Trump Tariff: ఎన్నికల్లో దెబ్బతిన్నా తగ్గేదేలే అంటున్న ట్రంప్.. చైనా సహా 14 దేశాలపై కొత్త టారిఫ్ బాంబ్
| చైనా సహా 14 దేశాలపై కొత్త టారిఫ్ బాంబ్
Trump Tariff: అమెరికాలో మూడు వారాల క్రితం జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పెరుగుతున్న ధరలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓటర్లు ట్రంప్ పార్టీని తిరస్కరించారు. ఈ ఓటమికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న టారిఫ్ విధానమే కారణమని విశ్లేషకులు భావించారు. అయినప్పటికీ ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ట్రంప్ యంత్రాంగం చైనా, జపాన్, యూరోపియన్ యూనియన్ సహా 14 ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాల నుంచి వచ్చే వస్తువులపై కొత్త టారిఫ్‌లను ప్రతిపాదించింది. పైకి ఇది ఆత్మహత్యాసదృశంగా కనిపించినా, దీని వెనుక వైట్ హౌస్ కొత్త రాజకీయ వ్యూహం దాగి ఉంది.
పార్లమెంట్లో పట్టు కోల్పోవడంతో ట్రంప్ కొత్త అస్త్రం
ట్రంప్ పదవీకాలంలోని చివరి రెండేళ్లలో అమెరికా పార్లమెంట్ (కాంగ్రెస్) పై విపక్ష డెమొక్రాట్ల ఆధిపత్యం కొనసాగనుంది. దీనివల్ల ట్రంప్ తన సొంత చట్టాలను ఆమోదింపజేసుకోవడం కష్టంగా మారుతుంది. అందుకే చట్టసభల అనుమతి లేకుండానే నేరుగా అమలు చేయగలిగే టారిఫ్‌లను ఆయన ప్రధాన ఆయుధంగా ఎంచుకున్నారు. పార్లమెంట్లో బలం తగ్గినా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో తన పట్టు తగ్గలేదని నిరూపించుకోవాలనేది ట్రంప్ ఆలోచన. విదేశీ కంపెనీలను అమెరికాలోనే ఫ్యాక్టరీలు పెట్టేలా ఒత్తిడి తేవడానికి, పన్ను కోతల వల్ల ప్రభుత్వానికి తగ్గిన ఆదాయాన్ని భర్తీ చేసుకోవడానికి ఈ సుంకాలు ఉపయోగపడతాయని ఆయన నమ్ముతున్నారు.
కొత్త టారిఫ్ రేట్లు
కొత్త ప్రతిపాదన ప్రకారం ఎంపిక చేసిన విదేశీ వస్తువులపై గరిష్టంగా 20 నుంచి 40 శాతం వరకు టారిఫ్ విధించే అవకాశం ఉంది. అయితే అమెరికాతో ఇప్పటికే వాణిజ్య ఒప్పందాలు ఉన్న దేశాలకు ఈ రేటు 10 నుంచి 20 శాతం వరకే పరిమితం కానుంది. 2025లో ట్రంప్ విధించిన పాత టారిఫ్‌లను ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా సుప్రీంకోర్టు చట్టవిరుద్ధమని కొట్టివేసింది. ఎనిమిది నెలల సమీక్ష తర్వాత ఇప్పుడు కొత్త రూల్స్ తీసుకొచ్చారు. గతేడాది వైట్ హౌస్‌లో ఆర్భాటంగా ప్రకటించినట్లు కాకుండా, ఈసారి థాంక్స్ గివింగ్ ముందు రోజు అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిసన్ గ్రీర్ నిశ్శబ్దంగా ఈ ప్రకటన చేశారు. అయినా దీని ప్రభావంతో బుధవారం అమెరికా స్టాక్ మార్కెట్ సూచీ S&P 500 నష్టాల్లో ముగిసింది.
ధరల మంటపై జనం ఆగ్రహం
ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌లో మూడింట రెండొంతుల మంది ఓటర్లు ట్రంప్ టారిఫ్‌ల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని అభిప్రాయపడ్డారు. యేల్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం ఈ సుంకాల వల్ల ప్రతి అమెరికన్ కుటుంబంపై ఏడాదికి అదనంగా 900 డాలర్ల భారం పడుతోంది. సామాన్యుల కష్టాలను ట్రంప్ పట్టించుకోవడం లేదని డెమొక్రాట్లు మండిపడుతున్నారు. ఇరాన్‌పై సైనిక చర్యల కారణంగా ఇప్పటికే చమురు సరఫరా, రవాణా ఖర్చులు పెరిగి ద్రవ్యోల్బణం ఎగబాకిందని, ఇప్పుడు కొత్త టారిఫ్‌లు జనాన్ని మరింత ఇబ్బంది పెడతాయని విమర్శిస్తున్నారు.
సొంత పార్టీలోనే అసమ్మతి సెగలు
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై సొంత రిపబ్లికన్ పార్టీ నేతలే పెదవి విరుస్తున్నారు. టారిఫ్ అనేది పరోక్షంగా అమెరికన్ వినియోగదారులపై వేసే పన్ను అని రిపబ్లికన్ ఎంపీ డాన్ బేకన్ విమర్శించారు. ధరల పెరుగుదల వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని, దిగుమతి సుంకాలు విధించే అధికారాన్ని పార్లమెంట్ తిరిగి తన చేతుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు విదేశీ కంపెనీల దోపిడీ నుంచి అమెరికా కార్మికులు, రైతులను కాపాడటమే తమ లక్ష్యమని వైట్ హౌస్ సమర్థించుకుంటోంది.