Nvidia Stock Crash: ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్‌ తయారీలో అగ్రగామిగా వెలుగొందుతున్న ప్రముఖ టెక్ దిగ్గజం ఎన్విడియా షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. అమెరికా మార్కెట్‌లో సాధారణ ట్రేడింగ్ ముగిసిన తర్వాత జరిగిన ఆఫ్టర్-అవర్స్ ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు ఏకంగా 10 శాతం వరకు పడిపోయాయి. దీనివల్ల కంపెనీ మార్కెట్ విలువ క్షణాల్లో భారీగా తగ్గిపోయింది. సుమారు 380 బిలియన్ డాలర్ల సంపద కరిగిపోగా, భారతీయ కరెన్సీలో ఇది దాదాపు రూ. 36 లక్షల కోట్లకు సమానం. టెక్ రంగ చరిత్రలో ఒకే రోజు ఇతని భారీ నష్టం నమోదు కావడం ఇన్వెస్టర్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

సీఈఓ జెన్సన్ హువాంగ్ చుట్టూ ముసురుకున్న వివాదాలు

ఈ భారీ పతనానికి ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆయనకు సంబంధించిన కొన్ని పరిణామాలు, అలాగే కంపెనీ బోర్డు ఆయనను పదవి నుంచి తొలగించే యోచనలో ఉందనే వార్తలు మార్కెట్లో దావానలంలా వ్యాపించాయి. ఒక చైనీస్ జాసూస్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా రావడంతో కార్పొరెట్ గవర్నెన్స్ లోపించిందనే అనుమానాలు బలపడ్డాయి. ఎన్విడియా సాధించిన అద్భుత విజయాల వెనుక జెన్సన్ హువాంగ్ వ్యూహాత్మక ఆలోచనే కీలకమైనది కావడంతో, ఆయన తప్పుకుంటారనే ప్రచారం ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది.

బ్రోకరేజ్ సంస్థల డౌన్‌గ్రేడ్

సీఈఓ చుట్టూ అలుముకున్న ఈ వివాదాల ప్రభావం వాల్‌స్ట్రీట్ నిపుణుల అంచనాలపై గట్టిగానే పడింది. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ బెర్న్‌స్టెయిన్ ఎన్విడియా షేర్ రేటింగ్‌ను తగ్గించడంతో పాటు టార్గెట్ ధరను కూడా భారీగా కుదించింది. మోర్గాన్ స్టాన్లీ కూడా ఈ కంపెనీని తన టాప్ పిక్స్ జాబితా నుంచి తొలగించింది. హువాంగ్ లేకపోతే ఎన్విడియా భవిష్యత్తు ఎలా ఉంటుందనే అనిశ్చితి నెలకొనడంతో, పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లు తమ షేర్లను విక్రయించడానికి మొగ్గు చూపారు. ఇది షేర్ ధర పతనానికి మరింత వేగమిచ్చింది.

నవంబర్ 17న త్రైమాసిక ఫలితాలు

ఎన్విడియా కేవలం చిప్స్ తయారు చేసే కంపెనీ మాత్రమే కాదు, ప్రపంచంలోని మెజారిటీ ఏఐ కంపెనీలకు అవసరమైన మౌలిక వసతులను సమకూరుస్తున్న కీలక సంస్థ. అలాంటి కంపెనీలో నాయకత్వ మార్పు వస్తే అది మొత్తం ఏఐ సెక్టార్‌పై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో నవంబర్ 17, 2026 న రాబోతున్న త్రైమాసిక ఆర్థిక ఫలితాలపై అందరి చూపు నిలిచింది. కంపెనీ వ్యాపార వృద్ధి బలంగా ఉన్నప్పటికీ, ప్రస్తుత నాయకత్వ సంక్షోభం నుంచి సంస్థ ఎలా బయటపడుతుందనేది రాబోయే కాలంలో షేర్ల గమనాన్ని నిర్ణయించనుంది.

Tags: