Gold Price: ధంతేరస్, దీపావళి వంటి పెద్ద పండుగల వేళ బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న భారతీయ వినియోగదారులకు గుడ్ న్యూస్ అందింది. దేశంలో పసిడి ధరలు భారీగా దిగివస్తున్నాయి. కేవలం ఒక్కరోజే పసిడి ధర ఏకంగా రూ.1500 కంటే ఎక్కువ తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది. చమురు సంక్షోభం, పెరిగిన ద్రవ్యోల్బణం అలాగే ఊహించని రీతిలో రికార్డు స్థాయికి చేరిన ధరల కారణంగా దేశంలో గోల్డ్ డిమాండ్ ఊహించని విధంగా పడిపోయింది. ఈ డిమాండ్ క్షీణతే పసిడి రేట్లు తగ్గడానికి ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

6 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిన పసిడి డిమాండ్

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ మంగళవారం విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2026 సంవత్సరంలో భారత్‌లో బంగారానికి ఉండే డిమాండ్ దాదాపు ఆరేళ్ల కనిష్ట స్థాయికి అంటే 650 మెట్రిక్ టన్నులకు పడిపోనుందని అంచనా వేసింది. చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పసిడి వినియోగదారుగా ఉన్న భారతదేశంలో ఈ స్థాయిలో కొనుగోళ్లు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. 2020లో కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ఆభరణాల షాపులు మూతపడిన తర్వాత, మళ్లీ ఇంత భారీ స్థాయిలో డిమాండ్ పడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

20 శాతం తగ్గిన జువెలరీ విక్రయాలు

డబ్ల్యూజీసీ ఇండియన్ ఆపరేషన్స్ సిఇఒ సచిన్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం, సెప్టెంబర్ త్రైమాసికంలో దేశంలో పసిడి డిమాండ్ గతేడాదితో పోలిస్తే ఏకంగా 29 శాతం పడిపోయి 162.5 మెట్రిక్ టన్నులకు పరిమితమైంది. ఇందులో ఆభరణాల కొనుగోళ్లు 20 శాతం మేర తగ్గగా, పెట్టుబడి రూపంలో కొనే నాణాలు, బిస్కెట్ల డిమాండ్ ఏకంగా 40 శాతం మేర క్షీణించింది. పసిడి ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలు బంగారం కొనడానికి వెనకడుగు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

గ్రామీణ ప్రాంతాల్లో తగ్గిన రైతుల ఆదాయం

భారతదేశంలో మొత్తం బంగారం డిమాండ్‌లో సగానికి పైగా గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తుంది. అక్కడి ప్రజలు పసిడిని ఒక భద్రమైన పొదుపు మార్గంగా భావిస్తారు. అయితే 2026 వర్షాకాలంలో గడచిన దశాబ్దంలోనే అత్యల్ప వర్షపాతం నమోదైంది. వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయ ఉత్పత్తి తగ్గి, రైతుల ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆభరణాల కొనుగోళ్లు మందగించాయి. మరోవైపు ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచడం వల్ల అధికారికంగా జరిగే బంగారం దిగుమతులు కూడా తగ్గాయి.

రాబోయే రోజుల్లో ధరలు మరిన్ని తగ్గుతాయా?

అక్టోబర్‌లో దసరా ముగియగా, నవంబర్ ప్రారంభంలో దీపావళి అలాగే ఆ తర్వాత పెళ్లిళ్ల సీజన్ రాబోతోంది. ఈ కాలంలో ప్రజలు సాంప్రదాయబద్ధంగా పసిడి కొనుగోలు చేస్తారు కాబట్టి డిసెంబర్ త్రైమాసికంలో డిమాండ్ కొంత కోలుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ తక్కువగా ఉన్నందున రాబోయే రోజుల్లో పసిడి ధరలు మరికొంత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది బంగారం ప్రియులకు ఖచ్చితంగా మంచి పరిణామమే అని చెప్పాలి.

Tags: