NIPU 2026: యూరియా ఉత్పత్తిలో పూర్తి స్వయం సమృద్ధి సాధించే దిశగా భారత ప్రభుత్వం కీలక అడుగు వేసింది. జాతీయ యూరియా పెట్టుబడి విధానం (NIPU)-2026 కింద దేశవ్యాప్తంగా 6 కొత్త బ్రౌన్‌ఫీల్డ్ యూరియా ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ఆరు ప్రాజెక్టులపై సుమారు రూ.54,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నారు. అంటే ఒక్కో ప్లాంట్‌పై సగటున రూ.9,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ కొత్త ప్లాంట్ల ద్వారా దేశంలో ఏటా 76.2 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు యూరియా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఏయే రాష్ట్రాల్లో కొత్త ప్లాంట్లు రాబోతున్నాయి?

కేంద్రం ఆమోదించిన ఈ 6 యూరియా ప్లాంట్లు దేశంలోని ఐదు ప్రధాన రాష్ట్రాల్లో ఏర్పాటవుతున్నాయి. తమిళనాడులోని మద్రాస్, పంజాబ్‌లోని నంగల్, ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్, జగదీష్‌పూర్, పశ్చిమ బెంగాల్‌లోని పానాగఢ్, రాజస్థాన్‌లోని గడేపన్ ప్రాంతాల్లో వీటిని నిర్మించనున్నారు. వీటితో పాటు ఎక్కువ విద్యుత్ వినియోగించే పాత యూరియా యూనిట్లను కూడా ఆధునిక సాంకేతికతతో అప్‌గ్రేడ్ చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్, సహకార రంగాలకు చెందిన కంపెనీలు కలిసి ఈ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టనున్నాయి.

విదేశీ దిగుమతులకు చెక్

ప్రస్తుతం మన దేశంలో ఏటా సుమారు 400 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం జరుగుతోంది. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఉత్పత్తి 293.30 లక్షల మెట్రిక్ టన్నులుగా మాత్రమే నమోదైంది. మిగిలిన అవసరాల కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. కొత్త ప్లాంట్లు అందుబాటులోకి వస్తే విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గి, భారీగా విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది. అలాగే కొత్త ఉద్యోగాల కల్పనతో పాటు రైతులకు ఎలాంటి కొరత లేకుండా సకాలంలో ఎరువులు అందుతాయి. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఈ పాలసీలో 12 నుంచి 16 శాతం వరకు రిటర్న్ ఆన్ ఈక్విటీ వెసులుబాటు కల్పించారు.

ప్రభుత్వ, సహకార రంగ ప్రాజెక్టుల వివరాలు

రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం, తమిళనాడులోని MFL-మద్రాస్ ఒక ప్రభుత్వ రంగ బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్. 60 ఏళ్లకు పైగా పాతదైన యూనిట్ స్థానంలో ఏటా 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. పంజాబ్‌లోని NFL నంగల్ కూడా 50-55 ఏళ్ల నాటి పాత ప్లాంట్ స్థానంలో 12.7 LMT సామర్థ్యంతో కొత్తగా రానుంది. ఇక ఉత్తరప్రదేశ్‌లోని KFL-షాజహాన్‌పూర్ అనేది క్రిభ్‌కో సహకార రంగ ప్రాజెక్ట్. 1995లో మొదలైన ఈ యూనిట్ సామర్థ్యాన్ని 12.7 LMT కి పెంచుతున్నారు.

ప్రైవేట్ రంగంలోనూ 3 భారీ ప్రాజెక్టులు

ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ విస్తరణలో భాగమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని మ్యాటిక్స్-పానాగఢ్ ప్రాజెక్ట్ 2017లో మొదలైన ఆధునిక ప్లాంట్‌కు అనుబంధంగా 12.7 LMT అదనపు సామర్థ్యంతో నిర్మితమవుతోంది. రాజస్థాన్‌లోని CFCL గడేపన్ ప్లాంట్ 1994 నుంచి నడుస్తుండగా, ఇప్పుడు మరో 12.7 LMT సామర్థ్యాన్ని జోడిస్తున్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌లోని IIPL-జగదీష్‌పూర్ ప్రైవేట్ ప్రాజెక్ట్ 1988 నాటి ప్లాంట్‌లో 12.7 LMT వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు సిద్ధమైంది.

Tags: