సుమారు రూ.77,136 వరకు లాభాన్ని కేవలం వడ్డీ రూపంలోనే సొంతం చేసుకోవచ్చు.
మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (MIS)
ఒకేసారి డబ్బు తీసుకునే బదులుగా ప్రతినెలా ఖర్చుల కోసం కొంత మొత్తం కావాలనుకునే వారు పోస్టాఫీస్ ఎంఐఎస్ వైపు మొగ్గు చూపవచ్చు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఏడాదికి 7.4 శాతం వడ్డీని అందజేస్తోంది. ఇందులో రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టినట్లయితే ప్రతి నెలా దాదాపు రూ.1,233 చొప్పున నేరుగా ఖాతాలో జమ అవుతాయి. ఈ విధంగా ఐదేళ్ల పాటు క్రమం తప్పకుండా డబ్బు అందుకుంటూ, చివరికి అసలు రూ.2 లక్షలను ఎలాంటి కోత లేకుండా పూర్తిగా వెనక్కి తీసుకోవచ్చు.
సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS)
వయసు మీరిన పెద్దల కోసం పోస్టాఫీస్ ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌ను నిర్వహిస్తోంది. ఈ నాలుగు పథకాలలోకెల్లా అత్యధికంగా 8.2 శాతం వార్షిక వడ్డీ ఈ స్కీమ్‌లోనే లభిస్తుంది. అరవై ఏళ్లు పైబడిన వారు ఇందులో రూ.2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ.4,100 వడ్డీ అందుతుంది. ఐదేళ్ల కాలంలో మొత్తం రూ.82,000 వరకు వడ్డీ ద్వారానే ఆదాయం సమకూరుతుంది. మీ ఆర్థిక అవసరాలను బట్టి తగిన పథకాన్ని ఎంచుకుని భవిష్యత్తును మరింత సురక్షితం చేసుకోండి.