Jobs: డేటా సెంటర్లతో మారనున్న భారత్ స్వరూపం.. 2030 నాటికి 4.33 లక్షల కొత్త ఉద్యోగాలు
2030 నాటికి 4.33 లక్షల కొత్త ఉద్యోగాలు
Jobs: భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న డేటా సెంటర్లు కేవలం సాంకేతిక రంగాన్నే కాకుండా ఉద్యోగావకాశాలు, రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి. ప్రముఖ ప్రాప్‌టెక్ సంస్థ స్క్వేర్ యార్డ్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. దేశంలో ప్రతిపాదిత డేటా సెంటర్ ప్రాజెక్టుల ద్వారా 2030 నాటికి దాదాపు 4.33 లక్షల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. దీనితో పాటు దాదాపు 19.5 కోట్ల చదరపు అడుగుల నివాస గృహాల (రియల్ ఎస్టేట్) డిమాండ్ కూడా పెరుగుతుందని అంచనా వేశారు.
డేటా సెంటర్ల చుట్టూ గోల్డెన్ రింగ్ ఎఫెక్ట్
ఈ నివేదికలో డేటా సెంటర్ల ప్రభావాన్ని డోనట్ ఎఫెక్ట్‌గా పేర్కొన్నారు. డేటా సెంటర్ ప్రాంగణంలో నేరుగా కంటే, దాని చుట్టూ ఉన్న 5 నుంచి 15 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు అత్యంత వేగంగా పుంజుకుంటాయి. ఈ ప్రాంతాన్ని గోల్డెన్ రింగ్‌గా అభివర్ణించారు. డేటా సెంటర్లు ఏర్పాటు చేసే చోట రవాణా, విద్యుత్, ఫైబర్ ఇంటర్నెట్, లాజిస్టిక్స్ మెరుగుపడటంతో పాటు కొత్త టౌన్‌షిప్‌లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, పాఠశాలలు అభివృద్ధి చెందుతాయి. దీనితో ఈ ప్రాంతాలు కొత్త అర్బన్ కారిడార్లుగా మారనున్నాయి.
తెలుగు రాష్ట్రాలలో ఇళ్ల డిమాండ్ అంచనాలు
డేటా సెంటర్ల విస్తరణ కారణంగా ఇళ్ల డిమాండ్ పెరిగే రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర (5.4 కోట్ల చదరపు అడుగులు) మొదటి స్థానంలో ఉండగా, కర్ణాటక (2.8 కోట్ల చ.అ) రెండో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ సుమారు 2.3 కోట్ల చదరపు అడుగుల ఇళ్ల డిమాండ్‌తో మూడో స్థానంలో ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2.16 కోట్ల చదరపు అడుగుల నివాస స్థలాల డిమాండ్ ఏర్పడనుంది. తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో కూడా ఇళ్లకు భారీ డిమాండ్ ఏర్పడనుంది.
భవిష్యత్తులో విస్తరణకు అపార అవకాశాలు
ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే డిజిటల్ డేటాలో భారత్ వాటా దాదాపు 20 శాతంగా ఉండగా, ప్రపంచ డేటా సెంటర్ సామర్థ్యంలో భారత్ వాటా కేవలం 4 శాతం మాత్రమే ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ రంగాల వేగవంతమైన వృద్ధి కారణంగా రాబోయే రోజుల్లో దేశంలో 9,030 మెగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యం అదనంగా పెరగనుంది. ఈ ప్రభావం కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా టైర్-2, టైర్-3 నగరాలకు కూడా విస్తరించనుందని నివేదిక పేర్కొంది.