Airfare Hike: విమాన ప్రయాణికులకు భారీ షాక్.. పండుగ వేళ 68 శాతానికి పెరిగిన ఫ్లైట్ టికెట్ ధరలు
పెరిగిన ఫ్లైట్ టికెట్ ధరలు
Airfare Hike: భారతదేశంలో పండుగ సీజన్ సమీపిస్తున్న తరుణంలో విమాన ప్రయాణికులకు తీవ్ర నిరాశ ఎదురుకావాల్సి వస్తోంది. దేశవ్యాప్తంగా విమాన టికెట్ల ధరలు భారీగా పెరిగిపోయాయి. వివిధ ప్రధాన రూట్లలో ప్రయాణించే విమాన ఛార్జీలు ఏకంగా యాభై శాతానికి పైగా ఎగబాకాయి. ముఖ్యంగా దివాళీ పండుగ ముగిసిన తర్వాత కూడా విమాన టికెట్ల ధరలు సాధారణ స్థాయికి తగ్గే సూచనలు కనిపించడం లేదని రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ నివేదిక స్పష్టం చేసింది. ప్రయాణికుల రద్దడి కాస్త తగ్గినా నిర్వహణ ఖర్చులు అధికంగా ఉండటం వల్ల ఛార్జీల మోత అలాగే కొనసాగే అవకాశం ఉంది.
వివిధ రూట్లలో భారీగా పెరిగిన విమాన ఛార్జీలు
సెప్టెంబర్ ఒకటి నుంచి నవంబర్ పది మధ్య కాలంలో జరిగిన విమాన ప్రయాణాల సగటు ఒకవైపు ఛార్జీలను పరిశీలిస్తే గత సంవత్సరంతో పోలిస్తే భారీ పెరుగుదల కనిపిస్తోంది. ప్రముఖ నగరాల మధ్య నడిచే విమాన సర్వీసులపై ఈ భారం స్పష్టంగా పడింది. ఉదాహరణకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లే రూట్లో విమాన టికెట్ ధర ఏకంగా 68 శాతం మేర పెరిగింది. అలాగే ముంబై నుంచి కోల్‌కతా వెళ్లే మార్గంలో 51 శాతం, ఢిల్లీ నుంచి గోవా వెళ్లే దారిలో 39 శాతం, ముంబై నుంచి బెంగళూరు మార్గంలో 37 శాతం చొప్పున ధరలు పెరిగినట్లు స్పష్టమైంది.
విమాన టికెట్లు పెరగడానికి అసలు కారణాలు
విమాన ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరగడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని నిపుణులు వివరిస్తున్నారు. మొదటిది ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు అసాధారణంగా పెరగడం. అక్టోబర్ నెలలో దేశీయ విమాన ఇంధన ధర గత ఏడాదితో పోలిస్తే దాదాపు 46 శాతం అధికంగా ఉంది. ఎయిర్‌లైన్స్ కంపెనీల మొత్తం నిర్వహణ ఖర్చులలో కేవలం ఇంధనం కోసమే 30 నుంచి 40 శాతం ఖర్చవుతోంది. రెండో కారణం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం. విమానాల లీజు అలాగే మెయింటెనెన్స్ ఖర్చులు డాలర్లలో చెల్లించాల్సి రావడంతో కంపెనీలపై భారం పడుతోంది. మూడోది పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ విమాన మార్గాలు మారి ప్రయాణ దూరం పెరగడం.
ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త నిబంధనలు
విమాన ఛార్జీల అంతులేని పెరుగుదలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకువస్తోంది. దీని ప్రకారం ఎయిర్‌లైన్స్ కంపెనీలు తమ టికెట్ ధరల నిర్మాణాన్ని కనీసం ఒక నెల ముందే పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA) సంస్థకు సమర్పించి తమ అధికారిక వెబ్సైట్లో తప్పనిసరిగా ప్రదర్శించాలి. అయితే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చినా పండుగ సీజన్లలో లేదా సాధారణ రోజుల్లో టికెట్ ధరలు భారీగా తగ్గిపోతాయని కచ్చితంగా చెప్పలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంధన ధరలు తగ్గితేనే ప్రయాణికులకు శాశ్వత ఉపశమనం లభిస్తుంది.