Credit Card : స్నేహితుడికి క్రెడిట్ కార్డ్ ఇస్తున్నారా?..ఐటీ నోటీసు వస్తే ఆస్తి అమ్ముకోవాల్సిందే
ఐటీ నోటీసు వస్తే ఆస్తి అమ్ముకోవాల్సిందే
Credit Card : ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు, రివార్డ్ పాయింట్ల కోసం చాలామంది తమ కార్డులను స్నేహితులకు, బంధువులకు ఇస్తుంటారు. వారు కొన్న వస్తువులకి మీ కార్డుతో పేమెంట్ చేసి, వారి దగ్గర నుంచి నగదు తీసుకుంటుంటారు. కానీ ఇలా చేయడం వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉందని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిస్తోంది. స్నేహానికి పోయి కార్డు ఇస్తే, ఐటీ నోటీసులతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
రూ. 50 లక్షల ఖర్చు.. షాకింగ్ ఐటీ నోటీస్
ఇటీవల ఒక వ్యక్తి తన క్రెడిట్ కార్డ్ ద్వారా ఏడాదిలో రూ.50 లక్షలకు పైగా ఖర్చు చేశాడు. విచిత్రమేమిటంటే.. ఆ వ్యక్తి అసలు ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయలేదు. దీంతో ఆదాయపు పన్ను శాఖ అతనికి నోటీసులు పంపింది. తీరా ఆరా తీస్తే.. అతను ఆ ఖర్చంతా తన స్నేహితుల కోసం చేశాడని, కేవలం రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్ కోసం తన కార్డును వాడాడని తేలింది. కానీ ఐటీ శాఖ మాత్రం ఆ ఖర్చును అతని సొంత ఆదాయంగానే పరిగణించి, దానికి తగిన మూలాధారాలు చూపకపోవడంతో భారీ డిమాండ్ నోటీసు జారీ చేసింది.
ఐటీ శాఖకు మీ ఖర్చు ఎలా తెలుస్తుంది?
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 285BA ప్రకారం.. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తి ఏడాదిలో రూ.10 లక్షలకు మించి చేసే పెద్ద లావాదేవీల వివరాలను ఐటీ శాఖకు అందించాలి. మీరు మీ కార్డుతో స్నేహితుడికి లక్ష రూపాయల ఫోన్ కొనిపెట్టినా, ఆ ఖర్చు మీ పాన్ కార్డుకే లింక్ అవుతుంది. మీరు ఆ డబ్బును స్నేహితుడి దగ్గర నుంచి నగదు రూపంలో తీసుకుంటే, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో నిరూపించడం మీకు కష్టమవుతుంది. మీ ఆదాయానికి, మీరు చేసే ఖర్చుకు పొంతన లేకపోతే ఐటీ శాఖ సెక్షన్ 69C కింద చర్యలు తీసుకుంటుంది. దీని ప్రకారం.. లెక్క చూపని ఖర్చును మీ ఆదాయంగా భావించి భారీగా పన్ను విధిస్తారు.
స్నేహితులకు పేమెంట్ చేస్తే వచ్చే రిస్కులు ఇవే
చాలామంది రివార్డ్ పాయింట్ల కోసం కార్డ్ రొటేషన్ చేస్తుంటారు. ఏడాదికి రూ.50,000 మించిన క్యాష్‌బ్యాక్ లేదా రివార్డులు పొందితే అవి కూడా పన్ను పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీ స్నేహితుడు మీకు నగదు కాకుండా బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ చేసినా.. ఆ మొత్తాన్ని కుటుంబ సభ్యులు కాని వారి నుంచి తీసుకున్న గిఫ్ట్‌గా ఐటీ శాఖ పరిగణించవచ్చు. రూ.50,000 దాటిన బహుమతులపై పన్ను కట్టాల్సి ఉంటుంది. అందుకే స్నేహితుల కోసం పేమెంట్ చేసేటప్పుడు స్నేహితుడి పేరు మీద ఉన్న బిల్లు, అతను మీకు డబ్బు పంపిన బ్యాంక్ స్టేట్‌మెంట్ వంటి ఆధారాలను భద్రపరుచుకోవడం చాలా ముఖ్యం. లేదంటే ఆ నోటీసుల నుంచి తప్పించుకోవడం అసాధ్యం.