Insurance Claim: రోడ్డు ప్రమాదంలో పెన్షనర్ మృతి.. ఇన్సూరెన్స్ కంపెనీకి కోర్టు దిమ్మతిరిగే షాక్
ఇన్సూరెన్స్ కంపెనీకి కోర్టు దిమ్మతిరిగే షాక్
Insurance Claim: ప్రమాదం జరిగినప్పుడు అండగా నిలవాల్సిన బీమా సంస్థలు చిన్నచిన్న సాకులు చూపి క్లెయిమ్‌లను తిరస్కరించడం సాధారణమైపోయింది. తాజాగా ఇలాంటి వ్యవహారంలో ప్రముఖ బీమా సంస్థ టాటా ఏఐజీకి తమిళనాడు రాష్ట్ర వినియోగదారుల కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఒక పెన్షనర్ మద్యం తాగి ఉన్నారనే కారణంతో ఆ సంస్థ రూ. 30 లక్షల ప్రమాద బీమా క్లెయిమ్‌ను నిలిపివేసింది. దీనిపై బాధిత కుటుంబం న్యాయపోరాటం చేయగా, సరైన శాస్త్రీయ ఆధారాలు లేకుండా క్లెయిమ్ తిరస్కరించడం తప్పు అని కమిషన్ తేల్చి చెప్పింది. అసలు సొమ్ముతో పాటు వడ్డీ, నష్టపరిహారం చెల్లించాలని సంచలన ఆదేశాలు జారీ చేసింది.
అసలు ఏం జరిగిందంటే?
తమిళనాడుకు చెందిన గోవిందసామి అనే పెన్షనర్‌కు ఎస్బీఐ పెన్షన్ ఖాతా ద్వారా టాటా ఏఐజీ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ కింద రూ.30 లక్షల బీమా రక్షణ ఉంది. ఏప్రిల్ 9, 2022 న జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో చేర్పించగా, చికిత్స పొందుతూ ఏప్రిల్ 18 న ఆయన మరణించారు. అనంతరం ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు బీమా డబ్బుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రమాద సమయంలో ఆయన మద్యం మత్తులో ఉన్నారని పేర్కొంటూ కంపెనీ జనవరి 2023 లో క్లెయిమ్‌ను తిరస్కరించింది.
కోర్టులో తేలిపోయిన బీమా కంపెనీ వాదనలు
ఈ అన్యాయాన్ని ఎదుర్కొన్న కుటుంబం వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. విచారణ సందర్భంగా బీమా సంస్థ సమర్పించిన పత్రాల్లో అనేక లోపాలను కమిషన్ గుర్తించింది. ఆసుపత్రి డెత్ సమ్మరీలో మద్యం ప్రస్తావన ఉన్నప్పటికీ, ఆ సమాచారాన్ని వైద్యులు పరీక్షించి రాశారా లేక మరెవరైనా చెప్పారా అనే స్పష్టత లేదు. అంతేకాకుండా 106.1 mg/dL ఆల్కహాల్ స్థాయి ఉన్నట్లు సంస్థ వాదించినా, దానికి సంబంధించిన అసలు ల్యాబ్ రిపోర్ట్ గానీ, శాంపిల్ వివరాలు గానీ సమర్పించలేకపోయింది. మరణించిన తేదీ విషయంలో కూడా కంపెనీ రికార్డులకు, ఆసుపత్రి రికార్డులకు మధ్య పొంతన లేకపోవడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.
రూ.30 లక్షలతో పాటు జరిమానా చెల్లింపునకు ఆదేశం
పాలసీ నిబంధనలను అడ్డుపెట్టుకుని క్లెయిమ్ తిరస్కరించేటప్పుడు, ఆ నిబంధన వర్తిస్తుందని నిరూపించే కచ్చితమైన శాస్త్రీయ ఆధారాలను బీమా సంస్థే సమర్పించాలని కమిషన్ స్పష్టం చేసింది. బీమా కంపెనీ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ సెప్టెంబర్ 29, 2026 న తుది తీర్పు వెలువరించింది. బాధిత కుటుంబానికి రూ. 30 లక్షల బీమా మొత్తంతో పాటు, 9 శాతం వార్షిక వడ్డీని చెల్లించాలని ఆదేశించింది. అదనంగా మానసిక వేదన కలిగించినందుకు రూ. 50 వేలు, కోర్టు ఖర్చుల కింద రూ. 25 వేలు చెల్లించాలని తేల్చి చెప్పింది.
పాలసీదారులకు ఈ తీర్పు ఇచ్చే కీలక సందేశం
ఈ తీర్పు దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది బీమా పాలసీదారులకు ఎంతో ఊరటనిచ్చే అంశం. కేవలం ఆసుపత్రి నోట్స్‌లో మద్యం ప్రస్తావన ఉన్నంత మాత్రాన ఇన్సూరెన్స్ కంపెనీలు డబ్బులు ఎగ్గొట్టలేవని దీని ద్వారా నిరూపితమైంది. ఒకవేళ ఎవరికైనా ఇలాంటి కారణాలతో క్లెయిమ్ తిరస్కరణకు గురైతే వెంటనే ఆసుపత్రి రికార్డులు, ల్యాబ్ రిపోర్టుల కాపీలను సేకరించి పరిశీలించాలి. ఆధారాలలో లోపాలు ఉంటే ధైర్యంగా వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించి న్యాయం పొందవచ్చు.