PNG Pipeline : గ్యాస్ సిలిండర్ కష్టాలకు కేంద్రం చెక్.. 24 గంటల్లోనే పైప్‌లైన్ గ్యాస్ కనెక్షన్‌కు గ్రీన్ సిగ్నల్

24 గంటల్లోనే పైప్‌లైన్ గ్యాస్ కనెక్షన్‌కు గ్రీన్ సిగ్నల్

Update: 2026-03-18 07:00 GMT

PNG Pipeline : దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లకు పెరుగుతున్న డిమాండ్, సరఫరాపై పడుతున్న ఒత్తిడిని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్యాస్ పైప్‌లైన్ ఏర్పాటుకు సంబంధించిన కొత్త దరఖాస్తులను కేవలం 24 గంటల్లోనే ఆమోదించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు సిలిండర్ల మీద ఆధారపడటం తగ్గించి, నేరుగా పైప్‌లైన్ ద్వారా వచ్చే గ్యాస్‌ను వినియోగించుకునేలా ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. దీనివల్ల గృహ వినియోగ గ్యాస్ సరఫరాపై ఉన్న భారం గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు ఘాటుగా లేఖలు రాసింది. పెండింగ్‌లో ఉన్న పాత ఫైళ్లను వెంటనే క్లియర్ చేయాలని, కొత్త అప్లికేషన్లను ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమోదించాలని సూచించింది. పైప్‌లైన్ల ఏర్పాటు కోసం రోడ్లను తవ్వినప్పుడు వసూలు చేసే రోడ్ రెస్టోరేషన్ ఛార్జీలను కూడా రద్దు చేయాలని లేదా తగ్గించాలని రాష్ట్రాలకు సలహా ఇచ్చింది. అలాగే ఈ పనుల్లో ఎక్కడా జాప్యం జరగకుండా ఉండేందుకు ప్రతి రాష్ట్రంలో ఒక ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలని కేంద్రం ఆదేశించింది.

దేశంలోని ఇంధన నిల్వలపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో ముడి చమురు నిల్వలు సాధారణంగా ఉన్నాయని, పెట్రోల్, డీజిల్ కొరత ఏమీ లేదని స్పష్టం చేసింది. అయితే ఎల్‌పీజీ సరఫరాపై కొంత ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని, కానీ ఎక్కడా గ్యాస్ పూర్తిగా అయిపోయే పరిస్థితి లేదని వెల్లడించింది. వినియోగదారులు కంగారు పడి ముందే బుకింగ్‌లు చేసుకోవద్దని, ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకుంటే సరఫరా మరింత సులభంగా ఉంటుందని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ విజ్ఞప్తి చేశారు.

మరోవైపు గ్యాస్ సిలిండర్ల నల్లబజారుపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన దాదాపు 12,000 దాడుల్లో 15,000 సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో 600, ఉత్తరప్రదేశ్‌లో వందల సంఖ్యలో సిలిండర్లు సీజ్ చేయడమే కాకుండా 10 మందిని అరెస్ట్ చేశారు. కేరళ, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా భారీగా సోదాలు నిర్వహించి నల్లబజారుకు అడ్డుకట్ట వేస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ సరఫరాను గాడిలో పెట్టేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.

ఎల్‌పీజీపై ఒత్తిడిని తగ్గించడానికి ప్రభుత్వం ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా బొగ్గు, కిరోసిన్ వినియోగాన్ని పెంచాలని నిర్ణయించింది. ఇప్పటికే బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు కిరోసిన్ కోటాను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. హోటళ్లు, ఇతర వ్యాపార సంస్థలు గ్యాస్ బదులు ప్రత్యామ్నాయ ఇంధనాలను వాడేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యలన్నీ సఫలమైతే రాబోయే రోజుల్లో గ్యాస్ సిలిండర్ల కోసం నిరీక్షించాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.

Tags:    

Similar News