Stock Market : స్టాక్ మార్కెట్ అతలాకుతలం.. 900 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్, రూ.6 లక్షల కోట్లు గోవిందా
900 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్, రూ.6 లక్షల కోట్లు గోవిందా
Stock Market : భారతీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం ఉదయం ఇన్వెస్టర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. గురువారం సెలవు ముగించుకుని, ఈరోజు ట్రేడింగ్ ప్రారంభించిన దలాల్ స్ట్రీట్ నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, అమెరికా అధ్యక్షుడి ప్రకటనలు మార్కెట్‌ను అతలాకుతలం చేశాయి. కేవలం కొద్ది నిమిషాల్లోనే ఇన్వెస్టర్ల సొమ్ము రూ.6 లక్షల కోట్లు ఆవిరైపోయింది.
శుక్రవారం ఉదయం మార్కెట్ ప్రారంభం కావడమే భారీ నష్టాలతో మొదలైంది. ఉదయం 10 గంటల సమయానికి సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా క్షీణించి 74,347 వద్ద ట్రేడ్ అయింది. మరోవైపు నిఫ్టీ కూడా 300 పాయింట్లు పడిపోయి 23,026 స్థాయికి చేరుకుంది. దీనివల్ల బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.431 లక్షల కోట్ల నుంచి రూ.425 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే చూస్తుండగానే ఇన్వెస్టర్లు రూ.6 లక్షల కోట్లు నష్టపోయారు. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు కూడా 1 శాతానికి పైగా పతనమయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్ల సెగ
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిరత భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికాలోని నాస్‌డాక్, ఎస్ అండ్ పీ 500 సూచీలు దాదాపు 2 శాతం పడిపోవడంతో ఆ సెగ మనకూ తగిలింది. ఆసియా మార్కెట్లయిన నిక్కీ 225, కోస్పి కూడా 2 శాతం మేర నష్టాల్లో ఉండటంతో భారతీయ ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోయారు. పశ్చిమాసియాలో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని అనిశ్చితి మార్కెట్లను మరింత భయపెడుతోంది.
ట్రంప్ ప్రకటనతో అయోమయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇన్వెస్టర్లను ఆలోచనలో పడేశాయి. ఏప్రిల్ 6 వరకు ఇరాన్ లోని ఇంధన స్థావరాలపై దాడులను అమెరికా వాయిదా వేస్తుందని ఆయన చెప్పారు. కానీ, మరోవైపు యుద్ధం ముగిసేలోపే ఇరాన్ సైనిక శక్తిని తుడిచిపెట్టాలని ఇజ్రాయెల్ పట్టుదలతో ఉంది. ఈ భిన్నమైన సంకేతాల వల్ల మార్కెట్‌లో ఒక క్లారిటీ లేకపోవడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే గ్యాస్, ఆయిల్ సరఫరాకు ఆటంకం కలిగి భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పాతాళానికి రూపాయి విలువ
డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ గతంలో ఎన్నడూ లేనంతగా 94.15 వద్దకు పడిపోయింది. గత నెల రోజుల్లోనే రూపాయి 3.5 శాతం క్షీణించడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతులు ప్రియమై, ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. ఇది విదేశీ ఇన్వెస్టర్లను (FIIs) కలవరపెడుతోంది, ఫలితంగా వారు భారత మార్కెట్ల నుండి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు.
బ్రెంట్ క్రూడ్ బాంబు
ఇరాన్ ఉద్రిక్తతల వల్ల బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 108 డాలర్లకు చేరుకుంది. భారత్ తన చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఆధారపడుతుంది. చమురు ధరలు పెరిగితే కంపెనీల తయారీ ఖర్చులు పెరిగి, వాటి లాభాలు తగ్గుతాయి. ఇదే ఆందోళన ఇప్పుడు మార్కెట్‌లో కనిపిస్తోంది. యుద్ధం చల్లారి చమురు ధరలు తగ్గితే తప్ప మార్కెట్ మళ్లీ కోలుకోవడం కష్టమని ఆర్థిక విశ్లేషకుడు వి.కె. విజయకుమార్ అభిప్రాయపడ్డారు.