Central Govt Bonus 2025: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. దసరా ముందు 30 రోజుల బోనస్

దసరా ముందు 30 రోజుల బోనస్

Update: 2025-10-01 07:14 GMT

Central Govt Bonus 2025: భారతదేశంలో పండగల సీజన్ వచ్చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ఒక గొప్ప కానుకను ప్రకటించింది. సోమవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వంలోని గ్రూప్ సి, గెజిటెడ్ కాని గ్రూప్ బి ఉద్యోగులకు 30 రోజుల జీతానికి సమానమైన యాడ్-హాక్ బోనస్ లభించనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ ఉద్యోగులకు రూ.6,908 బోనస్‌గా వస్తుంది. ఈ ప్రకటనతో కేంద్ర ఉద్యోగులు దసరా, ఇతర పండగలను మరింత ఆనందంగా జరుపుకోవచ్చు.

ప్రభుత్వం స్పష్టం చేసిన వివరాల ప్రకారం.. ఈ బోనస్ కోసం కొన్ని అర్హత నిబంధనలు ఉన్నాయి. 2025 మార్చి 31 వరకు సర్వీసులో ఉన్న, కనీసం 6 నెలలు నిరంతరాయంగా పనిచేసిన ఉద్యోగులకు ఈ బోనస్ లభిస్తుంది. కేంద్ర పారామిలిటరీ బలగాలు, సాయుధ బలగాలలోని ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుంది. అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం జీతాల నిర్మాణాన్ని అనుసరించే కేంద్ర పాలిత ప్రాంతాల ఉద్యోగులకు కూడా ఈ బోనస్ అందుతుంది. ఏడాది పొడవునా పనిచేసిన వారికి పూర్తి రూ.6,908 బోనస్ లభిస్తుంది. అయితే, పూర్తి 12 నెలలు పనిచేయని వారికి, వారు పనిచేసిన నెలల ఆధారంగా ప్రో-రాటా పద్ధతిలో బోనస్ లభిస్తుంది.

కేవలం పర్మనెంట్ ఉద్యోగులకే కాకుండా, ప్రభుత్వం తాత్కాలిక, కాజువల్ ఉద్యోగుల కోసం కూడా బోనస్ ప్రకటించింది. గత మూడు సంవత్సరాలుగా నిరంతరాయంగా పనిచేస్తున్న కాజువల్ ఉద్యోగులకు రూ.1,184 బోనస్‌గా లభిస్తుంది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంలో కింది స్థాయి ఉద్యోగులకు కూడా పండగ వేళ ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది.

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, యాడ్-హాక్ బోనస్‌ను లెక్కించడానికి నెలవారీ జీతం గరిష్ట పరిమితి రూ.7,000 గా నిర్ణయించబడింది. బోనస్‌ను లెక్కించే పద్ధతి చాలా సులభం..ఉద్యోగి సగటు జీతం లేదా రూ.7,000 గరిష్ట పరిమితి – ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే, ఆ మొత్తాన్ని 30 రోజుల జీతానికి సమానమైన బోనస్‌గా లెక్కిస్తారు. ఉదాహరణకు, ఒక ఉద్యోగి నెలవారీ జీతం రూ.7,000 అయితే, 30 రోజుల బోనస్ సుమారు రూ.6,907 అవుతుంది. ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరింత ఉత్సాహంగా పండగలను జరుపుకోవచ్చు.

Tags:    

Similar News