CIBIL Score: సిబిల్ స్కోర్ 750+ ఉన్నా బ్యాంకులు లోన్ ఇవ్వడం లేదా? ఈ చిన్న తప్పులే కారణం
ఈ చిన్న తప్పులే కారణం
CIBIL Score: మంచి సిబిల్ స్కోర్ ఉంటే చాలు బ్యాంకులు వెంటనే లోన్ ఇచ్చేస్తాయని చాలామంది భావిస్తుంటారు. అయితే 750 కంటే ఎక్కువ స్కోర్ ఉన్నప్పటికీ అనేక మంది దరఖాస్తులను బ్యాంకులు నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తున్నాయి. కేవలం సిబిల్ స్కోర్ మాత్రమే కాకుండా ఆర్థిక అలవాట్లను లోతుగా పరిశీలించి బ్యాంకులు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాయో తెలుసుకుందాం.
ఆదాయం కంటే ఈఎంఐలు ఎక్కువగా ఉన్నాయా?
సిబిల్ స్కోర్ ఎంత బాగున్నా బ్యాంకు మేనేజర్లు మొదట చూసేది మీ నెలవారీ ఆదాయాన్ని, ఇప్పటికే చెల్లిస్తున్న ఈఎంఐలను మాత్రమే. దీనిని బ్యాంకింగ్ పరిభాషలో ఫిక్స్డ్ ఆబ్లిగేషన్ టు ఇన్‌కమ్ రేషియో అని పిలుస్తారు. మీ నెలవారీ జీతంలో లేదా సంపాదనలో 50 శాతానికి పైగా ఇప్పటికే ఉన్న లోన్ల ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లుల చెల్లింపులకే సరిపోతుంటే బ్యాంకులు కొత్త లోన్ ఇవ్వడానికి అస్సలు ఇష్టపడవు. కొత్తగా మరో ఈఎంఐ మోసే సామర్థ్యం మీకు లేదని భావించి దరఖాస్తును తిరస్కరిస్తాయి.
క్రెడిట్ కార్డ్ లిమిట్ వాడకం శృతి మించకూడదు
మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ లిమిట్‌ను ఏ స్థాయిలో వాడుతున్నారనేది మీ ఆర్థిక క్రమశిక్షణను తెలియజేస్తుంది. కార్డ్ మొత్తం పరిమితిలో ప్రతి నెలా 30 నుంచి 40 శాతానికి మించి వాడుతుంటే బ్యాంకులు దానిని ప్రమాదకర సంకేతంగా భావిస్తాయి. దీనిని క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో అంటారు. అత్యధికంగా కార్డ్ లిమిట్ వాడేవారికి సిబిల్ స్కోర్ 750కి పైగా ఉన్నప్పటికీ, వారు ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారని భావించి బ్యాంకులు రుణాలు నిరాకరిస్తాయి.
ఉద్యోగం తరచూ మారడం, పదే పదే లోన్ల దరఖాస్తులు
ఆదాయంలో స్థిరత్వం లేకపోవడం లోన్ రిజెక్షన్‌కు మరో ప్రధాన కారణం. పదే పదే ఉద్యోగాలు మారే వారిని బ్యాంకులు తక్కువ నమ్మకమైన కస్టమర్లుగా పరిగణిస్తాయి. ఆదాయం ఎప్పుడు ఆగిపోతుందోననే భయం బ్యాంకర్లలో ఉంటుంది. ఒకే సమయంలో అనేక బ్యాంకుల్లో లోన్ కోసం దరఖాస్తు చేయడం వల్ల మీ క్రెడిట్ రిపోర్టులో 'హార్డ్ ఎంక్వైరీలు' పెరుగుతాయి. దీనివల్ల మీకు అత్యవసరంగా డబ్బు అవసరం ఉందనే సంకేతం బ్యాంకులకు వెళ్లి, దరఖాస్తు రిజెక్ట్ అయ్యే అవకాశం పెరుగుతుంది.
గ్యారంటర్ బాధ్యతలు, క్రెడిట్ మిక్స్ ప్రభావం
కేవలం పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డులు మాత్రమే వాడటం వల్ల క్రెడిట్ మిక్స్ బ్యాలెన్స్ కాకుండా పోతుంది. సురక్షితమైన హోమ్ లోన్లు లేదా కార్ లోన్ల రికార్డు కూడా ఉంటేనే పూర్తి స్థాయి ఆర్థిక బలం కనిపిస్తుంది. వేరొకరి లోన్‌కు గ్యారంటర్‌గా సంతకం చేసి, ఆ వ్యక్తి ఈఎంఐలు సరిగ్గా చెల్లించకపోయినా ఆ ప్రభావం మీ ప్రొఫైల్‌పైనే పడుతుంది. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుని బ్యాంకులు నిర్ణయం తీసుకుంటాయి.
బ్యాంకు నుంచి సులభంగా రుణం పొందాలంటే కేవలం సిబిల్ స్కోర్ పెంచుకుంటే సరిపోదు. ఆదాయానికి తగ్గట్టుగా ఈఎంఐలు ఉండేలా చూసుకోవడం, క్రెడిట్ కార్డ్ వినియోగాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.