Budget 2026 : పన్ను చెల్లింపుదారులకు నిర్మలమ్మ స్వీట్ న్యూస్..స్లాబులు మారకపోయినా జేబులు నిండుతాయి
స్లాబులు మారకపోయినా జేబులు నిండుతాయి
Budget 2026 : కేంద్ర బడ్జెట్ 2026లో ఆదాయపు పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులు లేకపోయినా, పన్ను చెల్లింపుదారులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అదిరిపోయే ఊరటనిచ్చారు. పన్నుల వ్యవస్థను సరళతరం చేస్తూ, సామాన్యులకు భయం లేని పాలనను అందించడమే లక్ష్యంగా కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి రానున్న ఈ కొత్త చట్టంలో ఉన్న కీలక మార్పులు, పన్ను చెల్లింపుదారులకు కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.
బడ్జెట్ 2026లో ఆదాయపు పన్ను రేట్లలో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. అంటే పాత, కొత్త పన్ను విధానాలు యథాతథంగా కొనసాగుతాయి. అయితే పన్ను చెల్లింపుదారుల దైనందిన సమస్యలను పరిష్కరించే దిశగా అనేక విప్లవాత్మక మార్పులను ప్రకటించారు. ఇందులో ప్రధానమైనది టాక్స్ నేరాల డీక్రిమినలైజేషన్. అంటే ఇప్పటివరకు పన్ను ఎగవేస్తే జైలుకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త చట్టం ప్రకారం పన్ను చెల్లింపులో పొరపాట్లు జరిగినా, ఆదాయం దాచినా జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం 30 శాతం పన్ను, జరిమానా చెల్లించి ఆ వివాదాన్ని ముగించవచ్చు. ఇది నిజాయితీ గల పన్ను చెల్లింపుదారులకు ఒక పెద్ద ఊరట.
విదేశాలకు వెళ్లే వారికి, తమ పిల్లలను విదేశాల్లో చదివించే తల్లిదండ్రులకు ఈ బడ్జెట్ ఒక పెద్ద కానుకను అందించింది. గతంలో విదేశీ టూర్లు, విద్య లేదా వైద్యం కోసం ఖర్చు చేసేటప్పుడు టీసీఎస్ 5 శాతం నుంచి 20 శాతం వరకు ఉండేది. దీనివల్ల ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడయ్యేవి. తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం దీన్ని భారీగా తగ్గించి కేవలం 2 శాతానికి పరిమితం చేసింది. దీనివల్ల విదేశీ చదువులు, వైద్యం మరియు టూర్ ప్యాకేజీల ధరలు సామాన్యులకు అందుబాటులోకి రానున్నాయి. అలాగే విదేశాల్లో ఆస్తులు ఉండి ప్రకటించని వారికి మరో 6 నెలల పాటు అవకాశం కల్పిస్తూ డిస్క్లోజర్ స్కీమ్‌ను ప్రకటించారు.
ఐటీఆర్ ఫైలింగ్ విషయంలో కూడా ప్రభుత్వం సరళమైన విధానాలను తీసుకొచ్చింది. రిటర్న్స్ దాఖలు చేసేటప్పుడు చిన్న చిన్న తప్పులు దొర్లితే వాటిని సరిదిద్దుకోవడానికి ఇప్పుడు మరింత సమయం ఇస్తున్నారు. దీనికోసం నామమాత్రపు ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. అలాగే ఐటీఆర్-1, ఐటీఆర్-2 దాఖలు చేసే వారికి జూలై 31 చివరి తేదీగా నిర్ణయించారు. టీడీఎస్ సర్టిఫికెట్ల కోసం ఇకపై టాక్స్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సామాన్య పన్ను చెల్లింపుదారుల కోసం ఈ ప్రక్రియను ప్రభుత్వం పూర్తిగా ఆటోమేటిక్ చేసింది.
ఇక స్థిరాస్తి కొనుగోలు చేసే వారికి కూడా ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు ఎన్నారైల నుంచి ఆస్తులు కొనుగోలు చేసేటప్పుడు టీడీఎస్ కట్ చేయడానికి TAN నంబర్ తప్పనిసరిగా ఉండాలి. ఇది సామాన్యులకు చాలా కష్టమైన పని. కానీ ఇప్పుడు టాన్ నంబర్ లేకుండానే నేరుగా టీడీఎస్ కట్ చేసే సదుపాయాన్ని కల్పించారు. దీనితో పాటు మదుపరులకు సౌలభ్యం కోసం ఫామ్ 15G, 15H ప్రక్రియను కూడా డిపాజిటరీల ద్వారా మరింత సులభతరం చేశారు. మొత్తం మీద స్లాబులు మారకపోయినా, నిబంధనలు మారడం వల్ల పన్ను చెల్లింపుదారుల కష్టాలు చాలా వరకు తగ్గాయని చెప్పవచ్చు.