Crude Oil : అంతర్జాతీయంగా తగ్గిన క్రూడాయిల్ ధరలు.. రాకెట్‌లా దూసుకెళ్లిన ప్రభుత్వ ఆయిల్ షేర్లు!
రాకెట్‌లా దూసుకెళ్లిన ప్రభుత్వ ఆయిల్ షేర్లు!
Crude Oil : అంతర్జాతీయ మార్కెట్లో గత కొన్ని వారాలుగా ఆకాశమే హద్దుగా మండిపోతున్న ముడిచమురు ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. సోమవారం నాడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా 5 శాతానికి పైగా పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత కీలకమైన బ్రెంట్ క్రూడ్ ధర సుమారు 5.4 శాతం తగ్గి, సైకలాజికల్ లెవెల్ అయిన 100 డాలర్ల మార్క్ కంటే కిందకు అంటే 97.92 డాలర్ల వద్దకు చేరింది. అలాగే అమెరికన్ డబ్ల్యూటీఐ క్రూడ్ కూడా 5.7 శాతం తగ్గి 91.14 డాలర్లకు పడిపోయింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు ఇలా తగ్గడం, ఇటు దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడంతో భారతీయ ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీల షేర్లు సోమవారం మార్కెట్లో పండగ చేసుకున్నాయి.
అమెరికా - ఇరాన్ శాంతి చర్చల ఎఫెక్ట్
గత మూడు నెలలుగా అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణం, అలాగే అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ సముద్ర మార్గాన్ని ఇరాన్ బ్లాక్ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా నిలిచిపోతుందనే భయాలు రేగాయి. దీనివల్ల ఫిబ్రవరి చివరి వారం నుండి ముడిచమురు ధరలు ఏకంగా 50 శాతానికి పైగా పెరిగి రికార్డులు సృష్టించాయి. అయితే, తాజాగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధానికి ముగింపు పలికేలా ఒక శాంతి ఒప్పందం దాదాపు ఖరారైందన్న సానుకూల వార్తలు రావడంతో అంతర్జాతీయ మార్కెట్ శాంతించింది. ఈ ఒప్పందంతో స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మార్గం గుండా మళ్లీ చమురు నౌకల రాకపోకలు ప్రారంభం కానున్నాయనే ఆశలతో క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి.
రాకెట్‌లా దూసుకెళ్లిన HPCL, BPCL, IOC షేర్లు
ముడిచమురు ధరలు తగ్గడం వల్ల ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల లాభాల మార్జిన్లు భారీగా పెరుగుతాయని ఇన్వెస్టర్లు అంచనా వేశారు. దీంతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో సోమవారం ఉదయం నుంచే ఆయిల్ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. ఫలితంగా, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) షేరు ఏకంగా 5.86 శాతం లాభపడి రూ.412.55 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) షేరు 4.55 శాతం పెరిగి రూ.309 వద్ద ట్రేడవగా, దేశంలోనే అతిపెద్ద ఆయిల్ కంపెనీ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) షేరు సైతం 4.15 శాతం లాభంతో రూ.145.30 వద్ద ముగిసింది.
రెండు వారాల్లో నాలుగు సార్లు పెరిగిన బాదుడు
ఆయిల్ కంపెనీల షేర్లు ఇంతలా లాభపడటానికి మరో ముఖ్య కారణం దేశీయంగా ఇంధన ధరల పెంపుదల. సోమవారం రోజున పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.2.61 నుంచి రూ.2.71 వరకు పెంచారు. గడచిన రెండు వారాల్లోనే ఇలా ధరలను పెంచడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. మే 15వ తేదీ నుండి ఇప్పటివరకు చూసుకుంటే కేవలం పది రోజుల్లోనే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు సుమారు రూ.7.50 వరకు పెరిగాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ, దేశీయంగా రేట్లు పెంచడం వల్ల సామాన్యులపై రవాణా భారం పడి, ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
దేశీయ ఇంధన మార్కెట్లో ఈ మూడు కంపెనీలదే హవా
భారతదేశ ఇంధన మార్కెట్ విషయానికి వస్తే.. ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలదే పూర్తి ఆధిపత్యం. దేశంలోని దాదాపు 90 శాతం పెట్రోల్, డీజిల్ రిటైల్ మార్కెట్‌ను ఈ మూడు కంపెనీలే నియంత్రిస్తున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు తగ్గడం, దేశీయంగా పెంచిన ధరల వల్ల ఈ కంపెనీల మార్జిన్లు మునుపటి కంటే చాలా మెరుగవుతాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్ నుంచి ఇలాంటి మరికొన్ని సానుకూల వార్తలు వస్తే క్రూడాయిల్ ధరలు మరింత తగ్గే ఛాన్స్ ఉందని, ఇది ఆయిల్ కంపెనీల షేర్లకు మరింత బూస్ట్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు.