UPI: యూపీఐ పేమెంట్స్‌పై ఛార్జీల మోత? డెబిట్, క్రెడిట్ కార్డులతో పోలిస్తే ఇదే చాలా చీప్
ఇదే చాలా చీప్
UPI: భారతదేశంలో డిజిటల్ పేమెంట్లను విపరీతంగా మార్చేసిన యూపీఐ సేవలకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొన్ని కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. వచ్చే అక్టోబర్ 15 నుంచి దేశవ్యాప్తంగా నిర్దిష్టమైన యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ అనగా ప్రాసెసింగ్ ఛార్జీలు వర్తించనున్నాయి. ముఖ్యంగా రూ.2,000 కంటే ఎక్కువ మొత్తంలో జరిగే కొన్ని నిర్దిష్ట లావాదేవీలపై 0.4 శాతం వరకు ఛార్జ్ విధించనున్నారు. అయితే ఈ వార్త బయటకు రాగానే, సామాన్య ప్రజలు ఇకపై ఫోన్‌పే, గూగుల్ పే లేదా పేటీఎం వంటి యాప్స్ ద్వారా డబ్బులు పంపితే మన ఖాతా నుంచి అదనంగా డబ్బులు కట్ అవుతాయా అనే ఆందోళన చెందుతున్నారు.
కస్టమర్లపై ఎలాంటి భారం ఉండదు
ప్రజలందరిలో ఉన్న ఈ అనుమానాలను నివృత్తి చేస్తూ ఎన్‌పీసీఐ స్పష్టత ఇచ్చింది. ఈ కొత్త ఛార్జీల వల్ల సాధారణ యూజర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. యూపీఐ ద్వారా పేమెంట్ చేసే కస్టమర్లు ఎలాంటి ఎక్స్ట్రా అమౌంట్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ఛార్జీలన్నీ పూర్తిగా వ్యాపారులు లేదా మర్చంట్లకే వర్తిస్తాయి. అంతేకాకుండా రోజువారీ జరిగే లావాదేవీలలో సుమారు 96 శాతం వరకు ఉన్న రూ.2,000 లోపు లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలు ఉండవు. కాబట్టి సామాన్య ప్రజలు ఎటువంటి అదనపు రుసుములు చెల్లించకుండా యథావిధిగా తమ ఫోన్‌పే, పేటీఎం యాప్‌ల ద్వారా ఉచితంగా లావాదేవీలు చేసుకోవచ్చు.
చిన్న వ్యాపారులకు మినహాయింపు
వీధి వ్యాపారాలు, చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి, చిరు వ్యాపారులకు ఈ కొత్త నిబంధనల నుంచి పూర్తి మినహాయింపు లభించింది. పర్సన్-టు-పర్సన్-మర్చంట్ కేటగిరీ కింద క్యూఆర్ కోడ్ ద్వారా నెలకు రూ.లక్ష వరకు లావాదేవీలు పొందే చిన్న దుకాణదారుల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు. అంటే మన ఇంటి పక్కన ఉండే కిరాణా కొట్లు, కూరగాయల వ్యాపారులు ఈ కొత్త ఛార్జీల పరిధిలోకి రారు. వారు గతంలో మాదిరిగానే ఎటువంటి అదనపు భారం లేకుండా యూపీఐ పేమెంట్లను స్వీకరించవచ్చు.
డెబిట్, క్రెడిట్ కార్డుల కంటే యూపీఐ ఎంత చౌకైనది?
సాధారణ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా జరిగే పేమెంట్లతో పోలిస్తే యూపీఐ లావాదేవీలు సుమారు 80 శాతం వరకు చౌకైనవని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. సాధారణంగా కార్డులతో జరిగే లావాదేవీలపై 0.90 శాతం నుంచి 2 శాతం వరకు మర్చంట్ ఛార్జీలు పడుతుంటాయి. కానీ యూపీఐలో గరిష్ట ఛార్జ్ కేవలం 0.4 శాతం మాత్రమే ఉండటంతో పాటు, గరిష్ట పరిమితిని రూ.300 లుగా మాత్రమే నిర్ణయించారు. అంతేకాకుండా రైల్వే, టెలికాం, ఫ్యూయల్ వంటి అత్యవసర సేవలకు కేవలం రూ.5 ఫ్లాట్ ఛార్జ్ మాత్రమే ఉంటుంది. దీనివల్ల వ్యాపారులకు కూడా ఆర్థిక భారం చాలా వరకు తగ్గుతుంది.