OTT Ban : స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ డిజిటల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో వినోదాన్ని పొందుతున్నారు. అయితే కొందరు వ్యూస్, సబ్‌స్క్రిప్షన్ల కోసం సామాజిక విలువలకు తిలోదకాలు ఇస్తూ అశ్లీలత, అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నారు. ఈ రకమైన విచ్చలవిడితనంపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని అత్యంత కఠినతరం చేసింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ ఇటీవల లోక్‌సభలో డిజిటల్ కంటెంట్‌ను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరంగా వెల్లడించారు.

రెండు సంవత్సరాల్లో 50 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు బ్లాక్

డిజిటల్ మీడియాను సురక్షితంగా మార్చే క్రమంలో భాగంగా ప్రభుత్వం గత రెండేళ్ల వ్యవధిలో ఏకంగా 50 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను భారతదేశంలో పూర్తిగా నిషేధించింది. ఐటీ రూల్స్ 2021, బిఎన్ఎస్ సెక్షన్ 294, మహిళల అసభ్యకర వర్ణన నిషేధ చట్టం 1986 కింద ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. నియమ నిబంధనలను పక్కనబెట్టి అశ్లీలతను విక్రయించే ప్లాట్‌ఫామ్‌లకు ఇకపై డిజిటల్ ప్రపంచంలో చోటు లేదని ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.

వినియోగదారుల ఫిర్యాదుల కోసం 3-అంచెల వ్యవస్థ

డిజిటల్ న్యూస్ లేదా వెబ్ సిరీస్‌లలో అశ్లీల కంటెంట్ ఉన్నప్పుడు సాధారణ ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక గందరగోళానికి గురవుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత పటిష్టమైన 3-అంచెల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.

* మొదటి అంచె: వినియోగదారుడు నేరుగా కంటెంట్ ప్రసారం చేసిన పబ్లిషర్‌కే ఫిర్యాదు చేయవచ్చు.

* రెండవ అంచె: అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే, పబ్లిషర్ల స్వయం నియంత్రణ మండలి ఈ అంశాన్ని పరిశీలిస్తుంది.

* మూడవ అంచె: మొదటి రెండు దశల్లో న్యాయం జరగకపోతే, కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ వ్యవస్థ నేరుగా జోక్యం చేసుకుని చర్యలు తీసుకుంటుంది.

ఫేక్ న్యూస్ అరికట్టడానికి ఫాక్ట్ చెక్ యూనిట్

సోషల్ మీడియా యుగంలో తప్పుడు సమాచారం, నకిలీ వార్తలు చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిర్ణయాల గురించి వచ్చే భ్రాంతి కలిగించే వార్తలు సామాన్యులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. దీనిని అరికట్టడానికి ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ యూనిట్‎ను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక విభాగానికి సంబంధించిన బృందం ప్రభుత్వ శాఖల సహాయంతో ఏ వార్త నిజమో, ఏది అబద్ధమో విశ్లేషించి, సరైన సమాచారాన్ని అధికారిక మీడియా వేదికల ద్వారా ప్రజలకు అందిస్తుంది.

స్వేచ్ఛతో పాటు బాధ్యత కూడా ముఖ్యం

ఈ కొత్త నిబంధనల వెనుక ఎవరి వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించాలనే ఆలోచన లేదని, కేవలం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందించడమే తమ లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐటీ నిబంధనలు 2021 కింద డిజిటల్ న్యూస్, ఓటీటీ పబ్లిషర్ల కోసం ప్రత్యేక ప్రవర్తనా నియమావళిని రూపొందించారు. దీని ద్వారా పౌరులు తమ భావప్రకటనా స్వేచ్ఛను ఉపయోగించుకుంటూనే, దేశ చట్టాలను గౌరవించేలా చర్యలు తీసుకుంటున్నారు.

Tags: