India US Trade Deal : మన పాలు, పెరుగు అమెరికాకు ఇస్తే.. లక్ష కోట్లు నష్టమట.. అది ఎలా ?

లక్ష కోట్లు నష్టమట.. అది ఎలా ?;

Update: 2025-07-16 03:36 GMT

India US Trade Deal : భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా, భారతదేశంలోని డైరీ మార్కెట్లోకి ప్రవేశించడానికి ఆసక్తిగా ఉంది. అయితే, లక్షలాది భారతీయ రైతుల జీవనాధారమైన ఈ రంగాన్ని విదేశాలకు తెరవడానికి భారత్‌కు ఇష్టం లేదు. దీనివల్లనే ఈ ఒప్పందం ఓ కొలిక్కి రావడం ఆలస్యమవుతోంది. ఒకవేళ, భారత డైరీ మార్కెట్‌ను అమెరికాకు తెరిస్తే ఏం జరుగుతుంది? దీని వల్ల ఎంత నష్టం ఉండవచ్చో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పరిశోధన నివేదికలో వెల్లడించింది.

ఎస్బీఐ నివేదిక ప్రకారం, భారత డైరీ మార్కెట్‌ను అమెరికాకు తెరిచివేస్తే భారతీయ రైతులకు సుమారు రూ.1.03 లక్షల కోట్ల నష్టం జరగవచ్చు. అలాగే, దేశ ఆదాయానికి రూ.1.8 లక్షల కోట్ల నష్టం వాటిల్లవచ్చు. దీనికి ప్రధాన కారణం, అమెరికా నుంచి చౌకైన పాల ఉత్పత్తులు దిగుమతి అయితే దేశంలో పాల ధరలు కనీసం 15% తగ్గే అవకాశం ఉందని ఎస్బీఐ నివేదిక చెబుతోంది. ఒకవేళ పాల ధరలు 15% తగ్గితే, మొత్తం ఆదాయానికి రూ.1.8 లక్షల కోట్లు నష్టం జరుగుతుంది. ఈ ఆదాయంలో రైతు వాటా 60% కాబట్టి, వారికి రూ.1.03 లక్షల కోట్ల నష్టం ఉంటుందని ఎస్బీఐ తన నివేదికలో వివరించింది.

భారత డైరీ మార్కెట్‌ను అమెరికాకు తెరిస్తే పాల దిగుమతులు 25 మిలియన్ టన్నుల మేర పెరగవచ్చని ఎస్బీఐ నివేదిక అంచనా వేసింది. దేశంలో పాల ధరలు 15% తగ్గితే పాల వినియోగం పెరిగి, దాదాపు 14 మిలియన్ టన్నుల అదనపు పాల అవసరం ఏర్పడుతుంది. అదే సమయంలో, తక్కువ ధరల వల్ల రైతులు పాల ఉత్పత్తిని తగ్గించి 11 మిలియన్ టన్నుల పాలు తక్కువగా సరఫరా చేయవచ్చు. ఈ 25 మిలియన్ టన్నుల కొరతను అమెరికా నుంచి దిగుమతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుందని ఈ నివేదిక హెచ్చరించింది.

అమెరికాలో డైరీ పరిశ్రమకు ప్రభుత్వం భారీ సబ్సిడీలు అందిస్తుంది. అందువల్ల అక్కడి పాల ఉత్పత్తులు తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయి. ఇది భారతీయ రైతులకు, ముఖ్యంగా కొన్ని ఆవులనే నమ్ముకుని బతుకుతున్న చిన్న రైతులకు తీవ్ర నష్టం కలిగించవచ్చు. అమెరికా డైరీ రంగంలో జన్యుమార్పిడి ఆహారాలు, గ్రోత్ హార్మోన్ల వాడకం విస్తృతంగా ఉంది. ఒకవేళ భారత్ డైరీ మార్కెట్‌ను తెరిచివేస్తే, ఈ రకమైన ఉత్పత్తులు భారత మార్కెట్‌లోకి విరివిగా వచ్చే ప్రమాదం ఉందని ఎస్బీఐ నివేదిక మరో ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది. ఇది దేశ ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రమాదకరంగా మారవచ్చని నివేదిక పేర్కొంది.

Tags:    

Similar News