ChatGPT : ఎలాన్ మస్క్‌కు గట్టి షాక్.. ఐపీఓగా రాబోతున్న చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ
ఐపీఓగా రాబోతున్న చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ
ChatGPT : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో చాట్ జీపీటీతో సరికొత్త విప్లవాన్ని సృష్టించిన టెక్ దిగ్గజం ఓపెన్ ఏఐ ఇప్పుడు గ్లోబల్ స్టాక్ మార్కెట్లలోకి అడుగుపెట్టడానికి సర్వం సిద్ధం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న ఓపెన్ ఏఐ మెగా ఐపీఓ ఈ ఏడాది చివర్లోనే మార్కెట్లోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. కంపెనీ రాబోయే కొన్ని రోజులు లేదా వారాల్లోనే పబ్లిక్ ఇష్యూకి వెళ్లేందుకు అవసరమైన డ్రాఫ్ట్ పేపర్లను రెగ్యులేటర్ల వద్ద దాఖలు చేయనుంది. ఇందుకోసం ప్రపంచ ప్రసిద్ధ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు గోల్డ్‌మన్ శాక్స్, మోర్గాన్ స్టాన్లీలతో కలిసి శామ్ ఆల్ట్‌మన్ బృందం ప్రాస్పెక్టస్‌ను వేగంగా సిద్ధం చేస్తోంది.
ఓపెన్ ఏఐ పబ్లిక్ ఇష్యూ వైపు అడుగులు వేస్తున్న తరుణంలో ఆ సంస్థకు న్యాయపరంగా అతిపెడ విజయం లభించింది. టెక్ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. ఓపెన్ ఏఐ సిఈఓ శామ్ ఆల్ట్‌మన్‌పై వేసిన సుదీర్ఘమైన కేసును కోర్టు జ్యూరీ పూర్తిగా కొట్టివేసింది. ఓపెన్ ఏఐ సంస్థ తన అసలు ఉద్దేశమైన ప్రజా శ్రేయస్సును పక్కనబెట్టి, కేవలం లాభాపేక్షతో నడుస్తోందని మస్క్ ఆరోపించారు. అయితే, ఈ కేసు విషయంలో ఎలాన్ మస్క్ చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో చాలా ఆలస్యం చేశారనే కారణంతో జ్యూరీ ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ తీర్పుతో ఓపెన్ ఏఐ లిస్టింగ్‌కు ఉన్న అతిపెద్ద లీగల్ అడ్డంకి తొలగిపోయింది.
చాట్ జీపీటీ లాంచ్ అయినప్పటి నుండి ఓపెన్ ఏఐ ఆర్థిక సామర్థ్యం ఆకాశాన్ని తాకుతోంది. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అత్యంత విలువైన ఏఐ స్టార్టప్‌గా అవతరించింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే ఈ కంపెనీ ఏకంగా 852 బిలియన్ డాలర్ల (సుమారు రూ.71 లక్షల కోట్లు) భారీ వాల్యుయేషన్‌తో.. ఏకంగా 122 బిలియన్ డాలర్ల నిధులను సేకరించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఓపెన్ ఏఐ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఫండింగ్ డీల్ కావడం విశేషం. ఏఐ రేసులో గూగుల్, మైక్రోసాఫ్ట్‌లకు గట్టి పోటీ ఇస్తూ భవిష్యత్తు సాంకేతిక మౌలిక వసతుల కోసం ఈ సంస్థ ఏకంగా 1.4 లక్షల కోట్ల డాలర్ల భారీ బడ్జెట్‌ను ప్రకటించింది. ఇందులో అమెజాన్, ఎన్విడియా వంటి క్లౌడ్ సప్లయర్ కంపెనీలు కూడా భారీగా పెట్టుబడులు పెట్టాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రస్థానాన్ని కాపాడుకోవాలంటే నిరంతరం భారీ నిధులు, పరిశోధనలు అవసరం అవుతాయి. ఐపీఓ ద్వారా సేకరించే భారీ మూలధనాన్ని అత్యంత అధునాతనమైన ఏఐ సూపర్ కంప్యూటింగ్ చిప్స్ కొనుగోలు చేయడానికి, అత్యాధునిక డేటా సెంటర్లను నిర్మించడానికి ఓపెన్ ఏఐ ఉపయోగించనుంది. మార్కెట్లో ప్రస్తుతం ఆంత్రోపిక్ వంటి ఏఐ సంస్థలతో పాటు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కూడా ఐపీఓకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ గ్లోబల్ క్యాపిటల్ రేసులో అందరికంటే ముందుండాలనే పక్కా వ్యూహంతోనే శామ్ ఆల్ట్‌మన్ ఈ ఏడాది ముగిసేలోపే వాల్ స్ట్రీట్‌లో గంట కొట్టాలని డిసైడ్ అయ్యారు.