DGCA New Rules : ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ.. ఇక నుంచి ఫ్లైట్ లో మీకు నచ్చిన మూలలో ఫ్రీగా కూర్చోవచ్చు
ఇక నుంచి ఫ్లైట్ లో మీకు నచ్చిన మూలలో ఫ్రీగా కూర్చోవచ్చు
DGCA New Rules : విమాన ప్రయాణం అంటేనే టికెట్ ధరలతో పాటు అదనపు ఖర్చుల భయం ఉంటుంది. ముఖ్యంగా మనకు నచ్చిన సీటును, విండో సీటును లేదా కుటుంబ సభ్యులతో కలిసి కూర్చోవడానికి సీట్లను ఎంచుకోవాలంటే విమాన సంస్థలు వందల నుంచి వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి. ఇప్పటివరకు కేవలం 20 శాతం సీట్లు మాత్రమే ఉచితంగా లభించేవి, మిగిలిన 80 శాతం సీట్లకు రూ.200 నుంచి రూ.2,100 వరకు అదనంగా చెల్లించాల్సి వచ్చేది. అయితే, ఈ భారాన్ని తగ్గిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సంచలన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 20 నుంచి ప్రతి విమానంలో కనీసం 60 శాతం సీట్లను ఎటువంటి అదనపు రుసుము లేకుండా ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.
ఒకే PNR ఉంటే పక్కపక్కనే సీట్లు
చాలామంది కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసి ప్రయాణించేటప్పుడు ఒకేసారి టికెట్లు బుక్ చేసుకున్నా (ఒకే PNR), విమానంలో మాత్రం వేర్వేరు మూలల్లో సీట్లు కేటాయించడం సాధారణమైపోయింది. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యను పరిష్కరిస్తూ డీజీసీఏ కొత్త నిబంధనను చేర్చింది. ఇకపై ఒకే పీఎన్ఆర్ కింద బుక్ అయిన ప్రయాణికులకు సాధ్యమైనంత వరకు ఒకే వరుసలో లేదా పక్కపక్కనే సీట్లు కేటాయించడం విమాన సంస్థల బాధ్యత. అంతేకాకుండా, క్రీడా సామాగ్రి లేదా సంగీత వాయిద్యాల రవాణా ఛార్జీల విషయంలో కూడా పారదర్శకత ఉండాలని, వెబ్‌సైట్లలో ఈ వివరాలన్నీ స్పష్టంగా ఉంచాలని స్పష్టం చేసింది.
విమాన సంస్థల గగ్గోలు.. పెరగనున్న టికెట్ ధరలు?
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సామాన్య ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తుంటే, విమానయాన సంస్థలు మాత్రం మండిపడుతున్నాయి. ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్ వంటి కంపెనీలు కేంద్రానికి లేఖ రాస్తూ తమ అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. సీట్ల ఎంపిక ద్వారా వచ్చే ఆదాయం తమ రెవెన్యూలో కీలకమని, ఇప్పుడు 60 శాతం సీట్లు ఉచితంగా ఇస్తే తాము భారీగా నష్టపోతామని వాదిస్తున్నాయి. ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి బేసిక్ విమాన ఛార్జీలను పెంచక తప్పదని హెచ్చరిస్తున్నాయి. అంటే, ఒక రకంగా సీట్ల ఛార్జీలను తగ్గించి, టికెట్ ధరలను పెంచే దిశగా కంపెనీలు అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది.