Copper : సైలెంట్‌గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది..రాగి దెబ్బకు బెదిరిపోతున్న బంగారం

రాగి దెబ్బకు బెదిరిపోతున్న బంగారం

Update: 2026-01-31 08:31 GMT

Copper : సాధారణంగా మనవాళ్లకు పెట్టుబడి అనగానే గుర్తొచ్చేవి బంగారం, వెండి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. కేవలం పసిడి వైపే చూస్తే లాభాల వేటలో వెనుకబడిపోయే ప్రమాదం ఉందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో బంగారం, వెండిని మించి లాభాలను కురిపించే సత్తా ఉన్న రెడ్ మెటల్‎గా కాపర్ (రాగి) అవతరిస్తోంది. పారిశ్రామిక రంగంలో పెరుగుతున్న డిమాండ్, సరఫరాలో ఉన్న లోటు రాగిని అత్యంత వ్యూహాత్మక లోహంగా మార్చేశాయి.

ప్రస్తుతం బంగారం ధర తులం (10 గ్రాములు) రెండు లక్షలకు దగ్గరగా ఉండగా, వెండి కిలో రూ.4 లక్షలకు చేరుకుని రికార్డులు సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు వీటి ధరలకు రెక్కలు తెచ్చాయి. అయితే, ఇప్పటికే గరిష్ట స్థాయిలకు చేరుకున్న వీటి నుంచి భవిష్యత్తులో భారీ రిటర్న్స్ ఆశించడం కొంత కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే పెద్ద ఇన్వెస్టర్లు ఇప్పుడు కాపర్ వైపు మళ్లుతున్నారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థకు రాగి వెన్నెముకగా మారింది. కేవలం గృహోపకరణాలకే కాకుండా.. డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు ఇలా ప్రతి చోటా రాగి వినియోగం అనివార్యమైంది.

నేటి ప్రపంచాన్ని శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాలకు భారీ విద్యుత్ అవసరం. ఈ విద్యుత్ సరఫరాకు కావాల్సిన మౌలిక సదుపాయాల్లో రాగి పాత్ర అత్యంత కీలకం. ప్రతి కొత్త డేటా సెంటర్ ఏర్పాటుతో కాపర్ డిమాండ్ అమాంతం పెరుగుతోంది. ఇది కేవలం తాత్కాలికంగా కాకుండా, దీర్ఘకాలికంగా కొనసాగే డిమాండ్ కావడంతో రాగి ధరలు మున్ముందు కొత్త శిఖరాలను తాకుతాయని అంచనా వేస్తున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడం కూడా కాపర్ రేంజ్ ని మార్చేసింది. ఒక సాధారణ పెట్రోల్ కార్ కంటే ఈవీలో మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ రాగిని వాడతారు.

మరోవైపు డిమాండ్ పెరిగిన స్థాయిలో సరఫరా లేకపోవడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమవుతోంది. చిలీ, ఇండోనేషియా వంటి దేశాల్లో రాగి మైనింగ్‌కు పర్యావరణపరమైన అడ్డంకులు ఎదురవుతున్నాయి. కొత్త గనులను తవ్వడం కష్టంగా మారడం, పాత గనుల్లో నాణ్యత తగ్గడంతో మార్కెట్‌లో రాగి కొరత ఏర్పడింది. ఈ సరఫరా-డిమాండ్ మధ్య ఉన్న వ్యత్యాసం కాపర్ ను ఒక బలమైన పెట్టుబడి సాధనంగా మార్చింది. రాబోయే ఐదేళ్లలో గ్రీన్ ఎనర్జీ లక్ష్యాల దిశగా దేశాలు అడుగులు వేస్తుంటే, రాగి డిమాండ్ మరో 20 శాతం పెరిగే అవకాశం ఉంది.

భారతీయ ఇన్వెస్టర్లు కాపర్‌లో పెట్టుబడి పెట్టడానికి ప్రధానంగా రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది, స్టాక్ మార్కెట్ ద్వారా కాపర్ మైనింగ్ మరియు ఉత్పత్తి చేసే కంపెనీల షేర్లను కొనుగోలు చేయడం. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు వేదాంత, హిందాల్కో వంటి ప్రైవేట్ దిగ్గజాలు ఈ రంగంలో బలంగా ఉన్నాయి. రెండవది, ఎంసీఎక్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో కమోడిటీ ట్రేడింగ్ చేయడం. అయితే, నేరుగా ట్రేడింగ్ చేయడం కొంత రిస్క్ తో కూడుకున్నది కాబట్టి, దీర్ఘకాలిక లాభాల కోసం షేర్ మార్కెట్ మార్గాన్ని ఎంచుకోవడం సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News