Illegal Betting : ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్లపై సర్కార్ మెరుపు దాడి.. 300 యాప్‌లు, వెబ్‌సైట్లు క్లోజ్

300 యాప్‌లు, వెబ్‌సైట్లు క్లోజ్

Update: 2026-03-21 09:23 GMT

Illegal Betting : దేశంలో అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, జూదానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ సామాన్యులను మోసగిస్తున్న సుమారు 300 వెబ్‌సైట్లు, మొబైల్ అప్లికేషన్లను తాజాగా బ్లాక్ చేసింది. ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే ఈ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో పెరుగుతున్న అవకతవకలను అరికట్టడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఈసారి కేవలం బెట్టింగ్ యాప్‌లే కాకుండా డిజిటల్ క్యాసినోలు, పీర్-టు-పీర్ బెట్టింగ్ సైట్లు, ఆన్‌లైన్ స్పోర్ట్స్ బెట్టింగ్ పోర్టల్స్‌పై కూడా చర్యలు తీసుకున్నారు. వీటిలో స్లాట్ మెషీన్లు, రూలెట్, లైవ్ డీలర్ వంటి ఆటల పేరుతో ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే పాతకాలపు సత్తా-మట్కా నెట్‌వర్క్‌ను ఆన్‌లైన్‌లో నడుపుతున్న గ్రూపులను మరియు రియల్ మనీ గేమింగ్ యాప్‌లను కూడా బ్లాక్ చేసిన జాబితాలో చేర్చారు.

8,400 సైట్లు క్లోజ్.. సర్కార్ దూకుడు

ఆన్‌లైన్ జూదానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న యుద్ధం ఇప్పుడే మొదలైంది కాదు. తాజా నివేదికల ప్రకారం..ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 8,400 అక్రమ వెబ్‌సైట్లు, యాప్‌లను ప్రభుత్వం బ్లాక్ చేసింది. ఇందులో దాదాపు 4,900 ప్లాట్‌ఫారమ్‌లను ఆన్‌లైన్ గేమింగ్ కొత్త చట్టాలు అమలులోకి వచ్చిన తర్వాతే తొలగించారు. ఐటీ చట్టం సెక్షన్ 69ఏ కింద ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. విదేశాల నుంచి ఆపరేట్ అవుతున్న యాప్‌లపై కూడా ప్రత్యేక నిఘా ఉంచారు.

ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది?

ఆన్‌లైన్ బెట్టింగ్, జూదం వల్ల సామాన్య ప్రజలు, ముఖ్యంగా యువత ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. అనేక సందర్భాల్లో సామాన్యుల డేటా చోరీకి గురికావడమే కాకుండా, పెద్ద ఎత్తున మోసాలు కూడా బయటపడ్డాయి. జూదం వ్యసనంగా మారి ఆత్మహత్యలకు దారితీస్తున్న ఉదంతాలు కూడా పెరిగాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY), ఈ అక్రమ సైట్లకు చరమగీతం పాడాలని నిర్ణయించుకుంది.

ముందు ముందు మరిన్ని చర్యలు

అక్రమ ఆన్‌లైన్ కార్యకలాపాలపై తమ పోరాటం ఇక్కడితో ఆగదని ప్రభుత్వం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ఐపీఎల్ వంటి మెగా ఈవెంట్ల సమయంలో బెట్టింగ్ ముఠాలు యాక్టివ్ అవుతాయని, కాబట్టి నిరంతరం నిఘా కొనసాగుతుందని తెలిపింది. నిబంధనలను ఉల్లంఘించే ప్లాట్‌ఫారమ్‌లపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో పారదర్శకత, భద్రత పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ప్రజలు కూడా ఇలాంటి అక్రమ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Tags:    

Similar News