Customs Rules: విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరిగి వస్తున్న సమయంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఊహించని షాక్ తగిలింది. పారిస్ నుంచి వస్తున్న సమయంలో ఆయన వద్ద ఉన్న లగ్జరీ వస్తువులకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయకుండా గ్రీన్ ఛానల్ గుండా వెళ్తుండగా కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. నిబంధనల ప్రకారం అనుమతికి మించి ఖరీదైన బ్రాండెడ్ బట్టలు, బూట్లు అలాగే ఇతర విలువైన వస్తువులు ఉండటంతో అధికారులు ఆయనపై రూ.50వేల జరిమానా విధించారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా కస్టమ్స్ నిబంధనలపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

కొత్త బ్యారేజ్ నిబంధనలు

భారత ప్రభుత్వం విదేశీ ప్రయాణికుల కోసం సవరించిన కొత్త బ్యారేజ్ నిబంధనలను అమలు చేస్తోంది. దీని ప్రకారం ఏ దేశం నుంచైనా భారత్‌కు వచ్చే పౌరులు తమతో పాటు 75,000 రూపాయల విలువైన కొత్త వస్తువులను ఎలాంటి పన్ను చెల్లించకుండా తీసుకురావచ్చు. గతంలో ఈ పరిమితి కేవలం రూ.50 వేలుగా ఉండేది. అయితే ఈ మినహాయింపు పరిమితిని దాటిన ఏ వస్తువునైనా ప్రయాణికులు విమానాశ్రయంలోని రెడ్ ఛానల్ ద్వారా అధికారులకు ముందే తెలపాలి. ఆపై అదనపు విలువపై దాదాపు 38.5 శాతం వరకు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది.

గ్రీన్ ఛానల్ వర్సెస్ రెడ్ ఛానల్ తేడా ఏమిటి?

అంతర్జాతీయ విమానాశ్రయాలలో ప్రయాణికుల రాకపోకల కోసం రెండు మార్గాలను ఏర్పాటు చేశారు. పన్ను చెల్లించాల్సిన విలువైన వస్తువులు లేదా పరిమితికి మించి నగదు, బంగారం లేనివారు మాత్రమే గ్రీన్ ఛానల్ గుండా వెళ్లాలి. ఒకవేళ ఎవరి దగ్గరైనా ట్యాక్స్ పడే సామాను ఉంటే వారు తప్పనిసరిగా రెడ్ ఛానల్‌ను ఎంచుకోవాలి. నిబంధనలను దాచిపెట్టి గ్రీన్ ఛానల్ ద్వారా బయటపడాలని చూస్తే అది స్మగ్లింగ్ కిందకు వస్తుంది. అలాంటి సందర్భాలలో ట్యాగ్‌తో పాటు చట్టపరమైన భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

డిజిటల్ ప్రకటన, అతిథి యాప్ వినియోగం

ప్రయాణికులు విమానాశ్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం అతిథి యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. విదేశాల నుంచి బయలుదేరే ముందే ఈ యాప్ లేదా పోర్టల్ ద్వారా తమ వద్ద ఉన్న సామాగ్రి వివరాలను డిజిటల్ రూపంలో తెలియజేయవచ్చు. దీనివల్ల ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీల సమయంలో ఎలాంటి అనూహ్య జరిమానాలు లేదా ఇబ్బందులు తలెత్తకుండా సులభంగా బయటపడవచ్చు.

Tags: