Credit Card : మినిమం డ్యూ కడుతున్నారా? అయితే మీరు అప్పుల ఊబిలో పడ్డట్టే.. అసలు నిజాలు ఇవే
అయితే మీరు అప్పుల ఊబిలో పడ్డట్టే.. అసలు నిజాలు ఇవే
Credit Card : నేటి కాలంలో జేబులో పైసా లేకపోయినా చేతిలో ఒక ప్లాస్టిక్ కార్డు ఉంటే చాలు.. ప్రపంచాన్ని చుట్టేయొచ్చు. డెబిట్ కార్డుతో సమానంగా ఇప్పుడు ప్రతి ఒక్కరి వాలెట్‌లో క్రెడిట్ కార్డు చేరిపోయింది. అయితే, వాడటం వరకు బాగానే ఉన్నా.. నెల తిరిగేసరికి బిల్లు వచ్చేసరికి చాలామందిలో ఒకటే టెన్షన్. స్టేట్‌మెంట్ రాగానే వెంటనే కట్టేయాలా? లేక ఆఖరి తేదీ వరకు ఆగాలా? అనే సందేహం అందరినీ వేధిస్తుంది. దీనివల్ల మన సిబిల్ స్కోరుకు ఏమైనా ముప్పు ఉంటుందా అనే భయం కూడా ఉంటుంది.
ఎప్పుడు కడితే బెస్ట్? వెంటనేనా.. లేక డ్యూ డేట్ రోజా?
మీ ఈమెయిల్‌కు లేదా ఫోన్‌కు స్టేట్‌మెంట్ వచ్చిన వెంటనే బిల్లు కట్టేయాల్సిన అవసరం లేదు. మీ క్రెడిట్ స్కోరుకు మీరు స్టేట్‌మెంట్ వచ్చిన వెంటనే కట్టారా లేదా గ్రేస్ పీరియడ్‌ను వాడుకుని ఆఖరి రోజున కట్టారా అనే దాంతో సంబంధం ఉండదు. బ్యాంకు నిర్దేశించిన సమయానికి అంటే డ్యూ డేట్ లోపు మీరు ఒక్క రూపాయి కూడా బాకీ లేకుండా కడితే మీ ఆర్థిక రికార్డు సురక్షితంగా ఉంటుంది. కాబట్టి మీ దగ్గర నగదు లభ్యతను బట్టి ఆఖరి తేదీ వరకు వేచి చూడటంలో తప్పు లేదు.
డ్యూ డేట్ దాటితే మాత్రం కొంప మునిగినట్టే
ఆఖరి తేదీ వరకు వేచి చూడటం తప్పు కాదు కానీ, ఒక్కసారి ఆ తేదీ దాటిన తర్వాత కడితే మాత్రం అది మీ క్రెడిట్ హిస్టరీపై మాయని మచ్చలా మిగిలిపోతుంది. దీనినే లేట్ పేమెంట్ అంటారు. ఇలా ఒక్కసారి జరిగినా మీ సిబిల్ స్కోరు పడిపోతుంది. భవిష్యత్తులో మీరు హోమ్ లోన్, కార్ లోన్ లేదా పర్సనల్ లోన్ కోసం బ్యాంకుకు వెళ్లినప్పుడు ఈ పాత తప్పు అడ్డు పడుతుంది. అందుకే, ఏదైనా మర్చిపోతామనే భయం ఉంటే ఆటో-డెబిట్ ఆప్షన్ పెట్టుకోవడం లేదా డ్యూ డేట్ కంటే ఒక రెండు రోజుల ముందే బిల్లు కట్టడం ఉత్తమం.
మినిమం డ్యూ..అదొక స్పీట్ పాయిజన్
మీ స్టేట్‌మెంట్‌లో రెండు రకాల మొత్తాలు కనిపిస్తాయి. ఒకటి టోటల్ అవుట్‌స్టాండింగ్ (మొత్తం బిల్లు), రెండోది మినిమం డ్యూ (కనీస మొత్తం). చాలామంది మినిమం డ్యూ కడితే చాలు పెనాల్టీ పడదు అని భ్రమపడుతుంటారు. కానీ ఇది ఆర్థికంగా పెద్ద ఉచ్చు. కనీస మొత్తం కడితే కేవలం లేట్ ఫీజు పడదు కానీ, మిగిలిన బ్యాలెన్స్ మీద బ్యాంకులు భారీ వడ్డీని (ఏడాదికి దాదాపు 40% వరకు) వసూలు చేస్తాయి. ఇది మిమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి బిల్లునే చెల్లించండి.
స్కోరు పెరగాలంటే 30 శాతం రూల్ గుర్తుంచుకోండి
మంచి క్రెడిట్ స్కోరు కావాలంటే మీ కార్డు లిమిట్‌లో కేవలం 30 శాతం మాత్రమే ఖర్చు చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు మీ లిమిట్ రూ.లక్ష అయితే, కేవలం రూ.30 వేల లోపు వాడితే బ్యాంకులు మిమ్మల్ని బాధ్యతాయుతమైన కస్టమర్‌గా గుర్తిస్తాయి. అలాగే, క్రెడిట్ కార్డు ఉంది కదా అని ప్రతిదానికీ దానిపైనే ఆధారపడకండి. ఆరు నెలల ఖర్చులకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ మీ బ్యాంకు ఖాతాలో ఉండేలా ప్లాన్ చేసుకోవడం అసలైన తెలివితేటలు.