Credit Card: క్రెడిట్ కార్డ్ వాడకం సులువుగానే అనిపిస్తుంది. ప్రతి నెల కేవలం మినిమం డ్యూ మాత్రమే చెల్లిస్తూ ఉంటే మాత్రం ఊహించని వడ్డీల ఊబిలో కూరుకుపోక తప్పదు. ఈ తరహా పొరపాట్ల వల్ల అప్పుల భారం పెరిగిపోకుండా త్వరగా బయటపడేందుకు 7 మార్గాలను తెలుసుకుందాం. చాలామంది క్రెడిట్ కార్డ్ వినియోగదారులు బిల్లు వచ్చినప్పుడు మొత్తం బకాయిలు చెల్లించకుండా కేవలం మినిమం అమౌంట్ డ్యూ మాత్రమే కడుతుంటారు. మిగిలిన బాకీపై బ్యాంకులు విధించే చక్రవడ్డీలు కాలానుగుణంగా కొండలా పేరుకుపోతాయి. సర్వేల ప్రకారం 41 శాతం మంది కార్డ్ హోల్డర్లు మినిమం డ్యూ చెల్లించే అలవాటుతో తీవ్రమైన రుణభారంలో పడుతున్నారు. యువతలో ఈ సంఖ్య 58 శాతానికి పైగా ఉండటం తీవ్రంగా ఆందోళన కలిగిస్తోంది. 20 శాతం వడ్డీ రేటు వద్ద బాకీలు తీర్చడానికి ఏకంగా 27 ఏళ్ల సమయం పడుతుందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

స్మార్ట్ చెల్లింపులు, ఈఎంఐ మార్గాలు

క్రెడిట్ కార్డ్ బాకీల నుంచి వేగంగా బయటపడటానికి 7 మార్గాలు ఉన్నాయి:

* కనీస చెల్లింపు కంటే ఎక్కువ కట్టడం: కేవలం మినిమం డ్యూ చెల్లించకుండా మీ వద్ద ఉన్న పొదుపు నుంచి వీలైనంత ఎక్కువ మొత్తాన్ని ప్రతి నెల బాకీ కింద చెల్లించాలి. దీనివల్ల అసలు వేగంగా తగ్గి వడ్డీ భారం తగ్గుతుంది.

* రుణాన్ని ఈఎంఐగా మార్చుకోవడం: ఒకవేళ బాకీ మొత్తం చాలా ఎక్కువగా ఉంటే, దానిని తక్కువ వడ్డీకే నెలవారీ ఈఎంఐలుగా మార్చమని బ్యాంకును కోరవచ్చు. లేదా తక్కువ వడ్డీకి వ్యక్తిగత రుణం తీసుకుని కార్డ్ బిల్లును ఒకేసారి చెల్లించడం మంచిది.

* ఆటోమేటిక్ పేమెంట్ సదుపాయం: బిల్లు చెల్లింపు తేదీలు మరిచిపోయి ఆలస్య రుసుములు పడకుండా ఉండేందుకు ఆటో డెబిట్ ఆప్షన్ ఎంచుకోవాలి.

* స్నోబాల్ పద్ధతి: మీ దగ్గర అనేక క్రెడిట్ కార్డ్ అప్పులు ఉంటే, ముందుగా అతి చిన్న బాకీని పూర్తిగా తీర్చేయాలి. ఆ తర్వాత దానికంటే పెద్ద బాకీపై దృష్టి పెట్టాలి. చిన్న అప్పులు తీరడం వల్ల మానసిక ప్రశాంతత, నమ్మకం పెరుగుతాయి.

* అవలాంచ్ పద్ధతి: అన్ని కార్డులకు కనీస చెల్లింపులు చేస్తూనే, అత్యధిక వడ్డీ రేటు ఉన్న కార్డ్ అప్పుకు ఎక్కువ మొత్తం చెల్లించాలి. భారీ వడ్డీల భారాన్ని తగ్గించుకోవడానికి ఇది సరైన మార్గం.

* అనవసర ఖర్చులపై నియంత్రణ: ఆదాయం, ఖర్చుల మధ్య సమతుల్యత ఉండేలా బడ్జెట్ రూపొందించుకోవాలి. అనవసర కొనుగోళ్లకు స్వస్తి చెప్పినప్పుడే కొత్తగా అప్పులు కాకుండా నిరోధించవచ్చు.

* నగదు వాడకం పెంచడం: రోజూవారి ఖర్చులకు, బిల్లులకు క్రెడిట్ కార్డుల స్థానంలో చేతిలో ఉన్న నగదు లేదా డెబిట్ కార్డ్ వాడటం అలవాటు చేసుకోవాలి. ఇది మిమ్మల్ని అవసరానికి మించి ఖర్చు చేయకుండా అడ్డుకుంటుంది.

Tags: