Budget 2026 : పన్ను చెల్లింపుదారులకు బంపర్ ఆఫర్..జంట పన్ను విధానంతో భారీగా తగ్గనున్న ట్యాక్స్
జంట పన్ను విధానంతో భారీగా తగ్గనున్న ట్యాక్స్
Budget 2026 : సాధారణంగా మన దేశంలో ఆదాయపు పన్నును వ్యక్తిగత ప్రాతిపదికన లెక్కిస్తారు. అంటే భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నా, లేదా ఒకరు మాత్రమే సంపాదిస్తున్నా.. ఎవరి ట్యాక్స్ వారే విడిగా లెక్కించుకోవాలి. కానీ రాబోయే బడ్జెట్‌లో ప్రభుత్వం జాయింట్ ట్యాక్సేషన్ అనే కొత్త కాన్సెప్ట్‌ను తీసుకురావాలని యోచిస్తోంది. ఈ విధానం ప్రకారం.. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒకే ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయవచ్చు. దీనివల్ల వారిద్దరి ఆదాయాన్ని కలిపి ఒకే యూనిట్‌గా పరిగణిస్తారు. ఫలితంగా వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల కంటే వీరికి ఎక్కువ మినహాయింపులు లభిస్తాయి.
ఈ విధానం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటంటే.. పన్ను మినహాయింపు పరిమితి రెట్టింపు కావడం. ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం.. జాయింట్ ట్యాక్సేషన్ ఎంచుకునే దంపతులకు రూ.8 లక్షల వరకు ఎటువంటి పన్ను ఉండకపోవచ్చు. అలాగే, అత్యధిక పన్ను రేటు అయిన 30 శాతాన్ని ప్రస్తుతం రూ.24 లక్షల ఆదాయం దాటితే విధిస్తున్నారు. కానీ జాయింట్ సిస్టమ్‌లో ఈ పరిమితిని రూ.48 లక్షలకు పెంచే అవకాశం ఉంది. అంటే ఎక్కువ సంపాదన ఉన్న దంపతులు తక్కువ పన్ను స్లాబ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కేవలం పన్ను మాత్రమే కాదు, ఆదాయం రూ.50 లక్షలు దాటినప్పుడు పడే సర్ఛార్జ్ భారం కూడా ఈ విధానంలో తగ్గుతుంది. జంట పన్ను విధానంలో ఈ సర్ఛార్జ్ పరిమితిని రూ.75 లక్షలకు పెంచవచ్చని సమాచారం.
ఈ విధానం వల్ల అందరికంటే ఎక్కువగా లబ్ధి పొందేది సింగిల్ ఇన్‌కమ్ కుటుంబాలు. ఉదాహరణకు.. భర్త మాత్రమే సంపాదిస్తూ భార్య గృహిణిగా ఉంటే, భర్త సంపాదనపై పడే భారీ పన్ను భారం ఈ విధానంతో సగానికి తగ్గుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తున్నా కూడా, వారు విడివిడిగా పన్ను కట్టాలా లేదా కలిపి కట్టాలా అనేది వారి ఇష్టానికే వదిలేసే అవకాశం ఉంది. ఏ పద్ధతిలో ఎక్కువ లాభం ఉంటే దానిని పన్ను చెల్లింపుదారులు ఎంచుకోవచ్చు. దీనివల్ల కుటుంబాల వద్ద పొదుపు పెరుగుతుందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం ఉన్న వెబ్‌సైట్ సమాచారం ప్రకారం..ఈ విధానం ద్వారా కేవలం పన్ను ఆదా మాత్రమే కాకుండా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం కూడా సులభతరం అవుతుంది. ఒకే ఇంట్లో రెండు మూడు ఐటీఆర్ ఫైల్ చేసే బదులు ఒకే రిటర్న్ ఫైల్ చేయడం వల్ల సమయం మరియు ఖర్చు ఆదా అవుతాయి. అయితే ఇది ఇంకా ప్రాథమిక చర్చల దశలోనే ఉంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.