Budget Day Stock Market : ఫిబ్రవరి 1న బడ్జెట్.. గత ఐదేళ్లలో సెన్సెక్స్, నిఫ్టీల రిపోర్ట్ కార్డ్ ఇదే
గత ఐదేళ్లలో సెన్సెక్స్, నిఫ్టీల రిపోర్ట్ కార్డ్ ఇదే
Budget Day Stock Market : ఫిబ్రవరి 1, 2026.. యావత్ భారత్ ఎదురుచూస్తున్న బడ్జెట్ డే వచ్చేస్తోంది. నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం మొదలుపెడితే, అటు స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్, నిఫ్టీలు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. బడ్జెట్ రోజున మార్కెట్ ఆకాశానికి వెళ్తుందా లేక పాతాళానికి పడిపోతుందా? అన్న టెన్షన్ ఇన్వెస్టర్లలో మొదలైంది. మరి గత ఐదేళ్ల చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, బడ్జెట్ రోజున మార్కెట్ తీరు ఎలా ఉందో తెలుసుకుందాం.
బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్ అనేది ఒక అంచనా వేయలేని జూదం లాంటిది. గత ఐదేళ్ల గణాంకాలను గమనిస్తే.. మార్కెట్ ఎప్పుడూ ఒకేలా స్పందించలేదు. 2025 బడ్జెట్ రోజున మార్కెట్ చాలా నిలకడగా ముగిసింది. ఆ రోజు సెన్సెక్స్ కేవలం 5 పాయింట్ల లాభంతో 77,505 వద్ద ముగియగా, నిఫ్టీ మాత్రం 26 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. అంతర్జాతీయ మార్కెట్లలోని ఒత్తిడి, బడ్జెట్ ప్రకటనలపై మిశ్రమ స్పందన రావడంతో మార్కెట్ పెద్దగా కదలికలు చూపలేదు. అయితే రైల్వే షేర్లు మాత్రం ఆ రోజు లాభాల్లో మెరిశాయి.
అంతకుముందు అంటే 2024 బడ్జెట్ ఇన్వెస్టర్లకు ఒక పీడకలలా మిగిలింది. ముఖ్యంగా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ప్రస్తావన రాగానే ఇన్వెస్టర్లు భయపడి భారీగా అమ్మకాలు మొదలుపెట్టారు. దీంతో సెన్సెక్స్ ఒక్కసారిగా 1200 పాయింట్లు కుప్పకూలింది. చివరికి కొంత కోలుకున్నప్పటికీ, 106 పాయింట్ల నష్టంతోనే సరిపెట్టుకుంది. నిఫ్టీ కూడా 28 పాయింట్లు నష్టపోయింది. 2023లో కూడా ఇదే పరిస్థితి.. మొదట 1200 పాయింట్ల లాభంతో 60 వేల మార్కును దాటిన సెన్సెక్స్, క్లోజింగ్ సమయానికి కేవలం 158 పాయింట్ల లాభానికే పరిమితమైంది.
2022 సంవత్సరం ఇన్వెస్టర్లకు కొంత ఊరటనిచ్చింది. బడ్జెట్ రోజున సెన్సెక్స్ ఏకంగా 848 పాయింట్లు పెరిగి 58,862 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 237 పాయింట్ల లాభంతో దూసుకుపోయింది. ఫార్మా, మెటల్, ఐటీ రంగాల్లో భారీగా కొనుగోళ్లు జరగడం మార్కెట్‌కు కలిసొచ్చింది. ఇక గత ఐదేళ్లలో అత్యుత్తమ బడ్జెట్ డే అంటే 2021 అనే చెప్పాలి. కరోనా సంక్షోభం తర్వాత వచ్చిన ఆ బడ్జెట్ రోజున సెన్సెక్స్ ఏకంగా 2,314 పాయింట్లు (5 శాతం) ఎగబాకింది. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన రోజది.
మొత్తానికి బడ్జెట్ రోజున మార్కెట్ తీరు అనేది ఆర్థిక మంత్రి చేసే కీలక ప్రకటనలు, పన్ను మార్పులపైనే ఆధారపడి ఉంటుంది. ఈసారి 2026 బడ్జెట్‌లో కూడా ఆదాయపు పన్ను రాయితీలు, మౌలిక సదుపాయాలకు కేటాయింపులు వంటి అంశాలపై మార్కెట్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బడ్జెట్ ప్రసంగం సమయంలో ఒడుదొడుకులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, చిన్న ఇన్వెస్టర్లు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి.