Trending News

Budget 2026 : 80C పరిమితి రూ.3 లక్షలకు పెరుగుతుందా? మధ్యతరగతి ప్రజల ప్రధాన డిమాండ్ ఇదే

మధ్యతరగతి ప్రజల ప్రధాన డిమాండ్ ఇదే

Update: 2026-01-24 10:43 GMT

Budget 2026 : బడ్జెట్ 2026 దగ్గరపడుతున్న వేళ పాత ఆదాయపు పన్ను విధానాన్ని అనుసరిస్తున్న ట్యాక్స్ పేయర్లలో ఉత్కంఠ నెలకొంది. గత పదేళ్లుగా ఆదాయం, ఖర్చులు, ద్రవ్యోల్బణం పెరిగినా.. పాత పన్ను విధానంలో ఇచ్చే పన్ను మినహాయింపుల పరిమితి మాత్రం పెరగలేదు. దీంతో సామాన్యులు ఆశించిన స్థాయిలో పన్ను ఆదా చేయలేకపోతున్నారు. మరి ఈ బడ్జెట్‌లోనైనా నిర్మలమ్మ పాత విధానం వైపు మొగ్గు చూపుతారా? లేక అందరినీ కొత్త పన్ను విధానం వైపు నెట్టేస్తారా? అనే చర్చ జోరుగా సాగుతోంది.

బడ్జెట్ 2026 సమీపిస్తున్న తరుణంలో పాత పన్ను విధానంలో మార్పులు చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా అత్యంత ప్రజాదరణ పొందిన సెక్షన్ 80C కింద ఉన్న రూ.1.5 లక్షల పరిమితి చివరిసారిగా 2014లో సవరించబడింది. గత 12 ఏళ్లలో ద్రవ్యోల్బణం, విద్యార్ధుల ఫీజులు, జీవన ప్రమాణాలు విపరీతంగా పెరిగినప్పటికీ, పన్ను ఆదా పరిమితి మాత్రం అక్కడే ఉండిపోయింది. చార్టర్డ్ అకౌంటెంట్ డాక్టర్ సురేష్ సురానా వంటి నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ పరిమితిని రూ.3 లక్షలకు పెంచితేనే మధ్యతరగతి ప్రజలకు అసలైన ఊరట లభిస్తుంది.

కేవలం 80C మాత్రమే కాదు, ఆరోగ్య బీమా ప్రీమియంలకు వర్తించే సెక్షన్ 80D పరిమితి కూడా 2015 నుంచి మారలేదు. ప్రస్తుతం సెల్ఫ్, ఫ్యామిలీ కోసం రూ.25,000, సీనియర్ సిటిజన్లకు రూ.50,000 వరకు మాత్రమే మినహాయింపు ఉంది. కరోనా మహమ్మారి తర్వాత మెడికల్ ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు రెండింతలు పెరిగాయి. అయినప్పటికీ ప్రభుత్వం పాత పరిమితులనే కొనసాగిస్తుండటంతో, సామాన్యులు తమ జేబుల నుంచి భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ పరిమితులను పెంచడం ద్వారా ప్రజలు మరింత మెరుగైన హెల్త్ కవరేజ్ తీసుకునే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

హోమ్ లోన్ తీసుకున్న వారికి కూడా నిరాశే ఎదురవుతోంది. సెక్షన్ 24(b) కింద సొంత ఇంటి వడ్డీపై ఇచ్చే రూ.2 లక్షల మినహాయింపు 2014 నాటి రియల్ ఎస్టేట్ ధరల ప్రకారం నిర్ణయించబడింది. ఇప్పుడు నగరాల్లో ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి, దానివల్ల లోన్ మొత్తాలు మరియు వడ్డీ భారం కూడా పెరిగాయి. ఈ పరిమితిని స్టాంప్ డ్యూటీ ధరలకు అనుగుణంగా పెంచాలని గృహ కొనుగోలుదారులు కోరుతున్నారు. తొలిసారి ఇల్లు కొనేవారికి కొన్ని అదనపు వెసులుబాట్లు ఉన్నప్పటికీ, అవి చాలా కఠినమైన నిబంధనలతో కూడి ఉండటంతో అందరికీ ఉపయోగపడటం లేదు.

అయితే, ప్రభుత్వం ఎందుకు ఈ మినహాయింపులను పెంచడం లేదనే దానికి ఒక స్పష్టమైన కారణం ఉంది. కేంద్రం వ్యూహాత్మకంగా పన్ను చెల్లింపుదారులను కొత్త పన్ను విధానం (NTR) వైపు మళ్లించాలని చూస్తోంది. ఇందులో పన్ను రేట్లు తక్కువగా ఉంటాయి కానీ ఎలాంటి మినహాయింపులు ఉండవు. ఇప్పటికే 80 శాతం మంది ట్యాక్స్ పేయర్లు కొత్త విధానంలోకి మారిపోయారు. పాత విధానంలో రాయితీలు పెంచితే, కొత్త విధానానికి ఆదరణ తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మరి బడ్జెట్ 2026లో ప్రభుత్వం పాత మినహాయింపులను అప్‌డేట్ చేస్తుందా లేదా వాటిని కాలక్రమేణా కనుమరుగు చేస్తుందా అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News