iPhone: సోషల్ మీడియా స్టార్ వినూత్న ప్రకటన.. లక్కీ డ్రా ద్వారా పది మందికి ఫ్రీగా ఐఫోన్లు
ఫ్రీగా ఐఫోన్లు
iPhone: ప్రస్తుత టెక్నాలజీ యుగంలో అందరి చేతుల్లోనూ స్మార్ట్‌ఫోన్లు కామన్ అయిపోయాయి. అందులోనూ యాపిల్ ఐఫోన్ వాడాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే వీటి ధరలు ఆకాశాన్నంటడంతో అందరూ కొనుగోలు చేయలేకపోతున్నారు. అలాంటి సామాన్యుల కోరికను తీర్చడానికి చండీగఢ్‌లో ఒక వినూత్న కార్యక్రమానికి తెరలేచింది. సోషల్ మీడియాలో రాజా ది కింగ్ గా పేరుగాంచిన ప్రముఖ వ్యక్తి రాకేష్ త్రెహాన్ చండీగఢ్‌లో ఐఫోన్ లంగర్ అనే అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ వార్త ప్రస్తుతం దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వినూత్న కార్యక్రమంలో భాగంగా చండీగఢ్, మొహాలీ ప్రాంతాలకు చెందిన సుమారు 1,000 మందిని ఎంపిక చేస్తారు. వీరిలో నుంచి లక్కీ డ్రా ద్వారా 10 మంది విజేతలను లైవ్‌లో అందరి ముందూ ప్రకటిస్తారు. అలా ఎంపికైన ఆ 10 మంది విజేతలకు సరికొత్త ఐఫోన్ 17 లేదా అంతకంటే లేటెస్ట్ మోడల్‌ను పూర్తిగా ఉచితంగా బహుమతిగా అందజేస్తారు. సెప్టెంబర్ 22న ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుండటంతో స్థానిక ప్రజల్లో, టెక్ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేవలం చండీగఢ్ మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో పంజాబ్‌లోని మరో 10 ప్రధాన నగరాల్లో కూడా ఇలాంటి ఐఫోన్ పంపిణీ కార్యక్రమాలను నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఈ ఉచిత ఐఫోన్ గెలుచుకోవడానికి నిర్వాహకులు కొన్ని నిబంధనలు కూడా పెట్టారు. పాల్గొనే అభ్యర్థులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా జై మాతా ది అని రాయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఒక రోజు రాయడం మర్చిపోతే, తర్వాతి రోజు రెండు సార్లు రాసి దానిని భర్తీ చేయాలి. ఈ నిబంధనలను పక్కాగా పాటించే వారిని మాత్రమే లక్కీ డ్రా కోసం పరిగణలోకి తీసుకుంటారు. ఇకపోతే మొదట ఐఫోన్ 16 ఇవ్వాలని భావించినప్పటికీ, పాత మోడల్ ఇస్తే ప్రజలు అసంతృప్తి చెందుతారనే ఉద్దేశంతో ఆ ఆలోచనను విరమించుకుని, కేవలం లేటెస్ట్ మోడల్ అయిన ఐఫోన్ 17 ఇవ్వాలని నిర్ణయించినట్లు రాకేష్ త్రెహాన్ వెల్లడించారు.
ఈ సరికొత్త లంగర్ కాన్సెప్ట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో ఈ ప్రకటన వైరల్ కావడంతో చండీగఢ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. సెప్టెంబర్ 22న జరగబోయే ఈ లైవ్ ఈవెంట్‌లో ఆ అదృష్ట పది మంది విజేతలు ఎవరవుతారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. భక్తితో పాటు టెక్నాలజీని జోడించి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.